– 14న విశాఖకు జేపీ నడ్డా రాక
– 22వ తేదీన రాష్ట్ర వ్యాప్త సంబరాలు
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడి
విశాఖపట్నం: సరళీకృత జీఎస్టీ ఈ నెల 22వ తేదీ నుంచి అమలు జరుగుతున్న నేపథ్యంలో అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నట్టు బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. సాగర తీరంలో మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. 2017 లో జీఎస్టీ అమలు లోకి వచ్చిందని, అయితే జీఎస్టీ రెండు అంచెలకు తీసుకు వచ్చి దేశ ప్రజలు కు ఊరట నిచ్చే విధంగా సరళీకరణ చేశారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని, రైతాంగానికి అవసరమైన వస్తువులు ధరలు తగ్గుతాయని తెలిపారు. నిర్మాణ రంగానికి ఉపశమనం కలుగుతుందని, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించిందని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు అన్నివర్గాలలో ఆనందాన్ని ఇస్తోందన్నారు. హానికరమైన పదార్థాలపై జీఎస్టీ పెంచడం మేలుగా భావించాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుతో అన్నివర్గాల ప్రజలకు దసరా, దీపావళి సంక్రాంతి పండుగ సంబరాలు ముందే వచ్చాయన్న ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు.
జగత్ ప్రకాష్ నడ్డా రాక
విశాఖ నగరానికి ఈనెల 14వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రానున్నారని మాధవ్ తెలిపారు. విశాఖ లో రైల్వే గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. సారథ్యం యాత్ర ముగింపు కార్యక్రమానికి నడ్డా రానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మురళీ పరుశురాం రాజు అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జి కేశవ్ కాంత్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, ఆర్టీఐ కన్వీనర్ వెంగమాంబ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.