– కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ వినతి
హైదరాబాద్: చిట్ ఫండ్ సంస్థల రుసుములు, ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీ ని ఐదు శాతానికి తగ్గించేలా ప్రయత్నం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజా భవన్ లో ఫెడరేషన్ నాయకులు డిప్యూటీ సీఎంను కలిశారు.
18 శాతం జీఎస్టీ వసూలు మూలంగా ఆధరైజ్డ్, చిట్ ఫండ్ సంస్థలు కనుమరుగై ప్రైవేటు సంస్థలు పెరుగుతున్నాయని వారు విజ్ఞప్తి చేశారు. అనాధరైజ్డ్ సంస్థలు పెరగడం మూలంగా మోసాలు పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం లేదని తెలిపారు. ఈ అంశంలో చిట్ ఫండ్ ఫెడరేషన్ తో సహకరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలని, ఇప్పటికే తమ ఫెడరేషన్ ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఫెడరేషన్ చైర్మన్ పి .రాజాజీ, ప్రెసిడెంట్ కే. శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ ఎల్. సుమన్, కోశాధికారి రమేష్ తదితరులు ఉన్నారు