Suryaa.co.in

Editorial

గుండు కొట్టించుకోనున్న జగన్ ?

  • నెయ్యి వివాదంతో స్వామివారికి జగన్ తలనీలాలు

  • భార్య భారతీరెడ్డి సహా దర్శనానికి వస్తేనే హిందువుల్లో విశ్వాసం

  • మరి భారతీరెడ్డి కూడా తిరుమలకు వెళతారా?

  • టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చేందుకూ జగన్ సిద్ధం?

  • నకిలీ నెయ్యి మరక తొలగించుకోవాలంటే ఇదే మార్గం

  • లేకపోతే హిందువుల ఓట్లు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం

  • తాజా సంకటం నుంచి బయటపడేందుకు జగన్‌కు సన్నిహితుల సలహా ?

  • కాలినొప్పితో మెట్లమార్గం నడక రద్దు చేసుకున్న జగన్

  • నేరుగా తిరుమలకు వెళ్లనున్న జగన్

  • హిందూ సంస్థల నిరసనలు తప్పించునేందుకేనా?

  • వైసీపీ నేతలకు జగన్ షెడ్యూల్

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయనాయకులు తమ అవసరం కోసం ఏదైనా చేస్తారు. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. లేకపోతే పనులు కావు. జనంలో నమ్మకం కలిగించలేరు. ఎన్నికల ప్రచారంలో బెంజికారులో తిరిగే అభ్యర్ధులు, పేదవాడి బజ్జీ షాపులోకి వెళ్లి ఆమెను పక్కనబెట్టి మరీ బజ్జీలు వేస్తుంటారు. ఇస్త్రీ షాపులోకి వెళ్లి బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. ఆటో నడుపుతుంటారు. రిక్షావాడిని కూర్చోబెట్టుకుని తాము రిక్షా తొక్కుతుంటారు. పేదవాడి గుడిసెలోకి వెళ్లి టీ తాగుతుంటారు. చివరాఖరకు చిన్నపిల్లల మలమూత్రాలు చేతితో శుభ్రం చేస్తుంటారు. అదంతా ప్రచార, కోసమని ఓటర్లకు తెలుసు. తమ విన్యాసాలు ఓటర్లు నమ్మరని తెలిసినా, నమ్మించక తప్పదని అభ్యర్ధులకూ తెలుసు. ఇవన్నీ మనం ప్రతి ఎన్నికల ముందు మీడియాలో చూసేవే.

ఇప్పుడు మూడు నెలల నుంచి అధికార వియోగం అనుభవిస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా ఆ అవసరార్ధ రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అందుకోసం గుండు కొట్టించుకోవడానికీ సిద్ధమవుతున్నారా? తిరుమల నెయ్యిలో అపచారనింద తొలగించుకునేందుకు, జగన్ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారా?

జగన్ జమానాలో తిరుమల శ్రీవారి నెయ్యితో తయారుచేసిన లడ్డులో.. జంతుకళేబరాల కొవ్వు ఉందన్న నివేదిక, హిందూ సమాజంలో ఇంకా ప్రళయం సృష్టిస్తూనే ఉంది. ఆ అపచారానికి నిరసనగా ప్రపంచంలోని హిందువులంతా భగ్గుమంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. స్వామీజీలు, మఠాధిపతులు తిరుమలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించి, బెజవాడ కనకదుర్గ ఆలయ మెట్లు శుద్ధి చేశారు. జనసైనికులు కూడా ఆయనను అనుసరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ యావత్ హిందూ సమాజం దృష్టిలో దోషిగా నిలబడ్డారు. ఆయన, ఆయన పార్టీ నేతలు కూటమి సర్కారుపై ఎన్ని ప్రశ్నలు సంధించినా, అన్ని వేళ్లూ జగన్ వైపే చూపిస్తున్న పరిస్థితి. ఈ అపచారం- సెంటిమెంట్ నుంచి బయటపడేందుకు.. జగన్ యావత్ ప్రపంచం నివ్వెరబోయే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.

భారతదేశంలో కులం-ప్రాంతం తర్వాత అత్యంత ప్రమాదకరమైన కార్డు మతం. మతం కార్డు సంధిస్తే ఎన్ని లాభాలు-మెరెన్నో నష్టాలు జరిగినట్లు అనుభవమే. అందుకే లడ్డుపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివాదంలో, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ అధినేత జగన్.. తన తిరుమల పర్యటనలో, స్వామివారికి తలనీలాలు సమర్పించాలని నిర్ణయించినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకూ జగన్‌పై హిందువులలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి తెరదించేందుకు.. ఇదొక్కటే పరిష్కారమార్గం అని, జగన్ సన్నిహితులు ఆయనకు సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానితో ఇప్పటిదాకా జగన్‌పై ఉన్న ‘హిందూవ్యతిరేకి’ ముద్ర చెరిగిపోవడమే కాక, ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేసేందుకు అదొక అస్త్రం అవుతుందని, ఆయన సన్నిహితులు వివరించినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఇప్పటివరకూ భార్యతో ఒక్కసారికూడా తిరుమలకు కలసి వెళ్లని జగన్ తీరు కూడా, తిరుమల లడ్డు ఎపిసోడ్‌లో మళ్లీ ఒక చర్చనీయాంశంగా మారింది. అందువల్ల భార్య భారతీరెడ్డితో కలసి తిరుమల వెళ్లడం ద్వారా, ఆ విమర్శలకు తెరదించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. జగన్ సీఎం కాకముందు.. అయిన తర్వాత కూడా, తిరుమల పర్యటనలో ఆయనొక్కడే కనిపించేవారు. పట్టువస్త్రాలు సమర్పించే సందర్భంలో కూడా, ఆయనొక్కడే రావడం విమర్శలకు గురయింది.

