పాటలతో పరమపదానికి బాటలు వేసిన మహనీయుడికి మరుగుదొడ్ల బాట చూపించారు..తన గంధర్వ గానంతో ప్రపంచాన్నే మెప్పించి ఆ ప్రపంచం నాలుగు మూలలూ చుట్టి వచ్చిన మహాగాయకుడికి జరగరాని అవమానం చేసేశారు. ఎక్కడికి వెళ్ళినా అభిమానుల నీరాజనాలు అందుకున్న అపురూప కళాకారుడిని దుర్గంధ భూయిష్టమైన మరుగుదొడ్ల చెంతకు చేర్చి ఇక్కట్ల పాల్జేసారు…మహమ్మారి కరోనా ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే మహా వ్యక్తిని ఒకసారి చంపేస్తే పాలకులు అదే బాలుని మరోసారి కసిదీరా చంపేశారు..బాలు.. ఇక చాలు…ఇంతకంటే ఈ రాష్ట్రం నీకిచ్చే గౌ(రౌ)రవం ఇంకేం కావాలి..!?
అడుగడుగునా మహానేతలు..మహామహుల విగ్రహాలు దర్శనమిచ్చే ఈ తెలుగుగడ్డపై బాలసుబ్రమణ్యం అనే కళాస్రష్ట విగ్రహం నిలిపి ఉంచడానికి ఇంత చోటే లేకుండా పోయింది. నిషేధించినా కూడా ఊళ్లకు ఊళ్లే నాయకుల ఫ్లెక్సీలతో మిందిపోయే రాజ్యంలో తన గానమాధుర్యంతో కోట్లాది జనాలను అలరించిన మహా గాయకుడి విగ్రహానికి మరుగుదొడ్డి ఒడ్డు తప్పించి మరో చోటే దొరకని భయంకర అవమానం చేసిన నేతలను చూసి బాలు అనే వ్యక్తి..దొరకునా ఇటువంటి సేవ అని గద్గద స్వరంతో విలపించుకుండునా..!
ఇది గుంటూరులో జరిగిన ఘోరకలి..ఈ రాష్ట్ర ఏలికకు దీనితో నేరుగా సంబంధం లేకపోవచ్చు.. ముందు తెలిసి ఉండదు..ఇప్పుడు తెలిసే ఉండాలి..
ఏది ఏమైనా ఇంకా దిద్దుబాటు జరిగినట్టు లేదు…ఏది ఎలా జరిగినా..ఎక్కడ జరిగినా ..తెలిసి జరిగినా..
తెలియక జరిగినా.. బాధ్యత వహించాల్సింది ఏలికే కదా..!?
సురేష్
9948546286