– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, అక్టోబర్ 14: రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటని, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమితో కలిపి దసరా పండుగను జరుపుకుంటారన్నారు. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపంలో హతుడయ్యాడని, మహిషుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా దేశమంతా జరుపుతూ వస్తున్నారని తెలిపారు. గత రెండేళ్ళుగా ప్రజలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోందని, అమ్మవారి కృపతో కరోనా కష్టాలు తొలగిపోవాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం జగన్మోహనరెడ్డికి ఆశీస్సులను అమ్మవారు అందించాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మంత్రి కొడాలి నాని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.