-రాఘవ శర్మ
“ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”
“మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈనెల 2వ తేదీన నాగ్ పూర్ లో ప్రకటించారు.
ఈ మాటలు ఆ సంస్థ సభ్యులను సైతం ఆశ్చర్యపరిచాయి.
“బీజేపీ అన్ని మతాలనూ గౌరవిస్తుంది. ఏ మతాన్నైనా సరే, ఏ మతానికి చెందిన వారినైనా సరే అవమానించడాన్ని బీజేపీ ఖండిస్తుంది” అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు.ఈ మాటలు బీజేపీ శ్రేణులనే కాదు, దేశం మొత్తాన్ని ఆశ్చర్య పరచాయి.
దేశాన్ని ఎనిమిదేళ్ళుగా పాలిస్తున్న బీజేపీ నాయకత్వంతో పాటు, దాని తాత్విక రూపం ఆర్.ఎస్.ఎస్ స్వరంలో తొలిసారిగా వెలువడిన మాటలివి.వీరిస్వరం నిజంగా మారిందా?అవసరానికి స్వరం మార్చి చెపుతున్నారా? అన్నది ఇప్పుడు ప్రజల ముందున్న అతి పెద్ద సందేహం.
బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఆపార్టీ ఢిల్లీ మీడియా సెల్ బాధ్యుడు నవీన్ కుమార్ మహమ్మద్ ప్రవక్త పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి.
“ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్” తమ తీవ్ర నిరసనను వ్యక్త చేసింది.
ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన సంస్థల్లో ఐక్యరాజ్య సమితి తరువాత అతి పెద్ద సంస్థ ఇది.యాభై ఏడు ఇస్లామిక్ దేశాలతో ఏర్పడిన ఈ సంస్థ పరిధిలో 180 కోట్ల మంది ప్రజలున్నారు.అంటే భారత జనాభాకంటే 50 కోట్ల మంది అధికం.
భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ముస్లిం మహిళలు విద్యాలయాలలో ‘హిజాబ్’ ధరించడాన్ని నిషేధించినప్పుడు, మైనారిటీలపై హింస, వారి ఆస్తుల విధ్వంసం జరిగినప్పుడు కూడా గతంలో ‘ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కో-ఆపరేషన్” భారతదేశానికి తమ నిరసనను తెలిపింది.
భారత్ తో సత్సంబంధాలున్న ఖతర్, కువైట్ వంటి దేశాలు కూడా భారత రాయబారిని పిలిచి తమ నిరసనను వ్యక్తంచేశాయి.మహమ్మద్ ప్రకవక్తపై బీజేపీ నాయకులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇస్లామిక్ దేశాలు భగ్గుమన్నాయి.భారత ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి.సామాజిక మాద్యమాలలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.యాభై ఏడు ఇస్లామిక్ దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాలు దెబ్బతింటే భాతర ఆర్థిక వ్యవస్థ అతి పెద్ద కుదుపునకు గురవుతుంది.ఇస్లామిక్ దేశాలలో ఉన్న హిందువుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తుంది.ఈ నేపథ్యంలో విధిలేక భారత విదేశీ వ్యవహారాల శాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
మహమ్మద్ ప్రక్తను కించపరిచే మాటలు తమవి కావని, అలా కించపరిచిన వారిపై చర్యలు తీసుకుంటామని ముస్లిం దేశాలకు హామీ ఇచ్చింది.నుపూర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, నవీన్ కుమార్‌ను పార్టీ ప్రథమిక సభ్యత్వం నుంచి తొలగించింది.కేంద్రంలో, కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మైనారిటీల పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నారనడానికి అనేక సంఘటనలు ప్రజల మదిలో ఇంకా సజీవంగా ఉన్నాయి.
బీజేపీ నాయకత్వంలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా జహంగీర్‌పురిలోని పేద ముస్లింల ఇళ్ళను, షాపులను బుల్ డోజర్లతో ధ్వంసం చేశారు.మధ్య ప్రదేశ్ లోని రాయ్ గఢ్ జిల్లాలో ఒక నిందితుడి ఇంటిని బుల్ డోజర్ తో కూలదోయమని స్వయంగా బీజేపీ ముఖ్యమంత్రే ఆదేశాలు జారీ చేశారు.షియాపూర్ లోనూ ఇలాగే ధ్వంసం చేశారు.ఖార్ గో లోనూ ముస్లిం ఇళ్ళను ధ్వంసం చేశారు.ఉత్తరప్రదేశ్ లో ఇక లెక్కేలేదు.బుల్డోజర్ చర్యలు ఇటీవల అక్కడి నుంచే మొదలయ్యాయి.ఈ సంఘటనల్లో ఇళ్ళుకోల్పోయిన వారంతా ముస్లింలే.