పైగా తిరుమలకు రాని భార తీరెడ్డి.. క్యాంపుఆఫీసుతో 3 కోట్ల రూపాయల తిరుమల సెట్టింగ్ వేసుకున్నారంటూ, టీడీపీ నేతలు అప్పట్లో విరుచుకుపడ్డారు. అందుకే ఈసారి భర్తతో కలసి తిరుమల వెళ్లడం ద్వారా, తనపై వస్తున్న ఈ విమర్శలకు తెరదించాలని ఆమెకు సూచించారట. దానితో జగన్ వెంట భారతీరెడ్డి కూడా తిరుమలకు వెళ్లే అవకాశం లేకపోలేదంటున్నారు. కానీ దీనిపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదంటున్నారు.

అదే సమయంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు.. తిరుమల వెళ్లిన సందర్భంలో తనకు స్వామివారు, హిందుత్వంపై నమ్మకం ఉందంటూ ఒక్కసారి కూడా డిక్లరేషన్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ విధంగా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని ఈఓ, జేఈఓ కూడా జగన్‌ను కోరే ధైర్యం చేయలేదు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తిరుమలకు వచ్చిన, నాటి కాంగ్రెస్ ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ ఎదుట.. డిక్లరేషన్ బుక్ పెట్టిన అధికారులపై, వైఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల పర్యటనలో సోనియాగాంధీ కూడా.. డిక్లరేషన్‌పై సంతకం పెట్టారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమె కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా మాత్రమే డిక్లరేషన్ ఇచ్చారని టీటీడీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

తాజాగా జగన్‌పై తిరుమల లడ్డు అపచార వివాదం నేపథ్యంలో.. డిక్లరేషన్ ఇస్తే, హిందువులకు సంబంధించిన అన్ని అనుమానాలకు శాశ్వతంగా తెరదించవచ్చని, ఆయన సన్నిహితులు జగన్‌కు సూచించినట్లు సమాచారం. అబ్దుల్ కలాం, ఫరూఖ్ అబ్దుల్లా వంటి పెద్ద నేతలు డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, తమ మత ఆచారాలు అనుసరించారని జగన్‌కు గుర్తు చేశారట.

తమకు హిందూమతంపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చినంతమాత్రాన వచ్చిన నష్టం లేకపోగా, రాజకీయంగా లాభమేనని విశ్లేషించారట. పైగా దీనివ ల్ల ఇప్పటిదాకా జగన్‌పై వస్తున్న హిందూ వ్యతిరేకి, క్రైస్తవ అనుకూలవాది అన్న విమర్శలకు, ఈ ఒక్క పర్యటన శాశ్వతంగా తెరదించుతుందని ఆయనకు సూచించారట.

అన్నింటికంటే ముఖ్యంగా.. జగన్ శ్రీవారికి తలనీలాలు సమర్పించడం ద్వారా, అందరినోళ్లు శాశ్వతంగా మూయించినట్టవుతుందన్న సన్నిహితుల సూచన, జగన్ ఎంతవరకూ అమలు చేస్తారో చూడాలి. అయితే వారి సూచనను జగన్ సానుకూలంగా విన్నారని చెబుతున్నందున.. తలనీలాల విషయంలో జగన్ ఎలాంటి సంచలనం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

‘జగన్ గారి మనస్తత్వం, మొండితనం, పట్టుదల, ఏదైనా చేసేందుకు తెగించే గుణం, ఎదుటివాళ్లను అడ్డంగా ఇరికించే నైజం ప్రకారం ఆయన రేపు తిరుమలలో శ్రీవారికి తలనీలాలు అర్పించి, డిక్లరేషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కాకపోతే జగన్ గారి వెంట భారతీరెడ్డి ఎంతవరకూ వెళతారో చెప్పలేం. ఆమె కూడా వెళితే బాగుంటుందనే అంతా చెప్పారు’’అని జగన్‌కు సన్నిహితుడైన ఓ సీనియర్ నాయకుడు చెప్పారు.

ఇదిలాఉండగా.. నిజానికి జగన్ అలిపిరి నుంచి కాలినడకన, మెట్లమార్గం ద్వారా తిరుమలకు చేరుకోవలసి ఉంది. అయితే జగన్ కాలినొప్పితో బాధపడుతున్నందున, ఆయన నేరుగా తిరుమల వెళ్లి, రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని, మరుసటిరోజు శ్రీవారిని దర్శనం చేసుకుంటారని వైసీపీ నేతలకు తాజాగా సమాచారం అందింది.

అయితే జగన్ రాక సందర్భంగా.. తిరుమల లడ్డు అపచారానికి కారణం ఆయననేంటూ, తిరుమల వస్తున్న జగన్‌కు వ్యతిరేకంగా నిరసన చేసేందుకు హిందూసంస్థలు సిద్ధమవుతున్నాయి. కూటమి కార్యకర్తలు కూడా నిరసనలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో కాలిబాటన వెళితే.. నిరసన కారుల నుంచి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందుకే, కాలినొప్పి పేరుతో నడక ప్రయాణం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE