-వేరే చోట కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన నియోజకవర్గానికి మార్చాలి
-ప్రతి పనికి ప్రధాన కార్యాలయం పై ఆధారపడకుండా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సహకారం తీసుకోవాలి
-అవసరమైన ఎఎన్ఎంలు,నాన్ -టీచింగ్ స్టాఫ్ నియమాకాల కోసం కలెక్టర్ ను సంప్రదించాలి
-వానలు,వరదల వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
-బూస్టర్ డోసు టీకాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోండి
-ఖాళీగా ఉన్న స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కల్ని నాటండి
హైదరాబాద్: ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరై వేరే దగ్గర కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన చోటుకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అధికారులను ఆదేశించారు. సొసైటీకి చెందిన 43 గురుకులాలు కేటాయించిన చోట కాకుండా వేరే ప్రాంతంలో కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిని ఆయా నియోజకవర్గాలకు వెంటనే తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎస్సీ గురుకులాలకు చెందిన పలు అంశాలపై బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అధికారులు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్ తో జూమ్ మీటింగ్ జరిపారు. హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రిన్సిపాల్స్ కు మంత్రి, కార్యదర్శి పలు సూచనలిచ్చారు, దిశానిర్దేశం చేశారు. ప్రతి విషయంలో ప్రధాన కార్యాలయంపై ఆధారపడకుండా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సహకారం తీసుకుంటే బాగుంటుందని సలహానిచ్చారు.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అవసరమైన ఎఎన్ఎంలు, నాన్ -టీచింగ్ స్టాఫ్ నియమాకాల గురించి జిల్లా కలెక్టర్ ను సంప్రదించాలన్నారు. వానలు, వరదల కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పాఠశాల ఆవరణలోని వెల్ నెస్ సెంటర్ సిబ్బంది ప్రతి నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన మందులు నిల్వపెట్టుకోవాలని పలు సూచనలిచ్చారు.
అదేవిధంగా స్థానిక ఆస్పత్రి సహకారంతో విద్యార్థులందరికి బూస్టర్ డోసు టీకాలు ఇప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాలని మంత్రి కొప్పుల, కార్యదర్శి రోనాల్డ్ రాస్ అధికారులకు ఆదేశాలిచ్చారు.