శ్రీరామ నవమి ఉత్సవాల పేరుతోను, హనుమాన్ శోభాయాత్రల పేరుతోను ముస్లిం ఇళ్ళముందు, మసీదుల ముందు కత్తులతో, కాషాయ జెండాలతో ఊరేగింపులు జరిపి, వారిని రెచ్చగొట్టి, వారి పైన కేసులు పెట్టి, వారి ఇళ్ళను ధ్వంసం చేయడమేనా అన్ని మతాలను గౌరవించడం అంటే !?ముస్లింలకు ఇళ్ళు లేకుండా, ఉపాధి లేకుండా చేయడమేనా బీజేపీ అన్ని మతాలను గౌరవించడమంటే!?
ఆర్.ఎస్.ఎస్. ముస్లింలతో ఏర్పాటుచేసిన అనుబంధ సంస్థ ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ ను ఉద్దేశించి ఆదివారం మోహన్ భగవత్ మాట్లాడుతూ “హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఎవ్వరి ఆధిపత్యం ఉండకూడదు. దేశంలో భారతీయుల ఆధిపత్యమే ఉండాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం” అన్నారు.నిజానికి ఇవి ఎంత మంచిమాటలు!
“భారత దేశంలో ముస్లింలు ఉండరాదు అని ఏ హిందువైనా అంటే అతను హిందువు కాదు” అని ఎంతో ఆదర్శంగా చెప్పారు.మరొక అడుకు ముందుకేసి “మతంతో సంబంధం లేకుండా భారతీయులందరి డిఎన్ఏ ఒకటే” అని చెప్పి ఆర్.ఎస్.ఎస్ వారిని కూడా ఆశ్చర్యచకితులను చేశారు.
ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్థలే బాబ్రీ మసీదును కూలగొట్టి, దేశంలో, ముఖ్యంగా గుజరాత్ లో మతవిద్వేషాలను పురిగొల్పి, వేలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైనప్పుడు, ఈ తాత్విక దృష్టి ఆర్.ఎస్.ఎస్‌కు, దాని అనుబంధ సంస్థలకు ఏమైంది!?
గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడులు చేసినప్పుడు, క్రైస్తవుల పైన, చర్చిలపైన దాడులు చేసినప్పుడు, హిందూ ముస్లిం వివాహాలకు వ్యతిరేకంగా ‘లవ్ జిహాదీ’ ప్రయోగించినప్పుడు, పండుగలను ఒక సందర్భంగా చేసుకుని ముస్లింల నివాస ప్రాంతాలలోకి బలవంతంగా ప్రవేశించినప్పుడు ఈ తాత్విక చింతన గుర్తుకు రాలేదా!?
రామ జన్మభూమి పేరుతో అయోధ్యలో బాబ్రీ మసీదును ఎలాగూ కూల్చేశారు.ఫలితంగా దేశ మంతా మతకల్లోలాలు రేగాయి.ఈ కల్లోలాలలో హిందువులు, ముస్లింలు ఆస్తులను కోల్పోయారు.వేలాదిమంది ప్రాణాలనూ కోల్పోయారు.ఆస్తులు, ప్రాణాలు కోల్పోయిన వారిలో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడి జన్మస్థానమని మదురలో షాహీఈద్గా మసీదును తొలగించాలని పట్టుబట్టడం, వారణాసిలో కాశీ విశ్వేశ్వరాలయం వద్ద ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని, ఆ మసీదును తొలగించి ఆ జాగాను తమకు అప్పగించాలని ఫిర్యాదుచేయడం, కుతుబ్ మినార్ ఆవరణలోని మసీదును తొలగించాలని కోరడం, తాజ్ మహల్ అసలు శివాలయమని వాదిండంలో సంఘ్ పరివార్ శక్తుల సాహసమేమిటి!?ఈ సాహసాలన్నీ మోహన్ భగవత్ తాజాగా ప్రవచించిన తాత్వికతకు లోబడే ఉన్నాయా!?
మహాత్మా గాంధీ హత్యను సమర్థించి, ఆ హత్యచేసిన నాథూరామ్ గాడ్సేను దేశ భక్తుడని బీజేపీ ఎంపి ప్రజాసింగ్ కీర్తించినప్పుడు కానీ, ఆ పార్టీ ఎంపిలు సాక్షి మహరాజ్, తేజస్వీ సూర్యా ముస్లింల పై విద్వేష వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ మోహన్ భగవత్ ఇలా హిత బోధ ఎందుకు చేయలేదు!?
ప్రధాని నరేంద్ర మోడీనోరు ఎందుకు మెదపలేదు!?బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలు, ఇతరమైనారిటీ వర్గాలు ఒక అభద్రతకు లోనయినమాట వాస్తవం.మనకు స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తి కావస్తున్నాయి.కశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు.బీజేపీ అధికారంలోకి వచ్చాక అది మరింత జఠిలమై కూర్చుంది.కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడే 1990లో కశ్మీరి గవర్నర్ జగ్ మోహన్ మల్తోత్రా లోయలోని పండిట్లను ఇతర ప్రాంతాలకు బస్సుల్లో తరలించారు.
“రెండు నెలల్లో మిమ్మల్ని కశ్మీరుకు తిరిగి తీసుకెళతాం. ఇక్కడ ప్రజలపైన బలప్రయోగం చేయాలి. మీరు ఇక్కడ ఉంటే ఆప్రభావం మీపైన ఉంటుంది” అని పండిట్లకు నచ్చచెప్పి మరీ వారిని తరలించారు.
కశ్మీరులో ప్రజలను హిందు పండిట్లుగా, ముస్లింలుగా విభజించి, ముస్లింల పైన దాడిచేయడమే ఎజెండాగా బీజేపీ భాగస్వామిగా గల కేంద్రప్రభుత్వం నాడు పూనుకున్నది.ఆ మతచిచ్చు ఇప్పటి వరకు ఆరలేదు.మతం ప్రాతిపదికగా ప్రజలను విడదీసి పాలించాలనుకోవడం వల్లనే పండిట్లను ఇప్పటి వరకు తిరిగి లోయలోకి పంపించ లేకపోతున్నారు.పండిట్లు తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలని, 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని 2008లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు.దాంతో కశ్మీర్ లోయలో పండిట్లు ఉద్యోగాలు పొంది ప్రశాంతంగానే ఉన్నారు.ఆ లోయలో ఇప్పుడు 4000 మంది పండిట్లు పనిచేస్తన్నారు.జమ్ము కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని బీజేపీ ప్రభుత్వం 2019లో రద్దు చేయడంతో ఇటీవల లోయలో అలజడి మళ్ళీ మొదలైంది.
గత శుక్రవారం మిలిటెంట్లు విజయ్ కుమార్ అనే బ్యాంకు మేనేజర్ ను కాల్చిచంపారు.అతను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి.గత నెల 12న రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని ఆఫీసులో ఉండగానే కాల్చి చంపారు.ఒక ముస్లిం కళాకారిణిని చంపారు.ఒక టీచర్ ను చంపారు.ఒక వైన్ షాపు ఉద్యోగిని చంపారు.దీంతో కాశ్మీరిపండిట్లలో భయాందోళనలు నెలకొన్నాయి.ప్రభుత్వం తమకు భద్రత కల్పించలేకపోతోందని, వందలాది మంది కశ్మీరి పండిట్లు లోయను ఒదిలేసి జమ్ముప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు.పండిట్లకు కూడా ఈ ప్రభుత్వం పైన నమ్మకం సడలిపోయింది.ఎందుకిలా జరిగింది!?బీజేపీ అధికారంలో ఉన్నరాష్ట్రాలలో ముస్లింలే ధ్యేయంగా దాడులు చేశారు.వారి ఇళ్ళను, షాపులను బుల్ డోజర్లతో కూల్చివేశారు.
బాబ్రీ మసీదు లాగా ముస్లింల ప్రార్థనాలయాలను, మొగల్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలను కూడా కూల్చివేయాలనో, హిందూ ఆలయాల పేరుతో స్వాధీనం చేసుకోవాలనో వివాదాలు మొదలు పెట్టడం వల్ల కాశ్మీర్ లోయలో మిలిటెంట్ల నుంచి ప్రతి చర్యలు మొదలయ్యాయి.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వీటి నుంచి బైటపడడమే తక్షణావసరం.అందుకే దాని తాత్విక పునాదిగా గల ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈనెల 2వ తేదీన నాగ్ పూర్ లో ప్రసంగిస్తూ, “మసీదులను దేవాలయాలుగా మార్చాలనే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్ఎస్ఎస్ పాల్గొనదు” అని ప్రకటించారు.
ఆ ప్రకటన నిజంగా వారి మనసు నుంచి వచ్చినట్టయితే “మసీదులను తవ్వుదాం. శివలింగాలు వస్తే మావి.మట్టివస్తే మీవి” అని ముస్లింలను రెచ్చగొట్టేలా బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు, ఆపార్టీ ఎంపి బండిసంజయ్ అన్నప్పుడు ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ గానీ, దేశాధినేత ప్రధాని నరేంద్ర మోడీ గానీ ఎందుకు వారించలేదు!?ఈ సంఘపరివార్ నాయకుల వ్యవహారం ఎలా ఉందంటే ‘గిల్లి జోలపాడే’ లా ఉంది.