– ఈఓ, ఏఈఓ, చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్
– వేరే దారిలేదని పవన్ స్పష్టీకరణ
– నాకు లేని నామోషీ వారికెందుకన్న ప్రశ్న
– కూటమి వచ్చినందుకే వారికి ఆ పదవులొచ్చాయన్న వ్యాఖ్య
– డీఎస్పీ సరిగ్గా పనిచేస్తే ఎస్పీ బలయ్యేవాడు కదా అని ప్రశ్న
– క్షమాపణ చెబితే ప్రాణాలు తిరిగొస్తాయా అన్న చైర్మన్ నాయుడు
– క్షమాపణ చెప్పడంలో తప్పులేదంటూనే మెలిక
– ఎవరేదో మాట్లాడితే వాటికి స్పందించాల్సిన పనిలేదని వ్యాఖ్య
– నాయుడు వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్
– పవ న్‌నుద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్లు
– దానితో దిద్దుబాటుకు దిగిన నాయుడు
– ఆ వ్యాఖ్యలు పవన్‌నుద్దేశించి చేసినవి కావని స్పష్టీకరణ
– క్షమాపణపై పెదవి విప్పని శ్యామలరావు, వెంకయ్యచౌదరి
– వారిద్దరి నిర్లక్ష్యంపై జనసైనికుల గుస్సా
– ‘కొండ’పై మాటల కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు తర్వాత నెంబర్‌టూ. ఆయన ఫొటో కూడా సీఎం చంద్రబాబునాయుడు పక్కనే అన్ని శాఖల కార్యాలయాల్లోనూ కనిపిస్తాయి. మంత్రులందరిలోనూ ఆయన ప్రొటోకాల్ ప్రత్యేకం. నామినేటెడ్ పదవుల్లోనూ జనసేనాని పార్టీదే అ‘ద్వితీయ’ ప్రాధాన్యం. మరి అంత ‘పవర్’ ఫుల్ పవన్‌నుద్దేశించి.. ‘ఎవరో ఏదో మాట్లాడారని అందరి మాటలకు స్పందించాల్సిన పనిలేదని’, ఒక చైర్మన్ తేలిగ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది పెను సంచలనమయిపోదూ? చంద్రబాబు అంతటివాడే పవన్ దూకుడుకు మౌనంగా ఉంటే, ఒక ఆలయ కమిటీ చైర్మన్ మాత్రం లెక్కలేనట్లు మాట్లాడితే అది జనసైనికులకు కోపం తెప్పించదూ? అది సోషల్‌మీడియాలో సంచలనమయిపోదూ? దానిపై సోషల్‌మీడియా సోల్జర్స్ కామెంట్లతో చెలరేగిపోరూ?! ప్రత్యర్థి పార్టీ సోషల్‌మీడియా లడ్డూలాంటి ఈ అవకాశం వాడుకుని పొగపెట్టేయవూ?.. యస్. ఇప్పుడు తిరుమల కొండపై సరిగ్గా అదే జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిందెవరో కాదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇక కొండ పైకి వెళదాం.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం ఏర్పాటుచేసిన సెంటర్లలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు మృతి చెందిన విషాదం తెలిసిందే. ఆ వార్త తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లి మృతుల కుటుంబసభ్యులతోపాటు, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. నష్టపరిహారం ప్రకటించారు.
బాబు అక్కడ పరామర్శలో ఉన్న సమయంలోనే జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన తిరుపతి వెళ్లి.. బాధితులను పరామర్శించారు. ఒకరకంగా చెప్పాలంటే సీఎం-డిప్యూటీ సీఎం పర్యటనలు సమాంతరంగానే సాగాయి.
ముందు ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం చంద్రబాబునాయుడు.. సంఘటనకు బాధ్యులుగా గుర్తించి ఎస్పీ, జేఈఓ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌పై వేటు వేసి, డీఎస్పీని సస్పెండ్ చేశారు. న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈఓ, జేఈఓపై బాబు తన సహజశైలిలో నిప్పులు కురిపించారు.
చంద్రబాబు ప్రెస్‌మీట్ తర్వాత, ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ నేరుగా.. చైర్మన్ బీఆర్‌నాయుడు, ఈఓ శ్యామలరావు, అడిషనల్ ఈఓ వెం య్యచౌదరి నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురే జరిగిన ఘటనకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జరిగిన విషాదానికి తాను క్షమాపణ చెబుతున్నట్లు వినమ్రంగా ప్రకటించారు. ఆ ముగ్గురు కూడా క్షమాపణ చెప్పి తీరాలని నిర్మొహమాటంగా చెప్పారు. చైర్మన్-ఈఓ మధ్య గ్యాప్ ఉన్నట్లు వెల్లడించారు. కొండపై అధికారులు సామాన్య భక్తులను గాలికొదిలి, వీఐపీల సేవలో మునుగుతున్నార ంటూ కన్నెర్ర చేశారు.
తాజాగా తన పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లిన పవన్.. అక్కడి ప్రభుత్వ వేదికపై కూడా తిరుపతి అంశాన్ని ప్రస్తావించి, చైర్మన్-ఈఓ-అడిషనల్ ఈఓపై అస్త్రాలు సంధించి, మళ్లీ ఇరికించారు. ‘నేనే క్షమాపణ చెప్పా. నాకు లేని నామోషీ వారికెందుకు? నేను ఓట్లు అడిగిన ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టే నాయుడు చైర్మన్, శ్యామలరావు ఈఓ, వెంకయ్యచౌదరి అడిషనల్ ఈఓ పదవులు వచ్చాయి. కాబట్టి ఆ ముగ్గురు క్షమాపణ చెప్పాల్సిందే. వారికి వేరే దారిలేద’నని కుండబద్దలు కొట్టిన వైనం, మరోసారి సంచలనం సృష్టించింది.
అటు పవన్ వ్యాఖ్యలు సైతం టీవీ చానెళ్లు, సోషల్‌మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. దీన్నిబట్టి.. ఈఓ, జేఈఓ, చైర్మన్ క్షమాపణల విషయంలో పవన్ చాలా పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమయింది. తానే క్షమాపణ చెప్పిన తర్వాత వారెందుకు చెప్పరన్న దానిపై ఆయన పట్టుదలతో ఉన్నట్లు పవన్ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పినట్టయింది.
చైర్మన్ నాయుడు వ్యాఖ్యలపై జనసైనికులు కన్నెర్ర చేశారు. వాటిపై మరికొందరు పోస్టింగులు పెట్టారు. చివరకు అది అటు తిరిగి.. పవన్ కల్యాణంటే చైర్మన్ లెక్కలేకుండా మాట్లాడారనేంత వరకూ వెళ్లింది. ‘పవన్‌ను ఎవరో అంటారా? పవన్ ఎవరో నాయుడుకు తెలియదా? పవన్ స్వయంగా క్షమాపణ చెబితే చైర్మన్, ఈఓ, ఏఈఓ క్షమాపణ చెప్పడానికి ఏంటి ఇగో’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.
ఈ నేపథ్యంలో దిద్దుబాటుకు దిగిన నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా వ్యాఖ్యలను పవన్‌కు ఆపాదించటం భావ్యం కాదు. అవి ఆయననుద్దేశించి చేసినవి కాదు. ఘటన జరిగిన వెంటనే నేను భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పా. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల కమిటీ కంటే ముందుగానే బోర్డు క్షమాపణ చెప్పింది. క్షమాపణల గురించి అవసరమైన అసత్యాలు మానుకోవాలి’’అని ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి, ఈ వ్యవహారానికి తెరదించకపోతే అది కూటమిపై ప్రభావం పడుతుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే నాయుడు ప్రకటన విడుదల చేశారంటున్నారు.
అయితే.. భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఒక్క పవన్ మాత్రమే. జగన్ సహా వైసీపీ నేతలంతా చైర్మన్, ఈఓ, ఏఈఓలపై కేసు పెట్టాలని మాత్రమే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ నాయుడు తాను పవన్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్న వివరణ జనసైనికులకు సంతృప్తి కలిగించనట్లు కనిపిస్తోంది. ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టులు క్షమాపణల విషయాన్ని ప్రస్తావించగా ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం నాకు లేదని’ నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
సరే.. పవన్ కల్యాణ్ డిమాండ్ తర్వాత చైర్మన్ నాయుడు స్పందించడం వరకూ బాగానే ఉన్నప్పటికీ.. మిగిలిన వారిద్దరూ ఇప్పటిదాకా, పెదవి విప్పకపోవడంపై జనసైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఓ శ్యామలరావు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి మాత్రం క్షమాపణ విషయంలో మౌనంగా ఉండటాన్ని, జనసైనికులు సహించలేకపోతున్నారు.
ప్రెస్‌మీట్‌లో నాయుడు పక్కనే ఉన్న వారిద్దరూ, చైర్మన్ ప్రసంగం తర్వాత మాట్లాడి.. తాము కూడా క్షమాపణ చెబుతారని చాలామంది ఊహించారు. కానీ వారు అసలు పవన్ డిమాండ్‌ను పట్టించుకోకపోవడమే విచిత్రం. దానినే ఇప్పుడు జనసైనికులు ప్రతిష్ఠగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఈ వ్యవహారం చూస్తుంటే. వారిద్దరూ క్షమాపణలు చెప్పేంత వరకూ.. అటు పవన్ కల్యాణ్ కూడా, పట్టువిడిచే అవకాశం కనిపించడం లేదు. ఈరోజు పిఠాపురంలో ప్రభుత్వ కార్యక్రమంలోనే, దానికి సంబంధం లేని క్షమాపణ విషయాన్ని మరోసారి ప్రస్తావించారంటే.. పవన్ క్షమాపణ వ్యవహారాన్ని ఎంత ప్రతిష్ఠగా తీసుకున్నారో అర్ధమవుతుంది.