– మంత్రి, ఎమ్మెల్యేల మద్దతు ఆయనకే?
– రేసులో ఎమ్మెల్యే పార్ధసారథి
– ఆయనకు లక్ష్మణ్ దన్ను?
– పోటీలో సురేష్‌రెడ్డి, మాధవ్, రఘురామ్, విష్ణువర్దన్‌రెడ్డి, జయప్రకాష్ నారాయణ
– సుజనా వైపే నాయకత్వం మొగ్గు?
– టీడీపీ-జనసేనతో సమన్వయం కోసమేనా?
– ఆర్ధికభారం తప్పించుకునేందుకేనా?
– ఈ నెలాఖరుకు ఎంపిక
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ కమలదళపతి రేసు వేడెక్కుతోంది. ఈ నెలాఖరులో బీజేపీ అధ్యక్ష పదవి ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. పేరుకు జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ, అంతిమంగా జాతీయ నాయకత్వమే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందనేది బహిరంగ రహస్యమే.
ఈ క్రమంలో పలువురు సీనియర్ నాయకులు అధ్యక్ష పదవి కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో విజయవాడ ఎమ్మెల్యే, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ముందువరసలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో, అధికారపార్టీతో సమన్వయం చేసుకునేందుకు సుజనా సరైన వ్యక్తి అని కేంద్రనాయత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పైగా ఇప్పటి క్లిష్ట పరిస్థితిలో టీడీపీ-జనసేనతో సమన్వయం అవసరమని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. వివాదరహిత నాయకుడు, పార్టీని అన్ని రంగాల్లో సమర్ధవంతంగా నడిపించగలరన్న నమ్మకంతో ఆయనను రాష్ట్ర మంత్రితో పాటు, ఎమ్మెల్యేలు కూడా సమర్ధిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరి సైతం తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే, పార్టీపై ఆర్ధికభారం లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారని చెబుతున్నారు.
ఇక మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత మాధవ్ కూడా అధ్యక్ష పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈయన పేరు గతంలో కూడా ప్రముఖంగా వినిపించింది. ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాధవ్‌కు ప్రముఖుల మద్దతు అంతగా లేదంటున్నారు. గతంలో ఆయనను సమర్ధించిన సంఘ్.. ఈసారి ఆయన పట్ల పెద్దగా సుముఖంగా లేదంటున్నారు. పైగా ఆయనకు పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మద్దతులేదన్న ప్రచారం జరుగుతోంది.
సీనియర్ నేత, గతంలో రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులు నిర్వహించిన కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు సురేష్‌రెడ్డి కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ఆయన జిల్లా పార్టీ నేతలకు ఫోన్ చే సి, తనకు మద్దతునీయమని కోరుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి సీనియర్ నాయకుడయిన సురేష్‌రెడ్డికి ఎప్పుడో అవకాశం రావలసి ఉన్నప్పటికీ, ఆయన వెంకయ్యనాయుడు వ్యతిరేకవర్గం కావడంతో, ఆ అవకాశాలు దక్కకుండా పోయింది. గతంలో ఆయన అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన సందర్భంలో.. వెంకయ్య వ్యతిరేక కోణంలో, సోము వీర్రాజు కూడా సురేష్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు.
తాజాగా ఎమ్మెల్యే పార్ధసారథి కూడా అధ్యక్ష పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయనకు బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ మద్దతు బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. బీసీ కార్డుతో అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న పార్దసారథికి, ఇటీవలి ఎంపీ ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ లభించింది. దానితో బీజేపీకి రాజీనామా చేసిన పార్ధసారధి వ్యవహారం, పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఈలోగా రంగంలోకి దిగిన పురందేశ్వరి టీడీపీ నాయకత్వంతో చర్చించి, పార్ధసారథికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. అయితే ఈయనకు ఎమ్మెల్యేలుగానీ, పార్టీ సీనియర్ల నుంచి గానీ పెద్దగా మద్దతులేదంటున్నారు. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఆయనకు మద్దతునిస్తున్నారన్న ప్రచారం ఉంది.
నిజానికి పార్ధసారథి బీసీ కార్డుతో అధ్యక్ష పదవి ఆశిస్తున్నప్పటికీ.. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వదలచుకుంటే ఆర్గనైజేషన్‌లో తొలి నుంచి ఉన్న మాధవ్‌కు అవకాశం ఇస్తారే తప్ప, చివరి నిమిషంలో పార్టీకి రాజీనామా చేసిన సారథికి ఎందుకు ఇస్తారన్న ప్రశ్నలు బీసీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా చాలాకాలం పాటు ఢి ల్లీలో పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించిన సీనియర్ నేత పురిఘళ్ల రఘురామ్ కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. తనకు అధ్యక్ష పదవి కావాలని ఆయన ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షడు నద్దాను కోరారు. జాతీయ నాయ త్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తారనే పేరున్న రఘురామ్, గత ఐదేళ్ల నుంచి తన భీమవరం నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారు. వెంకయ్యనాయుడు ఢిల్లీలో చక్రం తిప్పిన రోజుల్లో తెలుగువారైన సత్యకుమార్, రఘురామ్ పేర్లు అక్కడ ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎవరు ఢిల్లీకి వెళ్లినా వారిద్దరినీ తప్పనిసరిగా కలిసేవారు. తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేని పక్షంలో జాతీయ కమిటీలో స్థానం కల్పింంచాలని అభ్యర్ధించినట్లు తెలుస్తోంది.
ఇక మరో సీనియర్ నాయకుడు- పార్టీ అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. బీజేపీలో తొలి నుంచి అంకితభావంతో పనిచేస్తున్న కమ్మ వర్గానికి చెందిన నాయకుల్లో ఒకరైన జేపీకి, జాతీయ నాయ త్వంతో సన్నిహిత సంబంధాలున్నాయి. నిజానికి టీడీపీ నుంచి చాలామంది కమ్మ నాయకులు బీజేపీలో చేరినప్పటికీ, తొలి నుంచి బీజేపీతో అంటిపెట్టుకున్న ఇద్దరు ముగ్గురు కమ్మనేతల్లో జేపీ ఒకరు.
ప్రస్తుతం అధ్యక్ష పదవి ఆశిస్తున్న 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఒకరిద్దరు నేతల్లో జేపీ ఒకరు. పార్టీ ఓడిపోతుందని తెలిసినప్పటికీ నాయకత్వం ఆదేశాలను గౌరవించిన ఆయన, గతంలో గుంటూరు ఎంపి సీటుకు పోటీ చేశారు.
ఇటీవలి ఎన్నికల్లో ఆయన పనిచేసిన గుంటూరు సీటు పొత్తులో టీడీపీకి వెళ్లిపోయింది. తర్వాత ఆయనకు నామినేటెడ్ పదవి వస్తుందని చాలామంది ఆశించారు. అయితే ఆయనకు బదులు లంకా దినకర్‌కు చైర్మన్ పదవి దక్కింది. సంఘ్‌కు విశ్వసనీయుడైన జేపీకి వివాదరహితుడు, మంచి సమన్వయకర్తగా పేరుంది. అయితే పురందేశ్వరి, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల రాకతో.. పార్టీలో తొలి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న జేపీకి, కులం కోణంలో ఇటీవలి కాలంలో అవకాశాలు రాకుండా పోయాయన్న భావన పార్టీ వర్గాల్లో లేకపోలేదు.
కాగా రాష్ట్ర నాయకుడైన విష్ణువర్దన్‌రెడ్డి కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. తొలి నుంచి పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన విష్ణుకు..బలమైన లాబీయిస్టు అన్న పేరున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మద్దతు ఉందన్న ప్రచారం ఉంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన సందర్భంలో, విష్ణువర్దన్‌రెడ్డి ఆయనకు ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇక అంతర్గతంగా సంఘటనా మంత్రి మధుకర్ మద్దతు కూడా లే కపోలేదని చెబుతున్నాయి. కన్నా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మధుకర్, సోమువీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి ఒక వర్గంగా వ్యవహరించిన విషయం బహిరంగమేనంటున్నారు.
అయితే విష్ణుకు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదని, అందుకు కారణం.. ఆయనపై టీడీపీ వ్యతిరేకి అన్న ముద్ర ఉండటమేనని విశ్లేషిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విష్ణు.. టీడీపీ, చంద్రబాబునాయుడుపై విరుచుకుపడేవారని, చివరకు పొత్తును భగ్నం చేసేందుకు, 70 సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన వైనాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నారు. ఈ కారణంగా ఆయనకు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యంతరాల దృష్ట్యా అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు.