బాబు, పవన్, రాజు, షర్మిల ఫోన్లూ ట్యాపింగ్?

– బాబు ఇంటి సమీపంలో ట్యాపింగ్ వాహనం?
– హైదరాబాద్‌లోని ఏపీ టీడీపీ నేతల ఫోన్లపైనా నిఘా
– రేవంత్ ఇంటిదగ్గరే ట్యాపింగ్ పరికరాలు
– షర్మిల నివాసం వద్ద కూడా నిఘా వాహనం?
– బీజేపీ నేత రఘునందన్, ఈటల ఫోన్ పైనా నిఘా
– నాటి మంత్రి ఆదేశాలతో కొండా సురేఖ, మురళి ఫోన్ల ట్యాపింగ్?
– కాంగ్రెస్-బీజేపీకి విరాళాలిచ్చే వారి ఫోన్లపై ట్యాపింగ్
– సిమెంటు కంపెనీ అధిపతులపైనా నిఘా
– సొంత నేతల ఫోన్లపైనా బీఆర్‌ఎస్ నిఘా చెవులు
– మలుపు తిరుగుతున్న పోలీసు ‘దొంగ చెవుల’ కేసు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నాటి పీసీసీ చీఫ్-నేటి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఆఫీసు తీసుకుని, అక్కడి నుంచే రేవంత్ ఇల్లు కేంద్రంగా ట్యాపింగ్ చేసిన నాటి పోలీసులు.. అదే దారిలో టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం వద్ద కూడా, ట్యాపింగ్ వాహనం ఏర్పాటుచేశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్‌లోని ఏపీ విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఆ సమాచారాన్ని ఏపీ సీఎం జగన్‌కు చేరవేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధానంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం లక్ష్యంగా ట్యాపింగ్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. జగన్‌పై పోరాట వ్యూహాలు తెలుసుకోవడం, టీడీపీకి సహకరించే పారిశ్రామికవేత్తల సంభాషణలు, ఆ పార్టీకి ఎవరెవరు నిధులు సమకూరుస్తున్నారన్న కోణంలో ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని, వాటిని ఎప్పటికప్పడు జగన్‌కు చేరవేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక జగన్‌పై పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసం వద్ద కూడా, ట్యాపింగ్ పరికరాలతో కూడిన వాహనం ఏర్పాటుచేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ చెల్లెలు షర్మిల నివాసం వద్ద కూడా, ఇలాంటి వాహనాన్నే చాలాకాలం ఉంచినట్లు సమాచారం. షర్మిలను ఎవరెవరు కలుస్తున్నారు? విజయమ్మను ఎవరు కలుస్తున్నారు? పాదయాత్ర సందర్భంగా వారు ఏ పారిశ్రామికవేత్తల నుంచి ఆర్ధికసాయం కోరారు? ఢిల్లీ,బెంగళూరు కాంగ్రెస్ నేతలతో షర్మిల ఏం మాట్లాడారు అన్న అంశాలను తెలుసుకుని, వాటిని జగన్‌కు చేరవేశారన్న చర్చ పోలీసువర్గాల్లో జరుగుతోంది.

జగన్‌పై తిరుగుబాటు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నివాసం వద్ద.. ఏపీ ఇంటలిజన్స్ పోలీసులు వెళ్లేందుకు అనుమతించిన నాటి బీఆర్‌ఎస్ సర్కారు.. ఆయన నివాసం వద్ద కూడా ఇలాంటి ప్రత్యేక వాహనాన్నే ఉంచినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాజు ఎవరితో మాట్లాడుతున్నారు? టీడీపీ-బీజేపీతోపాటు, న్యాయవాదులు, జర్నలిస్టులతో ఏం మాట్లాడారన్నది తెలుసుకుని, దానిని ఏపీ సర్కారుకు పంపించేవారట.

