Home » చిక్కుల్లో సీఎస్ జవహర్‌రెడ్డి!

చిక్కుల్లో సీఎస్ జవహర్‌రెడ్డి!

– విశాఖలో వేలాది అసైన్డ్ ఎకరాలు కాజేశారని జనసేన ధ్వజం
– కొడుకు కోసమే ల్యాండ్ డీల్స్ చేశారన్న జనసేన నేత యాదవ్
– నిన్నటి వరకూ జగన్ సర్కారుకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు
– ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుపడ్డారన్న ఆరోపణలు
– ఆయన తొలగించాలని కూటమి ఫిర్యాదులు
– సొంత కులం వారికి ఐఏఎస్‌లు ఇప్పించాలన్న తపనపై విమర్శలు
– ఎన్నికల వరకూ ఆపాలని యుపీఎస్సీకి చంద్రబాబు లేఖ
– ఇప్పుడు ఏకంగా విశాఖ భూములపై జనసేన, టీడీపీ ఆరోపణలు
– సీబీఐతో విచారణకు కూటమి డిమాండ్
– జనసేన ఆరోపణలు ఖండించిన సీఎస్ జవహర్‌రెడ్డి
– ఆరోపణలతో సీఎస్ జవహర్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన రాష్ట్ర పాలనాధిపతి.. ప్రభుత్వ నిర్ణయాలను ఆయనే శాసిస్తుంటారు.. ఆయన పేరుపైనే ఉత్తర్వులకు ఊపిరిపోసుకుంటాయి.. ఎన్నికల సమయంలో ఆయనొక్కరిదే పెత్తనం. అలాంటి అధికారి పైనే శరపరంపరగా ఆరోపణల వెల్లువ.. సీఎం జగన్ సొంత జిల్లా, సొంత సామాజికవర్గం కావడంతో, విపక్షాలన్నీ కట్టుకట్టుకుని ఆయనపై విమర్శల వ ర్షం కురిపిస్తున్న వైనం.. సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులకు, ఐఏఎస్ ఇప్పించేందుకు ఉబలాటపడుతున్నారన్న ఆరోపణలు.

అసలు ఆయన ఆ సీట్లో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవు కాబట్టి, తక్షణమే ఆయనను తప్పించాలని విపక్షాల పట్టు. ఇన్ని విమర్శలు.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయనపై ఉన్నట్లుండి, కొడుకు కోసం ఉత్తరాంధ్రలో భూములు మింగేస్తున్నారంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలు. బహుశా.. ఏ పాలనాధికారిపైనా ఇన్ని ఆరోపణలు-విమర్శలు వచ్చి ఉండవు. ఇంతకూ ఏకకాలంలో, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పాలనాధిపతి పేరు1990 బ్యాచ్ ఐఏఎస్ డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి. ఏపీ సీఎస్!

సీఎం జగన్ సొంత కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి.. తన పదవీ విరమణకు నె లరోజుల ముందు, శరపరంపర ఆరోపణలు-విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఆయన, సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎన్డీయే కూటమి విరుచుకుపడుతోంది. డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, ఆయనను విధుల్లోకి తీసుకోలేదు. సాధారణంగా అయితే కోడ్ అమలులో ఉన్నందున సీఎస్ సొంత నిర్ణయం తీసుకుని, క్యాట్ ఆదేశాల మేరకు ఏబీకి పోస్టింగ్ ఇవ్వాలి.

కానీ ఆయన.. సీఎం జగన్ సూచనల మేరకు హైకోర్టులో ఆ తీర్పును సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో అసలు సీఎంకు ఎలాంటి ఫైళ్లు పంపించకూడదన్న నిబంధనలకు, ఇది విరుద్ధమన్నది కూటమి నేతల వాదన. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టుకు ఇచ్చిన బెయిల్‌ను, ప్రభుత్వం తరఫున ఆయన సుప్రీంకోర్టులో ఎందుకు సవాల్ చేయలేదన్నది మరికొందరి ప్రశ్న.

