Suryaa.co.in

Telangana

మునుగోడులో గెలిచేది బీజేపీనే

-ప్రజాస్వామ్యస్పూర్తిని కాపాడిన ఓటర్లకు హ్యాట్సాఫ్ 
-దాడులు, అరాచకాలపై పోరాడిన బీజేపీ కార్యకర్తలకు, యువతకు నా సెల్యూట్ 
-టీఆర్ఎస్ కు తొత్తులుగా మారిన రాచకొండ కమిషనర్, ఎస్పీ
-కేసీఆర్ ఆదేశాలకు తలొగ్గిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి
-విచ్చలవిడిగా డబ్బులు పంచినా, మద్యాన్ని ఏరులై పారించినా పట్టించుకోలేదు
-డబ్బులిచ్చినా… తీసుకున్నా నేరమని చెప్పిన ఎన్నికల కమిషన్ చూస్తూ మౌనంగా ఉండటం నేరం కాదా?
-పోలింగ్ సమయంలోనే ఓటర్లకు ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేసిన ట్విట్టర్ టిల్లుపై చర్య తీసుకోవాల్సిందే
గులాబీలకు గులాంగిరి చేసేటోళ్ల అంతు చూస్తాం..
-ఎన్నికల ప్రధానాధికారిపై తప్పకుండా ఫిర్యాదు చేస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్

మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా వెరవకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మునుగోడు ఓటరు మహాశయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ తొత్తులుగా మారి లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా, లాఠీఛార్జ్ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. గులాబీలకు గులాంగిరీ చేసే అధికారుల, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, ప్రశాంత్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

ఇప్పుడే ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ విన్న. 8 గంటలకు పోలింగ్ జరగాలట. డబ్బులిచ్చి ఓటర్లను తీసుకొచ్చి టీఆర్ఎస్ కు ఓటేయించండని చెబుతున్నడు.. దీనిపై ఫోన్ ద్వారా ఎన్నికల కమిషనర్ ద్రుష్టికి తీసుకెళ్లిన. నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలను చేధించుకుని ఓటు హక్కును వినియోగించుకున్న మునుగోడు ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున హ్రుదయ పూర్వక ధన్యవాదాలు. మునుగోడు ఓటింగ్ సరళి, శాతాన్ని చూశాక ప్రతి ఒక్కరికి స్పూర్తి నింపింది. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలనే సంకేతాలను పంపారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినా, ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన మా బీజేపీ కార్యకర్తలకు, యువతకు సెల్యూట్ చేస్తున్నా.

మునుగోడు ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ద్వారా మందు, మనీ పారిస్తూ ప్రలోభాలకు గురిచేశారు. అనేక అరాచకాలు చేశారు. ఇష్టానుసారంగా మద్యాన్ని పంచారు. ఎక్కడ చూసినా మందు బాటిళ్లే. స్వచ్ఛ భారత్ చేయాలేమో.. పూర్తి ఎన్నికల ప్రక్రియనే నాశనం చేసిన మూర్ఖులు టీఆర్ఎసోళ్లు. మొదటి నుండి ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం.. కానీ ఎన్నికల ప్రధానాధికారి పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారారు. ఆయన చేసిందేమీలేదు. ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప..

ఇంకా డబ్బు ఇచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు కూడా నేరస్తులేనని చిలకపలుకలు పలికారు. చూడనట్లు వ్యవహరించిన ఆయన కూడా ఈ లెక్కన నేరస్తుడు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేసినవ్. ఎన్నికలు సజావుగా జరపలేని నిస్సహాయుడివి.

వేలాది మంది టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో తిష్టవేసి ప్రలోభాలకు గురిచేస్తుంటే.. మా బీజేపీ నాయకులు దొరకపట్టుకుని అప్పగిస్తే మావాళ్లపైనే లాఠీ చేశారు. పైగా 42 మంది మాత్రమే దొరికారని ప్రకటనలు ఇవ్వడం సిగ్గు చేటు. 7 ఏళ్లుగా ఒకే చోట పోస్టింగ్ ఇచ్చి కొనసాగించి అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించినందుకు సంబంధిత పోలీస్ కమిషనర్ తోపాటు జిల్లా ఎస్పీ కేసీఆర్ కు గురు దక్షిణగా గులాంగిరీ చేసిండు.

బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శివన్నగూడెం వెళితే తప్పతాగి టీఆర్ఎస్ గూండాలు దాడికి యత్నించారు. సిద్దిపేట నుండి 200 మంది టీఆర్ఎస్ గూండాలు అరాచకం చేశారు. చండూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పోలింగ్ బూత్ వద్ద క్యూలో ఉంటే ఎస్పీ వచ్చి అడ్డగోలుగా వ్యవహరించారు. జనం నవ్వుకుంటున్నా సిగ్గు లేకుండా గులాబీలకు గులాంగిరీ చేసిర్రు. మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే. గెలిచేది రాజగోపాల్ రెడ్డి మాత్రమే.

ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నరు. రాజగోపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నరు. ఈ విషయం తెలిసే టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. గత 3 రోజులుగా నేను స్థానికేతరులెవరూ మునుగోడులో ఉండొదదని విజ్ఝప్తి చేస్తూనే ఉన్నా. పోలీసులకు సమాచారం పంపిన. అయినా పట్టించుకోలేదు. బీజేపీ నేతలు పట్టిస్తే వాళ్లపైనే దాడులు చేయిస్తున్నరు. టీఆర్ఎస్ బూతు చానల్ వాహనంలో, అంబులెన్సుల్లో డబ్బు సంచులు తీసుకెళ్లి ఓటర్లకు పంచారు.

ఎస్ఐ నుండి ఎస్పీ వరకు అనుకూలమైన అధికారుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలను, కార్యకర్తలను కొట్టించారు. అయినా మా కార్యకర్తలు అదరలేదు… బెదరలేదు. తెగించి కొట్లాడారు. చండూరులో విచక్షణారహితంగా కొట్టారు. ఈ విషయాన్ని కవర్ చేసేందుకు వచ్చిన వరంగల్ ఎన్టీవీ రిపోర్టర్ అరుణ్ ను కూడా పోలీసులు దాడికి యత్నించి గుంజుకుపోవడం సిగ్గుచేటు.. మీరెన్ని చేసినా టీఆర్ఎస్ అవుట్ కాబోతోంది. పురిట్లోనే బీఆర్ఎస్ ఖతం కాబోతోంది. అయ్యా కొడుకు పనైపోయింది. అబద్దాల అల్లుడికి తగిన బుద్ది చెప్పబోతున్నరు.

ఒక గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటుకు రూ.50 వేలిచ్చిండు. మెజారిటీ వస్తే టిక్కెట్ వస్తుందని అడ్డగోలుగా డబ్బులు పంచిండు. ఒక్క గ్రామానికే రూ.20 కోట్లు ఖర్చు పెట్టినని బాహాటంగా చెప్పుకుంటున్నారంటే.. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్ధమవుతోంది. వీళ్ల తీరును చూసి యావత్ భారత్ దేశం అసహ్యించుకుంటోంది. సామాన్యులు, కష్టపడే కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆశ్చర్యమేమిటంటే…. టీఆర్ఎస్ గూండాలే కొడతరు.. వాళ్లే దాడులు చేస్తరు.. వాళ్లే మా కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడ్తరు. మావాళ్లు ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు…

ఇయాళ పోలింగ్ జరుగుతున్న టైంలోనే ట్విట్టర్ టిల్లు రంగంతండ, హాజినా తండా ప్రజలకు ఫోన్ చేసి అన్ని విధాలా ఆదుకుంటామంటూ ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. టీఆర్ఎస్ కార్యకర్తలే బీజేపీ కండువాలు వేసుకుని తండాలకు పోవడం .. బీజేపీకి ఓటేస్తామనే వారిని పోలింగ్ కు రాకుండా అడ్డుకున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. ఓటర్లకు రాత్రింబవళ్లు డబ్బులు పంచారు. అయినా ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను పట్టుకోలేదు.

ఇతరత్రా పనులకు డబ్బు తీసుకెళ్లే బీజేపీ నేతలను పట్టుకుంటున్న పోలీసులు… టీఆర్ఎస్ నేతలను ఎందుకు పట్టుకోలేదు? టీఆర్ఎసోళ్లు ఓటర్లకు మందు, మనీ పంచలేదని చెప్పే దమ్ముందా? గులాబీలకు మీరు చేసే గులాంగిరీ చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. వాళ్లపై ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల కమిషన్ పైనా ఫిర్యాదు చేస్తాం. మీరెన్ని కుట్రలు చేసినా… భారీ మెజారిటీతో గెలిచేది బీజేపీనే.

LEAVE A RESPONSE