Suryaa.co.in

Andhra Pradesh

పింగళి వెంకయ్యకు నిజమైన నివాళి ‘హర్ ఘర్ తిరంగ’

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడ, ఆగస్టు 2: పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వేచ్చా స్వాతంత్య్ర భారతదేశ స్ఫూర్తికి పర్యాయపదంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిస్వార్ధ స్వాతంత్ర్య సమర యోధునిగా వెంకయ్య దేశం కోసం తన జీవితాన్నే అర్పించారన్నారు.

సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జాతీయ సమైఖ్యతలో మువ్వన్నెల జెండా: భారతీయ భాషా సాహిత్యంలో త్రివర్ణ పతాక ప్రతిఫలనాలు అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్పుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 1921 మార్చిలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య స్వరాజ్య జెండా రూపకల్పన గావించి మహాత్మా గాంధీజీకి అందించారన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తిరంగాను ఇంటికి తీసుకొచ్చి నివాసాలపై పతాకావిష్కరణ గావించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆచరించాలన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుందని, జాతీయ జెండా మనకు గర్వకారణమని గవర్నర్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా సత్కరిస్తున్నామన్నారు. దేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాలు దేశం యొక్క అద్భుతమైన గతాన్ని వెల్లడిస్తుండగా, మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్యం ఎలా సాధించగలిగామన్న దానిపై యావత్ జాతి గర్వించాలనేదే వీటి లక్ష్యమన్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధానితో కలిసి ఇటీవల హాజరైన కార్యక్రమాన్ని, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్‌ను ఆవిష్కరించిన విషయాలను గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఎనిమిదేళ్లపాటు ఒరిస్సాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1817లో బక్సీ జగభందు నేతృత్వంలో జరిగిన పైకా తిరుగుబాటుపై గవర్నర్ రాసిన ‘మహాసంగ్రామర్ – మహా నాయక్’ నాటకాన్ని ఇటీవల నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. జాతీయ జెండా రూపకల్పనకు శ్రీ పింగళి వెంకయ్య చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుందని, ప్రజలు ఐక్యంగా ఉండి దేశం పట్ల, జాతీయ జెండా పట్ల ప్రేరణ పొందాలన్నారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ఆర్.నరసాయమ్మ, ప్రముఖ తెలుగు రచయిత, సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ కె. శివారెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కె. శ్రీనివాసరావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.

LEAVE A RESPONSE