Suryaa.co.in

Editorial

మంత్రి అమర్‌నాధ్‌ మీడియా బాధ అంతింత కాదయా?

-అమరన్నా.. నువ్వు సూపర్!
– రామోజీ-రాధాకృష్ణ -నాయుడు నాన్ రెసిడెంట్ ఆంధ్రులట
– వాళ్లంతా హైదరాబాద్ వాసులేనన్న మంత్రి అమర్‌నాధ్
– ఆంధ్రాలో ఉండేవాళ్లకే మీడియా నడిపే అర్హత ఉందా?
– వాళ్లే ఆంధ్రా గురించి ఆలోచించాలా?
– మరి ఆంగ్ల పత్రికలన్నీ ఆంధ్రోళ్లవేనా అమరన్నా?
– వారికి ప్రకటనలు ఎలా ఇస్తున్నారు?
– హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో వైసీపీ మీడియా సంగతేమిటి?
– ఆ ప్రభుత్వాలను విమర్శించే నైతిక హక్కు వైసీపీ మీడియాకు ఉందా?
– పక్క రాష్ట్రాల వారికి ఎంపీ, సలహాదారుల పదవులెలా ఇచ్చారు?
– గుజరాతీ పరిమళ్ నత్వానీకి ఎంపీ సీటెలా ఇచ్చారు?
– సుప్రీంకోర్టులో ఉత్తరాది లాయర్లు ఎందుకు? తెలుగు వారు లేరా?
– తెలంగాణలో వైసీపీ నేతలు కాంట్రాక్టులెలా చేస్తున్నారు?
– మంత్రి విమర్శల ప్రకారమైతే అది తప్పే కదా?
– గుడివాడ విమర్శలతో తెరపైకి ప్రతి విమర్శలు
– మంత్రి అమర్నాధ్ వ్యాఖ్యలతో తలపట్టుకుంటున్న వైసీపీ తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘చంద్రబాబునాయుడు, పవన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు వీళ్లంతా నాన్ రెసిడెంట్స్ ఆంధ్రా వాసులు. రామోజీ-రాధాకృష్ణ ఎప్పుడూ ఆంధ్రాకు వచ్చింది లేదు. రాదాకృష్ణకు అసలు ఆంధ్రాతో ఎలాంటి సంబంధం లేదు. వీళ్లంతా హైదరాబాద్‌లో కోట్లు సంపాదించుకుని, ఆంధ్రాలో జగన్‌పై విషం చిమ్ముతున్నారు. సంపాదించుకునేందుకే వీరంతా ఆంధ్రాకు వచ్చారు’’- ఇదీ.. ఏపీ ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్‌నాధ్ తాజాగా సెలవిచ్చిన సందేశం.

మంచిదే. అమరన్నకు ఆంధ్రాపై ఉన్న ప్రాంతీయాభిమానం చూస్తే, ఎస్వీరంగారావు అదేదో సినిమాలో చెప్పినట్లు..అరడజను వీరతాళ్లు వేసినా తప్పులేదు. కానీ రాజకీయ నేతలు ఏదైనా ప్రకటన చేస్తే, దాని పర్యవసానాల గురించి ఆలోచించాలి. తమ కింద నలుపు గురించి ఓసారి ఆలోచించాలి. లేకపోతే కొంప కొల్లేరవుతుంది. ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్‌నాధ్ చేసిన ప్రకటన కూడా, తమ పార్టీ కొంప కొల్లేరు చేసిందన్నది వైసీపేయుల వేదన.. వాదన.. రోదన.

అమర్నానాధ్ లాజిక్కు ప్రకారం.. కేవలం ఏపీలో ఉంటూ మీడియా సంస్థలు నడిపే వారికే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుంటుందన్నది ఆయన కవిహృదయం. రైటే. దాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. పొలిటికల్ టూరిస్టులంటూ, చంద్రబాబు-పవన్‌పై జమిలిగా చేసిన ఆరోపణలూ కాసేపు రైటనుకుందాం. హైదరాబాద్‌లో ఉండే రామోజీ-రాధాకృష్ణ-టీవీ5 నాయుడుకు, జగనన్నను విమర్శించే హక్కు లేదన్నది అమర్నాధన్న వాదన. అంటే జగనన్నను విమర్శించాలంటే.. సదరు విమర్శకులంతా ఆంధ్రా గడ్డపైనే జీవిస్తూ ఉండాలన్నమాట. ఆంధ్రాలో జీవించని మీడియా సంస్థల యజమానులకెవరికీ, జగనన్నను విమర్శించే హక్కు లేదన్నది అమర్నాధన్న కుండబద్దలు కొట్టిన అసలు సంగతి.

రైట్. మంత్రి గుడివాడ అమర్నాధన్న వాదనే నిజమైతే… హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా వైసీపీ అధికార మీడియా ఎడిషన్లు ఉన్నాయి. ఆ ప్రకారంగా.. అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై, విమర్శలు గుప్పిస్తూ కథనాలు రాస్తుంటాయి. మరి నిజంగా అమర్నాధన్న మాట ప్రకారమైతే అయితే… ఆంధ్రా మీడియాకు, అక్కడి ప్రభుత్వాలను విమర్శించే నైతిక హక్కు ఎక్కుడుందన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

అక్కడ వైసీపీ మీడియా విమర్శలు రైటయితే.. ఆంధ్రాలో ఈనాడు- ఆంధ్రజ్యోతి-ఏబీఎన్-టీవీ 5 విమర్శలు కూడా కరెక్టే కదా అన్నది బుర్ర-బుద్ధీ ఉన్న వారి ప్రశ్న. ఇక చంద్రబాబు-పవన్ పొలిటికల్ టూరిస్టులయితే.. తెలంగాణ-ఢిల్లీ-ముంబయిలో నివసించే వైసీపీ ఎంపీలు- సలహాదారులు కూడా సహజంగా పొలిటికల్ టూరిస్టులవుతారన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య.

లోకల్ స్లోగన్ అందుకున్న మంత్రి అమర్.. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలో వైసీపేయులు కాంట్రాక్టులు చేయడాన్ని కూడా, అదే నోటితో ప్రశ్నిస్తే సరిపోయేది కదా? ఇంకొంచెం లోతుల్లోకి వెళితే… ఆంధ్రాలో హిందు, టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ఇంగ్లీషు పత్రికలు కూడా అచ్చవుతున్నాయి. వాటి యజమానులంతా ఏ తాడేపల్లిలోనో.. బెంచిసర్కిల్లోనో..ఏ ఏలూరు రోడ్‌లోనో..ఏ కృష్ణలంకలోనో.. ఏ మొగల్రాజపురంలోనో.. ఏ సూర్యారావుపేటలోనే.. ఏ సింగ్ నగర్‌లోనో ఉండరు.

వారంతా బతికేది ఢిల్లీ, ముంబయ్, చెన్నైల్లో! మరి వాళ్లంతా ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్నందున, వారి పత్రికలకు ప్రకటనలు ఇవ్వకూడదు కదా? అయినా సరే కోట్లాది రూపాయల యాడ్స్ ఎలా ఇస్తున్నారు? ఉత్తరాది మీడియా సంస్థకు వందల కోట్లు కాంట్రాక్టు ఇచ్చి, జాతీయ స్థాయిలో ప్రమోషన్ కాంట్రాక్టు, ఎలా కట్టబెట్టారన్నది బుద్ధిజీవుల సందేహం.

మంత్రి అమర్నాధన్న లాజక్కు ప్రకారమైతే.. ఆంధ్రాలో జీవించని వారి మీడియాకి ప్రకటనలు ఇవ్వకూడదు కదా? ఆ లెక్కన ఆ ఇంగ్లీషు పత్రిక యజమానులెవరూ, బెజవాడలో ఉండకపోయినా ప్రకటనలు ఎలా ఇస్తున్నట్లు? జగనన్న సర్కారు, ఆంధ్రాలో జీవించని.. అదానీ, అంబానీ, ఇంకా గుజరాతీ కంపెనీలు.. హైదరాబాద్ ఆసాములకు ఇస్తున్న కాంట్రాక్టులు కూడా తప్పే కదా? ఏ ప్రాతిపదికన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నట్లు? ఆ లెక్కన తెలంగాణకు చెందిన వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు కదా? మరెందుకు ఇస్తున్నట్లు? మంత్రి గారే వీటికి సమాధానం ఇస్తే బహు బాగుంటుంది కదా?!

మంత్రి అమర్నాధ్ లాజిక్కు ప్రకారమే చూసినా… ఆంధ్రా వాడు కాని, గుజరాతీ అయిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు కదా? మంత్రి అమరన్న లాజిక్కు ప్రకారమైతే గుజరాతీ వాడికి ఎంపీ సీటు ఇవ్వడం నిషిద్ధమే కదా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి, ఎంపీ సీటివ్వడం తప్పే కదా? తెలంగాణలో ఫార్మా కంపెనీ ఓనరుకు, రాజ్యసభ సీటివ్వడం కూడా తప్పున్నర తప్పే కదా? ఏపీకి చెందిన శాండ్, మైన్ కాంట్రాక్టులన్నీ.. పరాయి రాష్ట్రాలకు చెందిన కంపెనీలకు కట్టబెట్టడం తప్పే కదా? పక్క రాష్ట్రంలో వైసీపీ నేతలంతా కాంట్రాక్టులు కూడా తీసుకోవడం అనైతికమే కదా?

తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు చేసిన జర్నలిస్టు విప్లవ వీరులకు, ఆంధ్రాలో సలహాదారు పదవులివ్వడం భావ్యమేనా బాసూ? ఇవ్వడం సరే. తీసుకోవడానికి వారికి మనసెలా ఒప్పింది? పరాయి రాష్ట్రంలో మాకెందుకు పదవులని తిరస్కరించకుండా, అందిన పదవులు ఆబగా నిస్సిగ్గుగా తీసుకోవడమే.. సిగ్గుమాలినతనంగా ఎందుకు భావించలేదన్నది సగటు ఆంధ్రోడు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం!

సుప్రీంకోర్టులో కేసుల పేరిట తెలంగాణ వ్యక్తులకు, కోట్లకు కోట్లు ఏపీ ప్రజాదనం ధారాదత్తం చేయడం అన్యాయమే కదా? అన్నది బుద్ధి జీవుల డౌటనుమానం! మరి ఇవన్నీ కరెస్టే అయితే.. రామోజీ-రాధాకృష్ణ -టీవీ 5 నాయుడు ఏపీలో మీడియా నడపటం కూడా కరస్టే కదా? అన్నది అదే బుద్ధిజీవుల ఆన్సరు!

మంత్రి అమర్నాధ్ లాజిక్కే నిజమైతే.. ఆంధ్రా రెసిడెంటు అయిన జగనన్న.. తెలంగాణ, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో మీడియా సంస్థలు ఎలా నడుపుతారు? అందుకు ఏం నైతిక హక్కు ఉంది? అక్కడి ప్రభుత్వ పాలనను విమర్శించడం అనైతికమే కదా? ఆ ప్రకారంగా అక్కడ వాటిని మూసేయాలి కదా? తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు-న్యాయవాదులు- జర్నలిస్టులకు, ఆంధ్రా ప్రజల సొమ్ము తేరగా-అప్పనంగా పంచడం అన్యాయమే కదా? దీన్ని అమర్నాధన్న మంత్రివర్గంలో జగనన్నను ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ ప్రజల సొమ్ము తేరగా తీసుకునేందుకు వారికంటే…. ఏమీ లేదనుకుందాం. ఇస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? మంత్రి గారి భాషలో అది నైతికమా? అనైతికమా?

సుప్రీంకోర్టులో కేసులకు ఉత్తరాది-తెలంగాణ లాయర్లు ఎందుకు? ఆంధ్రా వాళ్లు లేరా? ఆంధ్రా లాయర్లకు ఆ కేసులు వాదించే దమ్ము లేదా? అసలు తెలంగాణలో వైసీపీ నేతలు కాంట్రాక్టులు ఎందుకు చేస్తున్నారు? అన్నది బుద్ధి జీవుల సందేహం. ఇలాంటి ప్రకటనల చేసే ముందు.. మన కింద నలుపు కూడా చూసుకోకపోతే, అడ్డంగా బుక్కవుతామన్నది వైసీపీ సీనియర్ల వాదన. మరి మంత్రి గుడివాడ అమరన్న ఏమంటారో?!

ఇంతకూ… ఏపీలో రామోజీ-రాధాకృష్ణ-టీవీ 5 నాయుడు ఉనికిని ప్రశ్నిస్తున్న మంత్రి అమర్నాధ్… ఆంధ్రులు కాని ఉత్తరాది మీడియా యజమానులు నడిపే మీడియాకు, ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణ జర్నలిస్టు వీరులు-లీడర్లు-లాయర్లకు సలహాదారులు, ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారని జగనన్నను నిలదీశారా? లేదా? అన్నదే సందేహం!

LEAVE A RESPONSE