– పుష్కరం తర్వాత పూర్తయిన రెండో దశ పనులు
గుండ్లకమ్మ – దర్శి మధ్య కొత్త రైల్వే లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. నడికుడి – శ్రీకాళహస్తి సెక్షన్లో 27 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో నడపడానికి అనుమతించినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నడికుడి – శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ముఖ్యమైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని ఎగువ ప్రాంతాలను కలుపుతూ కొత్త ప్రాంతాలతో ఏర్పాటు చేసిన రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తూ ట్రాక్ పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టును 2011-12 సంవత్సరంలో 309 కి.మీ మేర రూ.2,289 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. భారతీయ రైల్వేతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య 50 శాతం వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే ఒప్పందంపై ఈ నిర్మాణం చేపట్టారు.
ఐదు దశల్లో ప్రాజెక్టు నిర్మాణం:
మొదటి దశ : పిడుగురాళ్ల – శావల్యపురం (47 కి.మీ)
రెండవ దశ: గుండ్లకమ్మ – దర్శి (27 కి.మీ)
మూడవ దశ: దర్శి – కనిగిరి (52 కి.మీ), వెంకటగిరి – ఆల్తూరిపాడు (15 కి.మీ)
నాలుగవ దశ: కనిగిరి – పామూరు (35 కి.మీ), అట్లూరిపాడు – వెంకటాపురం (43 కి.మీ)
ఐదవ దశ: పామూరు – ఓబులాయపల్లె – వెంకటాపురం (90 కి.మీ) మధ్య చేపట్టాల్సి ఉండగా రెండు దశలు పూర్తయ్యాయి.
ఇప్పటికే మొదటి దశ పనుల పూర్తి:
పిడుగురాళ్ల – శావల్యాపురం మధ్య 47 కిలోమీటర్ల మేర మొదట దశ పనులు ఇప్పటికే పూర్తి చేసి విద్యుదీకరణతో పాటుగా ప్రారంభించింది. నడికుడి-పిడుగురాళ్ల మధ్య ఉన్న సెక్షన్ బీబీనగర్‌ను గుంటూరుతో కలిపే లైన్లో ఉంది. శావల్యాపురం-గుండ్లకమ్మ మధ్య ఉన్న సెక్షన్ గుంటూరును గుంతకల్‌తో కలిపే ప్రస్తుత రైలు మార్గంలో వస్తుంది. ఇప్పుడు, గుండ్లకమ్మ-దర్శి మధ్య 27 కి.మీ విస్తరణ పూర్తి చేసి ప్రారంభించడంతో నడికుడి – దర్శి మధ్య నిరంతరాయంగా 122 కిలోమీటర్ల రైలు మార్గం, రైలు రాకపోకల నిర్వహణకు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు నెట్వర్క్ విస్తరణలో ఈ ప్రాజెక్టు ను చేపట్టారు. విజయవాడ-చెన్నై మధ్య ప్రస్తుత కోస్టల్ రైల్వే లైన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా దీనిని ఉపయోగించవచ్చు.