Suryaa.co.in

Features

76 ఏళ్ళ సర్వసత్తాక సార్వభౌమ దేశంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?

భారత దేశం సర్వసత్తాక సార్వభౌమ దేశంగా ఆవిర్భవించి 76 ఏళ్ళు పూర్తి అవుతుంది. జాతి చరిత్రలో 76 ఏళ్ళు తక్కువ సమయం కాదు.తెల్ల దొరలను తరిమి కొట్టి స్వయం పరి పాలన తెచ్చుకొన్న దెశ ప్రజల ఆకాంక్షలు ఈ 76 ఏళ్లలో నెరవేరాయా ? 1947 ఆగష్టు 15 అర్ధ రాత్రి స్వాతoత్రo వచ్చింది. ఇంకేముంది బ్రిటీష్ వారి నుంచి అధికారం మన చేతికి వచ్చిందని సంబర పడ్డాం.కానీ తర్వాత కొద్ది రోజులకే అది బ్రమ అని రుజువైంది.అధికారం తెల్లవాడి చేతినుండి నల్లవాడి చేతికి బదిలీ అయిందే తప్ప సామాన్య పౌరులకు కాదు.

ఒకప్పుడు,రాజులు,మహారాజులు దేశాలను ఎలితే ఇప్పుడు వారికి తీసిపోని విధంగా రాజ్యం ఏలుతున్నారు. తెల్ల దొరల పాలనలో జరగనంత అనర్ధం,విలువల పతనం,అవినీతి,అక్రమాలు,కుల,మత,ప్రాంత వైషమ్యాలు ఈ 76 ఏళ్లలో ఎందుకింతగా పెరిగి పోయాయి?ఇందుకు కారణం ఎవ్వరు?దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన తొలి రోజుల్లో జాతిని ఏక తాటి పై నడిపించిన అప్పటి నేతలు మహాత్మా గాంధీ,జవహర్ లాల్ నెహ్రు,సర్దార్ వల్లభాయి పటేల్,డాక్టర్ బి ఆర్ అంబెద్కర్ ,డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ,బాబూ రాజేంద్రప్రసాద్,లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఉద్దండులను తలచుకొంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది. నేడు జాతిని ఉత్తేజ పరచగల నాయకత్వం కొరవడింది. నీతి,నిజాయితీ,నిబద్దత ,రాజనీతజ్ఞత వున్న నాయకులను గుర్తించి ఎన్నికల్లో గెలిపించి చట్టసభలకు పంపడంలో ఓటర్లలో నెలకొన్న ఉదాసీనతే ఇందుకు కారణం.

నిజం చెప్పాలి అంటే ప్రధాన లోపం మనలోనే వుంది. సమాజంలో ఏమి జరిగినా మనకెందుకులే,మనం బాగుంటే చాలు,నాలుగు రాళ్లు వెనకేసుకో గలిగితే, ఎవరెటు పోయినా,దేశం,రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదనే ధోరణి ప్రజల్లో ప్రభలడం వల్లనే దేశానికి, జాతికి ఈ దుస్థితి పట్టింది.ఒకప్పుడు అవినీతిపరుల ముఖం కూడా చూడటానికి సమాజం ఇష్టపడేది కాదు. నేడు లక్షల కోట్లు దోచుకొన్నా అడిగే వారు, ప్రశ్నించే వారు లేరు. విద్యావంతులు,మేధావులు కూడా అవినీతి అతి సాధారణ విషయంగా తెల్చేయ్యడం విషాదకరం. ఎవరెంత దోచుకొన్నా ఎన్నికల్లో ప్రజలు గెలిపించి అందలాలు ఎక్కిస్తున్నారు.అవినీతి పరులంతా శాసన నిర్మాతలై వెలిగిపోతున్నారు.

ప్రజలందరి కోసం పాలన ఏర్పడు తుందని, స్వాతంత్య్రం లభిస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన, త్యాగాలు చేసిన కోట్లాది ప్రజల జీవితాలు నేడు ఛిద్రమవు తున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్నట్టు కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు వేటికవి స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేయడం లేదు. పాలకులు సొంత అజెండా అమలు కోసం ఆడ్డదారులు తొక్కి తాము అనుకున్నది సాధించుకుంటున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ప్రజల పాత్ర ఓట్లు వేసే వరకే పరిమితం అవుతుంది . ప్రజా ప్రతినిధులు అంగడి సరుకుగా మారిపోతున్నారు. మనది ప్రపంచంలోనే ప్రభావ వంతమైన ప్రజాస్వామ్యమని దేశ,విదేశాల్లో డప్పుకొట్టు కొంటాము . నేడు కులాల కుమ్ములాటలతో రాజకీయ వ్యవస్థను బ్రష్టు పట్టించారు. నాడు స్వాతంత్య్రం కోసం కుల, మతాలలో నిమిత్త లేకుండా మహత్తర పోరాటాలు చేసి స్వాతంత్య్రం సాధించుకున్నారు. నేటి పాలకులు నాటి పోరాటాల లక్ష్యాలను తుంగలో తొక్కి కుల,మతాల చిచ్చురేపి రాజకీయ చలిమంటలతో చలికాగుతున్నారు.

