Suryaa.co.in

Editorial

జగన్‌కు ఏమైంది?

  • ఆ సెక్యూరిటీ ఆఫీసర్ లేకపోతే లండన్ వెళ్లరా?

  • కూతుళ్ల కంటే ఆ సెక్యూరిటీ అధికారే ఎక్కువా?

  • సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరుంటే ఏమిటి?

  • అంటే జగన్‌కు లండన్ పర్యటన లక్ష్యం మరొకటుందా?

  • గతంలో సొంతంగా లండన్‌లో కారులో వెళ్లారన్న ప్రచారం

  • అనుకూల అధికారి ఉంటే పర్యటన రహస్యంగా ఉంటుందన్న వ్యూహంతోనే సెక్యూరిటీపై మెలిక?

  • అయినా సెక్యూరిటీ ఆఫీసర్‌ను ఎవరిని నియమిస్తారో జగన్ ఆదేశిస్తారా?

  • ఇటీవల మరో నాలుగైదు నెలల్లో కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం

  • ప్రజలు తనను ఓడించి తప్పు తెలుసుకుంటున్నారన్న వ్యాఖ్యలు

  • జగన్‌కు ఏమైంది? ఎవరికయినా చూపించండంటూ సోషల్‌మీడియాలో పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్‌కు ఏమైంది?..మాకు తెలియాలి! అన్నియ్యను అలా వదలిలేయకండి.. ఎవరికన్నా చూపించండ్రా.. ఇవీ గత రెండు రోజుల నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌నుద్దేశించి సోషల్‌మీడియాలో పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై పేలిన వ్యంగ్యాస్త్రాలు, చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు తెగపేలుతున్నాయి. దానికి కారణం ఆయన చేస్తున్న వింత ప్రకటనలే. కొద్దిరోజుల క్రితం కూటమి ప్రభుత్వం మరో నాలుగైదు నెలల్లో కుప్పకూలిపోతుందని, పులివెందుల డీఎస్పీనుద్దేశించి హెచ్చరించారు. మళ్లీ ఇప్పుడు తాను ఫలానా సెక్యూరిటీ అధికారి తనతో రాకపోతే, తాను అసలు లండన్ వెళ్లేదిలేదని భీష్మించారు. అవే ఇప్పుడు జగన్ పాలిట వ్యంగ్యాస్త్రాలయ్యాయి.

లండన్‌లో ఉన్న తన కూతుర్ల వద్దకు వె ళ్లేందుకు జగ న్ కోర్టు అనుమతి కోరారు. అయితే పాస్‌పోర్టు వ్యవహారం ఆయన పర్యటనకు ప్రతిబంధకం కాగా, కోర్టు వారు ఆయనపై దయతలచి మినహాయింపు ఇచ్చింది. దానితో జగన్ లండన్ పర్యటనకు లైన్‌క్లియరయింది. ఆమేరకు 13న ఆయన లండన్ వెళ్లారు.

అయితే తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో పనిచేస్తున్న ఏపీఎస్పీ బెటాలియన్ సహా కమాండెంట్ మహబూబ్ బాషాను పంపించాలని జగన్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీతో తనకు లండన్ వెళ్లడం ఇష్టం లేదని, కోర్టుకు చెప్పడం విస్మయానికి గురిచేసింది. ఇప్పుడున్న సెక్యూరిటీతో తనకు లండన్ వెళ్లడం ఇష్టం లేదన్న జగన్.. అసలు సెక్యూరిటీ లేకుండానే లండన్ ఎలా వెళ్లారన్నదే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

‘‘సీఎంగా పనిచేసిన వ్యక్తి తాను ఫలానా సెక్యూరిటీ అధికారి ఉంటేనే విదేశీ పర్యటనకు వెళతానని చిన్నపిల్లవాడి మాదిరిగా మారాం చేయడంతో.. జగన్ మానసిక పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదు. ప్రజలు తన గురించి ఏం మాట్లాడుకుంటారో కూడా జగన్‌కు అర్ధం కాకపోవడం విచారకరమ’’ని ఓ సీనియర్ వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.

దానివల్ల జగన్ లండన్ వెళ్లి ఏం చేస్తున్నారు? రహస్యంగా ఎవరిని కలుస్తున్నారు? ఆర్ధికపరమైన వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు వెళుతున్నారా? అందుకే తనకు నమ్మకస్తుడైన అధికారి కావాలని అడుగుతున్నారని ప్రజలు అనుమానించే ప్రమాదం లేకపోలేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అయినా కూతుళ్లను పలకరించి, నాలుగురోజులు వారితో గడిపేందుకు వెళ్లే జగన్ తన వెంట ఏ అధికారి ఉంటే ఎందుకు భయపడాలి? అంటే ‘అంతకుమించిన’ రాచకార్యాలు, రహస్యాలు ఉంటేనే కదా భయపడాల్సింది? పైగా భార్యతోనే కలసి వెళుతున్నందున, ఇక సెక్యూరిటీ అధికారి ఎవరుంటే జగన్‌కు ఎందుకు? అంటే దీన్ని బట్టి జగన్ లండన్ పర్యటన లక్ష్యం మరొకటి ఉందా?

మరొక సెక్యూరిటీ అధికారి అయితే, జగన్ పర్యటన వివరాలు ఇంటెలిజన్స్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటారు. కానీ తాను కోరుకున్న అధికారి ఉంటే, అలాంటి నివేదికలివ్వరన్న నమ్మకంతోనే తనకు ఫలానా అధికారి కావాలని అడిగారా? వంటి అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

నిజానికి గతంలో దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా, జగన్ పై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఆయన కొన్ని గంటలు సెక్యూరిటీకి అందకుండా మాయమయ్యాయని, ఆ సమయంలో ఒక హోటల్‌లో కొందరితో భేటీ అయ్యారన్న వార్తలు మీడియా-సోషల్‌మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడంటే ఆయనే సీఎం కాబట్టి, జగన్ లండన్ పర్యటన వివరాలు ఎవరికీ తెలిసే అవకాశం ఉండేది కాదు.

ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, మాజీ సీఎం హోదాలో వెళుతున్నందున జగన్ పర్యటన నిమిష నిమిషానికి ప్రభుత్వం-పోలీసులకు తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం కేటాయించిన అధికారి కాకుండా, తనకు నమ్మకస్తుడైన బాషానే కావాలని కోర్టులో పిటిషన్ వేసినట్లు కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

అయితే ఇక్కడ తాను లండన్ వెళ్లే ఐదురోజుల ముందు.. తనతోపాటు బాషాను సెక్యూరిటీ అధికారిగా పంపించాలని ఐజి ఇంటెలిజన్స్‌కు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించటమే విచిత్రం. నిజానికి ఎల్లోబుక్ నిబంధనల ప్రకారం.. ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ అధికారిని విదేశాలకు పంపించడం కుదరదు. పోనీ జగన్ జడ్ ప్లస్‌లో ఉన్నందున.. ఆయన తన విదేశీ పర్యటన వివరాలతో కూడిన దరఖాస్తును ప్రభుత్వానికి పదిహేనురోజుల ముందు పంపించాలి.

రాష్ట్ర ప్రభుత్వం దానిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. కేంద్రం దానిని ఆమోదిస్తే, జగన్ వెళ్లాలనుకున్న లండన్ ఎంబసీకి ఆయన పర్యటన సమాచారం ఇస్తుంది. అప్పుడు లండన్ పోలీసులే జగన్ రక్షణ బాధ్యత తీసుకుంటారు. అంతే తప్ప ఆయనకు ప్రత్యేకించి సెక్యూరిటీ అధికారిని ఇవ్వరు. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు సైతం, ఇదే పద్ధతి అమలులో ఉంటుంది. వారు మన దేశానికి వచ్చే సందర్భంలో, వారి సెక్యూరిటీ బాధ్యత మనదే తప్ప, వారి వెంట అధికారులు రారు. అమెరికా అధ్యక్షుడి ఒక్కరికే అపరిమతమైన భద్రత వెంట ఉంటుంది.

