-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 15: సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికులు శ్రద్ధగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చినాంజనేయులు, ఉపాధ్యక్షుడు కొఠారి రమణ , ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ అంజిబాబు తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ పరిధిలో 268 మండల స్టాక్ పాయింట్లు ఉన్నాయని, వీటిలో దాదాపు 5 వేల మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరికి 500 మంది మేస్త్రీలుగా ఉన్నారని, వీరందరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పని విధానం గురించి నిత్యావసర సరుకుల ఎగుమతి, దిగుమతుల్లో వస్తున్న పని పద్ధతుల గురించి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. గోడౌన్లలో ప్రభుత్వ అధికారులు, హమాలీలకు మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికుల అవగాహన రాష్ట్ర సదస్సును నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఈ సదస్సు జరిగే తేదీని త్వరలో తెలియజేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికుల అవగాహన సదస్సును రాష్ట్రస్థాయిలో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. సదస్సు నిర్వహణకు తన సహకారం ఉంటుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.