Suryaa.co.in

Andhra Pradesh

చిత్తూరు డైరీని అమూల్‌కు ధారాదత్తం చేయడమంటే.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే

కాపాడాలని సీఎస్‌కు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ

చిత్తూరు డైరీని అమూల్‌కు ధారదత్తం చేసే ప్రయత్నాలు నిలిపివేయాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ చర్య తెలుగువారి ఆత్మగౌరవాన్ని అమూల్‌కు తాకట్టు పెట్టడమేనని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు లేఖ పాఠమిది.

తేదీః 03-07-23
గౌరవనీయులైన
శ్రీ కేఎస్ జవహర్ రెడ్డి గారికి,
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,
అమరావతి.

విషయం- చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, ఇక్కడి ప్రజాసంపద, సహకార డైయిరీల వేలకోట్ల విలువైన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడం గురించి..

దశాబ్దాల కాలం నుంచి ఉన్న సహకార వ్యవస్థను మూసివేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార డైయిరీలతో పాటు మూతపడిన చిత్తూరు డైయిరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి మాట మార్చి రాష్ట్రంలోని సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార డైయిరీలను బలహీనపర్చేలా గుజరాత్ కు చెందిన అమూల్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు చిత్తూరు డైయిరీ పునరుద్ధరణ పేరుతో అమూల్ కు కట్టబెడుతుండటం దుర్మార్గం.

ప్రభుత్వ నిర్ణయాలతో పాడి రైతులకు ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే మౌలిక వసతులు, ఇతర సహకార డైయిరీల ఆస్తులు కలిపి రూ.6వేల కోట్ల ప్రజాసంపదను అమూల్ కు దోచిపెడుతున్నారు. చిత్తూరు డైయిరీని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ కమీషన్లు, కేసుల మాఫీ కోసం అమూల్ కు ఏడాదికి రూ.కోటి లీజుపై 99 ఏళ్లకు అప్పగించారు. చిత్తూరు డైయిరీకి చెందిన రూ.650 కోట్ల ఆస్తులు సైతం కట్టబెట్టారు. చిత్తూరు నగరంలో కలెక్టరేట్‌ సమీపాన ప్రధాన రహదారి మీద ఉన్న 33 ఎకరాల స్థలంతో పాటు వి.కోట, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరులో చిల్లింగ్ సెంటర్లు కూడా అప్పజెప్పారు. జర్మనీ, జపాన్‌ వంటి విదేశాల నుంచి తెప్పించిన సామగ్రి విలువ సుమారు రూ.30 కోట్లు పైనే ఉంటుంది. ఈ సంపదనంతా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అమూల్ కు అప్పనంగా ఇస్తున్నారు. చివరకు చిత్తూరు డైయిరీ వ్యవస్థాపకుడి విగ్రహం సైతం కూలగొట్టడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం కాదా?

సహకార రంగ డైయిరీలను సమర్థంగా నడిపే సత్తా ఇక్కడి వారికి లేదా? స్థానికంగా ఉండే డైయిరీలను కాదని ఎక్కడో గుజరాత్ కు చెందిన అమూల్ ను తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? అమూల్ వల్ల ఇక్కడ ఉద్యోగాల కల్పన జరగదనే వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఇక్కడి ఉద్యోగాలను, సంపదను పొరుగు ఉన్న అమూల్ కు ధారాదత్తం చేస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమూల్ మోసాన్ని గ్రహించి దూరం పెట్టాయి. కర్ణాటక తమ రాష్ట్రంలోని నందిని డైయిరీని, తమిళనాడు రాష్ట్రం ఆవిన్ డైయిరీ, పొరుగున ఉన్న తెలంగాణ విజయ డైయిరీకి మద్దతుగా నిలుస్తుండగా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం గుజరాత్ కు చెందిన అమూల్ డైయిరీకి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు. అమూల్ కంటే తక్కువ నిధులు అవసరమయ్యే రాష్ట్ర డైయిరీలకు మద్దతుగా నిలబడకపోవడం వెనుక కమీషన్లే కారణమా? అమూల్ వల్ల ప్రజలకు కలిగే లాభాలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అమూల్ కంటే స్థానిక డైయిరీలే రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాయి. వీటన్నింటిని విస్మరించి అమూల్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.

ఎన్నికలకు ముందు పాడి రైతులకు లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామనే హామీపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాటతప్పి మడమతిప్పారు. బోనస్ గా రైతులకు ఏడాదికి రూ.312 కోట్లు చొప్పున ఇప్పటివరకు సుమారు రూ.,1,250 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ నగదును రైతులకు ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలి?

ఇప్పటికైనా ప్రజావిరుద్ధ చర్యలు మానుకుని అమూల్ కు దాసోహమవడం మానుకోవాలి. చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేయకుండా ఇక్కడి సహకార డైయిరీలకు ప్రభుత్వం మద్దతుగా నిలవాలి. ఇక్కడి ప్రజాసంపద పరులపాలవకుండా కాపాడాలి.

కె.అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

LEAVE A RESPONSE