జడ్ ప్లస్‌లో ఉన్న జగన్ ఆమేరకు దరఖాస్తు పెట్టుకుంటే, ఆయనకు ఒక డీఎస్పీని కేటాయిస్తారు. అది కూడా లైజనింగ్ కోసమే. ఆ డీఎస్పీ అధికారి విదేశాలకు వెళ్లినప్పుడు, తనతో గన్ తీసుకువెళ్లడం కుదరదు. ఇప్పుడు జగన్ సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ, జడ్ ప్లస్‌లో ఉన్నందున.. ఆయన దరఖాస్తు చేసుకుంటే డీఎస్పీ స్థాయి అధికారిని కేటాయిస్తారు. అలాగని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదు. ప్రస్తుత ం జగన్‌కు జార్జి అనే డీఎస్పీ అధికారి సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న్పటికీ, గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు తన వద్ద పనిచేసిన బెటాలియన్ అధికారి మహబూబ్ బాషా కావాలని పట్టుపట్టడమే వింత.

అసలు సదరు బాషా అనే అధికారి, ఇప్పుడు జగన్ సెక్యూరిటీ బృందంలో లేరు. ఆయన తిరిగి అనంతపురం బెటాలియన్‌కు వెళ్లిపోయారు. ఎల్లో బుక్ నిబంధ నలు తెలుసుకోకుండానే, తన సైన్యాన్ని మొత్తం తనతో పంపాలన్నట్లు జగన్ డిమాండ్ చేయటంపై, పోలీసు వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

పైగా నిబంధనల ప్రకారం.. తనకు ఫలానా అధికారిని కేటాయించాలని కోరే హక్కు, జగన్‌కు లేదని స్పష్టం చేస్తున్నారు. అసలు జగన్ తనను ఫలానా అధికారిని పంపాలన్న దరఖాస్తును, కనీసం మెయిల్ లేదా పోస్టులో పంపించకుండా.. వాట్సాప్‌లో పంపించడం బట్టి, ఆయనకు పోలీసుశాఖపై ఎంత నమ్మకం-గౌరవం ఉన్నదో స్పష్టమవుతోందని పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి జగన్ ఈనెల 13నే లండన్ వెళ్లిపోయారు. 9న ఆయన తనకు బాషా కావాలని ఐజి ఇంటలిజన్స్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. మరి ఇప్పటికే లండన్ చేరిన జగన్‌కు సెక్యూరిటీ ఎందుకు? అంటే ఆయన అక్కడ దాదాపు 15 రోజులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అందుకే కోర్టులో కేసు వేసి, ఈలోగా తనకు అనుకూలమైన తీర్పు వస్తే.. బాషాను లండన్ రప్పించుకోవచ్చన్న వ్యూహం జగన్ పిటిషన్ లో కనిపిస్తోందని, న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలాఉండగా.. ఇటీవలి తన పులివెందుల పర్యటనలో అక్కడి డీఎస్పీనుద్దేశించి జగన్ చేసిన హెచ్చరిక సైతం, ఆయన మానసిక పరిస్థితిపై సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలేందుకు కారణమవుతున్నాయి. ‘ఈ ప్రభుత్వం నాలుగైదు నెలలో కుప్పకూలుతుంది. అప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేర ’న్నట్లు జగన్ చేసిన హెచ్చరిక, మీడియాలో ప్రముఖంగా వచ్చిన విషయం తెలిసిందే.

దానితో కేవలం 11 సీట్లు వచ్చిన జగన్ ఎలా సీఎం అవుతారు? ఈ నాలుగైదు నెలల్లో కూటమి ప్రభుత్వం ఎలా కుప్పకూలుతుంది? ఒకవేళ అలాంటిదే మైనా ఉంటే.. టీడీపీలో లోకేష్ సీఎం అవుతారే తప్ప జగన్ ఎందుకు సీఎం అవుతారు? ప్రభుత్వం ఎందుకు కుప్పకూలుతుంది? చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బావున్నట్లు లేదు. జగన్‌ను అలా వదిలేయకండి.. ఎవరికన్నా చూపించండ్రా అంటూ సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అలాగే పార్టీ నేతలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో సైతం.. ‘జనం ఈ జగనన్నను ఓడించి పొరపాటు చేశామని తెగ బాధపడిపోతున్నార’ని చెప్పడంపై, అటు పార్టీలోనూ విస్మయం వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE