– చేనేత అభయహస్త పథకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత మరియు మరమగ్గముల కార్మికుల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధి కోసం రూ. 168 కోట్లతో చేనేత అభయహస్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ఆమోదించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందనేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని మంత్రి తెలిపారు.
ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి), తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న భీమా), తెలంగాణ నేతన్నకు భరోసాలు అమలు చేయడం జరుగుతుందని, నేతన్న పొదుపు కోసం బడ్జెట్లో రూ. 115.00 కోట్లు, నేతన్న భద్రత కోసం రూ. 9 కోట్లు, నేతన్న భరోసా పథకానికి రూ. 44 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి) ద్వారా చేనేత కార్మికులు తమ వాటా 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం వాటా జమ చేస్తుందని, దీని ద్వారా దాదాపు 38000 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. అదే పవర్ లూమ్ కార్మికులయితే, వారు 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం వాటా జమ చేస్తుందని, దీని ద్వారా దాదాపు 15000 మంది పవర్ లూమ్ కార్మికులు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న భీమా) ద్వారా చేనేత మరియు పవర్ లూమ్ కార్మికులు మరియు అనుబంధ కార్మికులందరికీ జీవిత భీమా అందించడం జరుగుతుందని, నమోదు చేసుకున్న కార్మికులు ఏ కారణంతోనైనా మరణిస్తే, మరణించిన కుటుంబం యొక్క నామినీకి రూ. 5 లక్షలు చెల్లించబడుతుందని తెలిపారు.
తెలంగాణ నేతన్నకు భరోసా ద్వారా చేనేత కార్మికులు తెలంగాణ మార్క్ లేబుల్ ను ఉపయోగించి తయారుచేసిన తెలంగాణ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మరియు వేతన మద్దతు అందించే విధంగా, పని ఆధారంగా ఒక సంవత్సరానికి ఒక్కొక్క చేనేత కార్మికునికి రూ. 18000 వరకు, అనుబంధ కార్మికునికి రూ. 6000 వరకు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే చేనేత రంగానికి రూ. 874 కోట్లు విడుదల చేసామన్నారు. అందులో గత ప్రభుత్వం బకాయి పెట్టినవే రూ. 465 కోట్లు ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే నేతన్నలకు నిరంతరం పని కల్పించాలనే ఉద్ధేశంతో అన్నీ ప్రభుత్వ శాఖలు/కార్పొరేషన్/సొసైటీలు తప్పని సరిగా తమకు కావలిసిన వస్త్రములను టెస్కో (TGSCO) ద్వారానే కొనుగోలు చేసేలా జీవో నెం. 1 తేది: 11.03.2024 తీసుకొచ్చామన్నారు. మరియు ఇందిరా మహిళా శక్తి చీరల పథకం కూడా అమలుచేస్తున్నామన్నారు.
అంతేకాకుండా చేనేత కార్మికుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్ తో నూలు డిపో ఏర్పాటు చేసామని, నేతన్నకి చేయూత క్రింద చేనేత కార్మికులకు రూ. 290.09 కోట్లు విడుదల చేసామన్నారు.
రూ. 22.25 కోట్ల నిధులతో నేతన్న భీమా, పావలవడ్డీ పథకం కింద 60 చేనేత సహకార సంఘాలకు రూ. 1.09 కోట్లు, మరమగ్గ కార్మికులకు 10% నూలు సబ్సడి పథకం కింద 2018 నుండి 2022 వరకు ఉన్న అన్ని బకాయిలు రూ 37.49 కోట్లు ఈ సంవత్సరంలోనే విడుదల చేయడం జరిగిందన్నారు.