అటు రాజు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు ట్యాపింగ్ కేసులో నిజమయినట్లయింది. కాగా నాటి పోలీసు కమిషనర్ ఒకరు ఎంపి రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆయనను బదిలీ చేశారు. తెలంగాణ పోలీసుల అనుమతితోనే, నాడు రాజును అర్ధరాత్రి గుంటూరుకు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

కాగా ఉప ఎన్నిక ముందు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లతోపాటు, ఆయనకు నిధుల సాయం చేసిన వారి ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌పై తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేసిన ఉప ఎన్నికలోనూ, టాస్క్‌ఫోర్స్ పోలీసులే బీఆర్‌ఎస్ నిధులు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ప్రగతిభవన్‌లో ఒక తోడేలుంది. అదే అందరి ఫోన్లు ట్యాపింగ్‌చేస్తోంది’ అని ఒక సందర్భంలో ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే.

ప్రధానంగా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక నుంచి కాంగ్రెస్-బీజేపీకి వస్తున్న డబ్బును పోలీసులు పట్టుకోవడం వెనుక, ఈ ట్యాపింగే కారణమన్న చర్చ అప్పట్లోనే నడిచిన విషయం తెలిసింది. ముఖ్యంగా హవాలా ఆపరేటర్ల ఫోన్లపై నిఘా పెట్టిన నాటి టాస్క్‌ఫోర్స్ పోలీసులు, తర్వాత వారి ద్వారానే బీఆర్‌ఎస్‌కు పనులు చేసిపెట్టేవారన్న చర్చ జరిగింది.

అదేవిధంగా ఇప్పటి వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన ఆరోపణలు వస్తున్నాయి. ఆమె రాజకీయ శత్రువైన అప్పటి మంత్రి ఆదేశాలతోనే, భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు. కాగా కాంగ్రెస్‌లో కేసీఆర్‌ను వ్యతిరేకించే కరుడుగట్టిన నేతల ఫోన్లపై నిఘా ఉంచారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక ఉప ఎన్నికల్లో డబ్బును టాస్క్‌ఫోర్స్ పోలీసు వాహనాల ద్వారా పంపిణీ చేసిన బీఆర్‌ఎస్.. ప్రత్యర్ధుల నివాసాలు, ఆఫీసులలో సీజ్ చేసిన డబ్బులో చాలావరకూ దారిమళ్లించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయంలో నాటి సర్కారు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందంటున్నారు. పట్టుబడ్డ లెక్కలు చాలావరకూ బయటకు రాకుండా, నాటి టాస్క్‌ఫోర్స్ ప్రముఖులు మేనేజ్ చేశారంటున్నారు.

కాగా తన రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లపై నిఘా పెట్టిన నాటి కేసీఆర్ విచిత్రంగా.. సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లపైనా నిఘా పెట్టారన్న వార్తనే విస్మయం కలిగిస్తోంది. అందుకే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లలో మాట్లాడేందుకు భయపడేవారు. చివరకు పోలీసు అధికారులు సైతం.. తమ మిత్రులతో ఫోన్లలో మాట్లాడేందుకు భయపడి, మరొక నెంబర్లతో మాట్లాడే పరిస్థితి ఉండేది.

ఇక పలువురు సినిమా హీరోయిన్ల ఫోన్లపైనా ట్యాపింగ్ జరగడంపైనే అటు పోలీసు-ఇటు రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్ధులంటే వారి వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి, వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారనుకోవచ్చు. కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్లు.. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన హీరోయిన్లు ఏం మాట్లాడుతున్నారో వినడంపైనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అది ఎవరి కోసం? ఎందుకోసం? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఈ ట్యాపింగ్ పరికరాల సాయంతో ప్రత్యర్ధులు, సినిమా తార ల మాటలు ఎవరు విన్నారు? అది ప్రగతిభవన్ కేంద్రంగా జరిగిందా? లేక ఫాంహౌస్ కేంద్రంగా జరిగిందా? లేక ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భవనంలో ఏమైనా జరిగిందా అన్న దానిపై చర్చ జరుగుతోంది.

Leave a Reply