సామాజిక హక్కుల కోసం పోరోడుతున్న కార్యకర్తలను, పాలనా వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలను విమర్శించే వారిని, అలాంటి రచనలు చేసే జర్నలిస్టులను, మేధావులను అరెస్టుచేసి జైళ్లలోపెడుతున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ దిగజారుతున్నప్పటికీ తాము గొప్ప అభివృద్ధిని సాధించామని గొప్పలు చెప్పుకొంటున్నారు.

నల్ల ధనం పెరిగిపోయింది. దేశం ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లక్షలాది మందికి ఉద్యోగాలు వూడిపోతున్నాయి.దేశం నెత్తిన నిరుద్యోగం ఉరుముతున్నది. విధి విధానాలు ప్రతిపక్ష పార్టీలకు, సామాన్యులకు వ్యతిరేకంగా అమలు చేస్తున్నారు. పాలకులకు ఏ చట్టాలు, విధి విధానాలు వర్తించవు.చట్టసభల్లో చర్చ లేకుండానే చట్టాలుచేస్తున్నారు . వందలు వేల కోట్లు పోగు చేసుకున్న వారే చట్ట సభలకు ఎన్నికై మరింత సంపద కోసం, ఉన్నదాన్ని కాపాడుకునేందుకు పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలంటే వీరికి పడదు. చట్టసభల్లో చేతులెత్తడానికి పరిమితమవుతున్నారు.

తొలితరం పార్లమెటీరియన్లలో తొణికి సలాడిన నిస్వార్ధం,త్యాగనిరతి,నిబద్ధత ఎక్కడా,ఎవరిలో కనిపించదు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలకె ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశమాత విముక్తి కోసం 90 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పొరాడి ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలేసిన ఎందరో దేశ భక్తుల త్యాగాల పునాదుల నిర్మితమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు విశ్వసనీయత కోల్పోయాయి.

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట బురుజుల నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానులు చేస్తున్న ప్రసంగాలు ఆదర్శాలు అరగదీతే తప్ప సారాంశంలో కొత్తదనం కనపడదు. చేసిన వాగ్దానాలు.బానిసత్వం నుండి విముక్తి పొందడం కాదు,సమ సమాజ నిర్మాణ లక్ష్యమని, నెహ్రూ లక్నో కాంగ్రెస్ 1936 అధ్యక్షో పన్యాసంలో ప్రకటించారు.నేటికీ జాతీయోధ్యమ లక్ష్యం నెరవేరలేదు.మహాత్మాగాంధీ కలలు కన్నదరిద్ర నారాయణులకు విముక్తి కలగలేదు.

భారత్ అభివృద్ది చెందుతున్న దేశంగా ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా భారత ప్రగతి రధం ఇంకా కుంటి నడకే నడుస్తుంది. స్వాతత్ర్యం సిద్దించి 76 ఏళ్ళు అయినా గ్రామీణ భారతం ఇంత పేదరికంలోనే ఎందుకు మగ్గిపోతుంది అనే ప్రశ్నకు జవాబు వెతకడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించడం లేదు.అధిక ధరలు,పేరుకుపోయిన నిరుద్యోగం, ఇష్టానుసారం ప్రైవేటీకరణ, లాభాల బాటలో కార్పోరేట్స్‌, ఒక శాతం సంపన్నుల చేతుల్లో దేశంలో సగం సంపద.

ఎన్ని పధకాలు అమలవుతున్నా పేదలు పేదలు గానే మిగిలివున్నారు.గ్రామీణులు అధిక శాతం పేదరికంలో మగ్గుతున్నారని ఆ మధ్య కేంద్రం నిర్వహించిన సామాజిక ఆర్ధిక కుల గణన సర్వే వెల్లడించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నేళ్లు గా ఖర్చు పెడుతున్న నిధులు గ్రామీణ పేదలకు చేరలేదని అర్ధం అవుతుంది.నిధులన్నీ ఎక్కడికి పోయ్యాయి అన్న దానికి సమాధానం దొరకదు. ఏవో కొన్ని రంగాల్లో పురోగతి సాధించామంటున్నా వాస్తవిక స్థితిగతులు మాత్రం ఆందోళన కరంగా ఉన్నాయి. స్వేచ్ఛా భారతం ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.

భారతదేశం ఇప్పటికీ విద్యా, వైద్యంలో వెనకబడే వున్నాం. చాలా పట్టణాలు, గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలుగానీ, పాఠశాలలు,రోడ్లు గానీ లేవు. సాధారణ ప్రజలకు,సంపన్న వర్గాలకు మధ్య అంతరం పెరిగిపోయింది. మరోవైపు మేధావులు, దళితులు, మైనారిటీలు, మహిళలపై దేశభక్తి పేరుతో, స్థానికత పేరుతో జరుగుతున్న దాడులు అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి.

పేదలతో ఓట్లు వేయించుకోని గెలిచిన రాజకీయ నాయకులు మాత్రం సంపన్నుల జాబితాలో చేరిపోతున్నారు. గ్రామీణ భారతం ఈ దుస్తితికి కారణం వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకోవడం ప్రధానం అని చెప్పాలి.భారత దేశం గ్రామాలలో జీవిస్తుందని గొప్పలు చెప్పుకోన్నాం జై కిసాన్ అన్నాము అలాంటి గ్రామీణ భారతం నేడు విద్వంసానికి గురై ఉపాది లేక లక్షల సంఖ్యలో పౌరులు పొట్ట చేతపట్టుకొని నగరాలకు,పట్టణాలకు వలస పోతున్నారు, స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 51 శాతం నుంచి 14 శాతానికి దిగజారింది.

ఆరుగాలం శ్రమించి గిట్టుబాటు ధరలేక పెట్టుబడులకు పెట్టుబడి లేక సగటున ఏడాదికి రెండువేల మంది రైతులు కాడీ,మెడీ వదిలేసి వేరే బతుకు తెరువు వెతుక్కొంటున్నారు.రైతుల కడగండ్లను ఏ మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం తో వారి వెతలు తీరే మార్గం లేక అభాగ్య సాగుదారులెందరో చావే శరణ్యం అంటున్నారు.జాతి ఆహార భద్రతకు వెన్నుదన్నుగా నిలిచే అన్నదాతలు లక్షల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పతున్నట్లు సమాచారం.

సంక్షోభంలో చిక్కిన వ్యవసాయాన్ని కోట్లాది రైతుల బతుకులు మార్చే సర్వ సమగ్ర కార్యాచరణ ప్రణాళికా నేటికీ లేదు. దేశం లో 76 ఏళ్లలో వ్యవసాయరంగంలో మనం ఎంత అభివృద్ది సాధించామో చెప్పడానికి అరగంటకోక అన్నదాత ఆత్మ హత్యే సాక్ష్యం.

వ్యవసాయ దేశంగా చెప్పుకొనే దేశంలో ఆహార వుత్పత్తులు పంప్పులు,వంటనూనెలు వంటివి దిగుమతి చేసుకోవాల్సిన దుస్తితి రావడం సాగుపట్ల చిన్న చూపే కారణం.ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చినవారు ప్రజల జీవితాలనుకబళిస్తున్నారు.

నీతి,నిజాయితీ,నిబద్దత,రాజనీతిజ్ఞత వున్ననాయకులను గుర్తించి ఎన్నికల్లో గెలిపించి చట్ట సభలకు పంపడంలో ఓటర్ల లో స్వార్ధం పెరిగిపోయి ఓట్లను అమ్ముకొంటున్నారు. పరాయి పాలన నుండి ఏ లక్ష్యాల కోసం పొరాడి స్వాతత్రo సాధించామో వాటికే ప్రమాద ఘటికలు మొగుతున్నాయి.

ఏ దేశ చరిత్రలోనైనా 76 ఏళ్లంటే తక్కువ సమయమేమీ కాదు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఉంటే ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, అసమానతలు వుండేవి కాదు. అర్ధరాత్రి ఆవిర్భవించిన స్వాతంత్య్రం భారీ అవినీతి పరిశ్రమను తెచ్చింది.

పేరు గొప్ప ప్రజాస్వామ్యం పేదవాళ్ళని మరింత పేదలనే చేసింది. ప్రజల పేరుతో సంపదను కూడబెట్టుకున్న వాళ్లెందరు? కూలీలుగా మారుతున్న వారెందరు? స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేళ్ల తర్వాత కూడా సందేహాస్పదంగా ఎన్నో ప్రశ్నలను తీర్చుకోవాల్సింది, తేల్చుకోవాల్సిందీ ప్రజలే.

కావునా ఒక్కడి వల్లే ఈ దేశం మారిపోతుందా అనుకునే ఏ ఒక్కరి వల్లా ఈ దేశానికి ఉపయోగం లేదని ఫైడల్‌ క్యాస్ట్రో అంటాడు.కావునా ఈ దేశాన్ని రక్షించాల్సింది ప్రజలే. దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సంసిద్ధం కావాల్సిందీ ప్రజలే.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవాల్సింది ప్రజలే. ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం మరో స్వాతoత్ర పోరాటానికి సిద్దం కావాలి ఏపీ ప్రజలు.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

 

LEAVE A RESPONSE