మీరు నేర్పిన అక్షరాలే
మా లక్షణాలు..
చిన్నప్పడు మీరు చెప్పిన పాఠాలు జీవిత గుణపాఠాలు..
క్లాసులో ఒక్కోసారి
మీరు తిట్టినప్పుడు..
అప్పుడప్పుడు కొట్టినప్పుడు కొంత బాధ..
నిజం చెప్పాలంటే కొంచెం ఉక్రోషం పొంగుకొచ్చేవి..
ఆక్కడితో ఆగేవారా..
అమ్మాయిల ముందు
మాకు గోడ కుర్చీలు..
గుంజీలు..గ్రౌండ్ చుట్టూ
పరిగెత్తించడాలు..
అప్పుడు అవమానంగా తోచినవే ఇప్పుడు బహుమానాలుగా
అనిపిస్తున్నాయి.
మీ మాట వేదమై..
మీ అరుపు సింహనాదమై..
నాడు విషాదమై…
కొండొకచో వినోదమై..
ఇప్పుడు ప్రమోదమై..
మా అందరికీ ఆమోదమై..
ఎన్ని ప్రమాదాల నుంచి బయట పడేసాయో.!
తరగతి గదుల్లో
మీరు చెప్పిన పాఠాలే మాకు అష్టపదులు..ఇష్టపదులు..!
జగతిన ఎక్కడికి వెళ్ళినా గెలిచేలా ఆంగ్లం..
అప్పుడు బుర్రకెక్కక పోయినా
షేక్స్పియర్ నవల్లా అందంగా
వినిపించేది..
లెక్కలు ఎంత చిక్కు..
చీకాకు పెట్టినా..
గజిబిజి అనిపించినా వ్యాపారాల్లో..ఉద్యోగాల్లో..
జీవితాల్లో ఎన్ని గడబిడలు
నేర్పాయో..
సైన్స్.. అనకూడదు గాని
ఎంత క్లిష్టం..అర్థం కావడం ఎంత కష్టం.. విజ్ఞానశాస్త్రంతో
మా జీవితాల్లో ప్రజ్ఞానాన్ని
పెంచి..మీ జ్ఞానం పంచి
డాక్టర్లు..ఇంజనీర్లు..వ్యాపారులు..బ్యాంకు ఉద్యోగాలు..
ఇంట్లో..సమాజంలో మమ్మల్ని ముందుకు తీసుకువెళ్లిన సద్యోగాలు..
సోషల్..హిందీ..తెలుగు..
ఎన్ని సబ్జెక్టులు..
నిర్ణయించలేదా
మా ఆబ్జెక్టులు..
మీరు స్ట్రిక్టు..
ఈ రోజున అదే మమ్మల్ని గెలిపించిందన్నది ఫాక్టు..!
బతక లేక బడిపంతులు..
మీ జీవితాలు,జీతాలు ఎలా ఉన్నా మా బ్రతుకుల్ని
చక్కదిద్దిన మా ప్రతి మాస్టారూ..మా మెగాస్టార్..
మీ గుణం హిమశిఖర పర్యంతం..
ఏమిచ్చి మీ రుణం తీర్చగలము..
వంగి ప్రణామం చేస్తూ
జీవితాంతం..
ఇవిగో మా బ్రతుకులు
మీకే అంకితం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286