Suryaa.co.in

Editorial

భగ్గుమన్న ‘బోర్డు’

– వాడివేడిగా టీటీడీ బోర్డు భేటీ
– తిరుపతి విషాదానికి బాధ్యులెవరో తేల్చండి
– వారిపై చర్యలు తీసుకోవలసిందే
– ఈఓ, అడిషనల్ ఈఓపై సభ్యుల ప్రశ్నల వర్షం
– ఘటనకు మాదెలా బాధ్యత అవుతుంది?
– మీరు మాకేం బాధ్యత అప్పగించారు?
– అసలు మా బాధ్యత, మీ విధులేంటో తేల్చండి
– మేం టికెట్ల కోసం ఒత్తిడి చేస్తున్నామని ప్రచారం చేస్తారా?
– అసలు మీ కోటా ఎంతో తేల్చాల్సిందే
– మంత్రులు, సీఎంఓ కోటా కూడా చెప్పండి
– మేం టికెట్లు ఇవ్వమని మిమ్మల్ని అడిగామా?
– మమ్మల్ని బద్నామ్ చేస్తారా?
– వచ్చిపోయేకాడికి మాకు ఈ పదవులెందుకు?
– వచ్చే సమావేశానికల్లా హ్యాండ్‌బుక్ ఇస్తామన్న ఈఓ
– టీటీడీ బాసులపై సభ్యుల తిరుగుబాటు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

మూడవ సమావేశం తర్వాత టీటీడీ బోర్డు సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తిరుపతి విషాదానికి బాధ్యులెవరో తేల్చాల్సిందేనని మూకుమ్ముడిగా గళమెత్తారు. మీ వైఫల్యం వల్ల చంద్రబాబు-మోదీ-పవన్ కల్యాణ్ బద్నామ్ అవుతున్నారని విరుచుకుపడ్డారు. తమకెలాంటి బాధ్యతలు అప్పగించకుండా, ఆ ఘటనకు తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు. తమను నిమిత్తమాత్రులను చేస్తే సహించేది లేదని కన్నెర్ర చేశారు. మేమంతా ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నత హోదాల నుంచి వచ్చినవారమేనని తెగేసి చెప్పారు. నెలకోసారి వచ్చిపోయేకాడికి మాకు ఈ పదవులు ఎందుకు? అని నిరసన స్వరం వినిపించారు. అసలు మీ అధికారాలేంటి? మా అధికారాలేంటో వచ్చే సమావేశంలో తేల్చాలన్నారు. మీ కోటాకింద ఎన్ని టికెట్లు జారీ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. దానితో వచ్చే సమావేశానికల్లా మీ విధులు-అధికారాలకు సంబంధించిన హ్యాండ్‌బుక్ ఇస్తామని, ఎవరి బాధ్యతలేమిటో స్పష్టం చేస్తామని ఈఓ, అడిషనల్ ఈఓ చెప్పాల్సి వచ్చింది. ఇదీ.. తాజాగా జరిగిన టీటీడీ బోర్డు భేటీ ముచ్చట్లు.

టీటీడీ బోర్డు సమావేశం వాడివేడిగా జరిగింది. రెండు సమావేశాల్లో మౌనంగా ఉన్న సభ్యులు.. తిరుపతి ఘటన తర్వాత అందివచ్చిన అవకాశంతో, అధికారులపై మూకుమ్మడి ఎదురుదాడి చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమను నిమిత్తమాత్రులను చేసి, తమపై పెత్తనం చేస్తున్న ఈఓ, అడిషనల్ ఈఓ వైఖరిపై సభ్యులు విరుచుకుపడ్డారు.

మేమేమీ అల్లాటప్పావాళ్లం కాదు. మేమూ ఎమ్మెల్యే, ఇతర పదవులు చేసినవాళ్లమే. మమ్మల్ని తక్కువ చేసి చూస్తే సహించేదిలేదని దాదాపు హెచ్చరించినంత పనిచేశారు. దానితో నిర్ఘాంతపోవడం అధికారులవంతయింది. తిరుపతి ఘటనకు బాధ్యులెవరో తేల్చాల్సిందేనని పట్టుపట్టారు. న్యాయవిచారణ జరిగినప్పటికీ, అంతర్గతంగా బాధ్యులెవరో తేల్చాలన్నారు.

మీ వైఫల్యం వల్ల చంద్రబాబునాయుడు-మోదీ-పవన్ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం వచ్చింది. మీ వల్ల వాళ్లెందుకు బద్నామ్ కావాలి? అసలు మీరు మమ్మల్ని ఎందుకు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు? మాకెందుకు సమాచారం ఇవ్వడం లేదు? ఘటన జరిగిన రోజున మాకేమైనా బాధ్యతలు అప్పగించారా? మాకు కూడా అక్కడ డ్యూటీలు ఎందుకు వేయలేదు? పిలిస్తే మేం కూడా సేవ చేసేవాళ్లం కదా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

మేం టికెట్ల కోటా గురించి ఒత్తిళ్లు చేస్తున్నామని బయట ప్రచారం చేస్తున్నారు. మేం టికెట్లు ఇవ్వమని మిమ్మల్ని అడిగామా? మీరే కదా కోటా పెట్టింది? పోనీ దానినయినా అమలుచేస్తున్నారా? మా ఫోన్లకు స్పందించరు. రాత్రి వరకూ రేపటి దర్శనం ఇస్తారో లేదో చెప్పరు. మేం మీకు బానిసలం కాదు. మాకూ సొసైటీలో అంతో ఇంతో పేరుంది. మీరు మమల్ని అవమానిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

అసలు మీ కోటా ఎంతో తేల్చండి. ఇప్పటిదాకా మీరు ఎన్ని టికెట్లు ఇచ్చారో తేల్చండి. ప్రతిదానికీ సీఎం పేరు చెబుతున్నారు కదా? సీఎంఓకు ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఐఏఎస్, ఐపిఎస్‌లకు ఎన్ని ఇచ్చారో వివరాలివ్వండి. మొన్న చైర్మన్‌కు తెలియకుండా ఈఓ ఎలా ప్రెస్‌మీట్ పెట్టారు? ఇకపై బోర్డుకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. లేకపోతే మేం తీర్మానం చేసేంతవరకూ వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

తిరుపతిలో జరిగిన విషాదానికి బోర్డు ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు మీరు కింద కౌంటర్లు పెడుతున్నట్లు గత బోర్డు మీటింగులో చెప్పారా? పోనీ నిర్ణయం తీసుకున్న తర్వాత మాకేమైనా బాధ్యతలు అప్పగించారా? మీరు అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాకు చెప్పడం ఏమిటి? ఇకపై బోర్డు నిర్ణయించిన వాటినే అమలు చేయండి అని స్పష్టం చేశారు.

సభ్యుల ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరయిన ఈఓ, అడిషనల్ ఈఓ.. వారు మాట్లాడున్నంత సేపు నిర్ఘాంతపోయి, చేష్టలుడి చూస్తుండిపోయినట్లు సమాచారం. చివరకు మీ అధికారాలు-మా అధికారాలకు సంబంధించిన నోట్‌ను, వచ్చే సమావేశం నాటికి ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నిబంధనలకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను కూడా అందిస్తామని చెప్పడంతో, సభ్యులు శాంతించినట్లు సమాచారం. మొత్తానికి ఈఓ, అడిషనల్ ఈఓలు సీఎం పేరు చెప్పి.. తమను నిమిత్తమాత్రులను చేస్తున్నారని సభ్యులు ఆలస్యంగా గుర్తించినట్లు స్పష్టమయింది.

LEAVE A RESPONSE