అయితే ఆ పని ఈసీ చేయాలని కొందరు-సీఎస్ చేయాలని మరికొందరు వాదిస్తున్నారు. అది వేరే విషయం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డెప్యుటేషన్ పొడిగించాలని, కేంద్రానికి లేఖ రాయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనకు పొడిగింపు ఇవ్వవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు లేఖ రాసినా ఆమె లేఖను పక్కకుబెట్టి, ధర్మారెడ్డికి పొడిగింపు ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

ఇక ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి గెలిపించేందుకు సీఎం జగన్, ఆయన కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఐపిఎస్ అధికారి రఘురామిరెడ్డితో కలసి జవహర్‌రెడ్డి పనిచేస్తున్నందున, ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని ఎన్డీయే కూటమి శరపరంపరగా డిమాండ్ చేస్తోంది. తాజాగా తన కులానికి చెందిన అధికారులకు, ఐఏఎస్ సిఫార్సు చేస్తూ రాసిన వైనం కూడా దుమారం సృష్టించింది. ఎంతోమంది అర్హులున్నా, వారికి సమాచారం ఇవ్వకుండా అన్యాయం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఐఏఎస్ ప్రమోషన్లకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, అటు వైసీపీనీ ఇరుకున పెట్టాయి. జగన్ సర్కారు కులతత్వంతో వ్యవహరిస్తోందని, ఇప్పటికే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చిన వాళ్లంతా రెడ్డి కులానికి చెందిన వారేనని.. మళ్లీ ఇప్పుడు కూడా రెడ్లకే ఐఏఎస్‌లు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారన్నది మీడియా కథనాల సారాంశం. దానిపై స్పందించిన టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబు , యుపీఎస్సీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ, ఐఏఎస్ ప్రమోటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని లేఖ రాశారు.

ఏకకాలంలో ఇన్ని విమర్శలు-వివాదాలు ఎదుర్కొంటున్న జవహర్‌రెడ్డిపై ఇప్పుడు.. కోడుకు కోసం ఉత్తరాంధ్రలో భూములు కాజేస్తున్నారన్న ఆరోపణలు చుట్టుముట్టడం శిరోభారంగా మారింది. మరో నెలలో పదవీ విరమణ చేయనున్న జవహర్‌రెడ్డిని, తాజా ఆరోపణలు చిక్కుల్లో నెట్టాయి. విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తాజాగా మీడియాను పిలిచి పెద్ద బాంబు పేల్చారు. ఉత్తరాంధ్రలో రెండువేల అసైన్డ్ భూములను, జవహర్‌రెడ్డి కొట్టేశారన్నది యాదవ్ ప్రధాన ఆరోపణ.

ఆయన ఒత్తిడితో వందలాది ఎకరాలు ఇప్పటికే చేతులు మారి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని, ఆయన సీఎస్ అయిన తర్వాతనే జీఓ 596 ఇచ్చారన్నది మూర్తి యాదవ్ పేల్చిన మరో బాంబు. ఆ జీవో ఆధారంగా కుమారుడికి 800 ఎకరాలకు పైగా డీల్ చేయించారన్నది మూర్తి యాదవ్ తాజాగా పేల్చిన ల్యాండ్‌మైన్. దీనిలో పాత్ర ఉన్న ఐఏఎస్ అధికారులపై, సీబీఐతో విచారణ చేయించాలని ఆయన కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాయడం మరో సంచలనం.

వెంటనే మూర్తియాదవ్ ఆరోపణలను అందుకున్న, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా.. జవహర్‌రెడ్డి నీతిమాలిన చర్యకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ భూదోపిడీలో జవహర్‌రెడ్డి హస్తం ఉన్నందున, ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి చిక్కుల్లో పడేశారు. ఇక రేపో మాపో బీజేపీ కూడా రంగంలోకి దిగి, భూ కుంభకోణాలపై విచారణ జరపాలని.. నేరుగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, డీఏపీటీకి లేఖ రాస్తే, జవహర్‌కు చిక్కులు తప్పవన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అయితే జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ చేసిన ఆరోపణలు సత్యదూరమని, సీఎస్ జవహర్‌రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పకపోతే యాదవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సీఎస్ హెచ్చరించారు. అంతవరకూ బాగానే ఉంది. మరి అవే ఆరోపణలు చేసిన టీడీపీపై మాత్రం, జవహర్‌రెడ్డి మౌనంగా ఉండటమే ఆశ్చర్యం.

Leave a Reply