Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా మాట్లాడారా?

-ఏనాడైనా ఉభయ సభలను స్తంభింప చేశారా??
-పెద్దల సభలో న్యాయ వ్యవస్థ వ్యతిరేక వ్యాఖ్యలు దేనికి సంకేతం??
-క్రైస్తవ మత ప్రచారకులకే కాదు… అన్యమతస్తుల వారికి గౌరవ వేతనం ఇవ్వాలి
-ముఖ్యమంత్రి బొమ్మల పిచ్చి పిక్స్ కు చేరింది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ప్రత్యేక హోదా కోసం గత నాలుగుగేళ్ల ఏ ఒక్క నాడైనా మాట్లాడారా?, ఉభయ సభలను స్తంభింపజేసి నిరసన తెలియజేశారా? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డిని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఎంతసేపు మీ కేసుల కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకొని మాఫీ చేయించుకుని ప్రయత్నాలు చేశారే, తప్పితే ఏ ఒక్కనాడు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన పాపాన పోలేదన్నారు . ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టడానికి మళ్లీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని రాజ్యసభ వేదికగా విజయ్ సాయి రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో తమ పార్టీ సభ్యులు ప్ల కార్డులు పట్టుకొని, తనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మాత్రమే సభను స్తంభింపజేశరన్నారు. కానీ స్పీకర్, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించి తమ పార్టీ సభ్యులు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారని గుర్తు చేశారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. న్యాయస్థానాలు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర ఆక్షేపణి యమన్నారు. న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. శాసన వ్యవస్థ కూడా పరిధిలు దాటి మాట్లాడుతుందోని ఒకవేళ న్యాయమూర్తులు పేర్కొంటే పరిస్థితి ఏమిటని నిలదీశారు. అయినా రాజ్యసభలో తమ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి బరితెగింపు మాటలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు.

న్యాయమూర్తుల విచక్షణ అధికారంతోనే జగన్, విజయ సాయికి బెయిల్ మంజూరు
32 ఆర్థిక కేసుల్లో నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లకు న్యాయమూర్తులు తమ విచక్షణాధికారంతోనే బెయిల్ మంజూరు చేశారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ప్రజల మధ్య తిరగడానికి, ప్రజల చేత ఎన్నుకోవడానికి అవకాశం కల్పించిన న్యాయ వ్యవస్థ గురించి ఇంత అన్యాయంగా మాట్లాడడం ఒక్క విజయసాయి రెడ్డికి చెల్లిందన్నారు. పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని విజయ సాయి రెడ్డి మాట్లాడడం దేనికి సంకేతమన్న డౌటానుమానాలొచ్చాయన్నారు. హైకోర్టు తప్పు చేసిందని, సుప్రీంకోర్టు అయినా సరిగ్గా వ్యవహరించాలని తన వ్యాఖ్యల ద్వారా విజయ సాయి హెచ్చరికలు చేశారా? అంటూ ప్రశ్నించారు.

గతంలో బిల్లు ప్రతిపాదించి… ఇప్పుడు రాష్ట్రానికే అధికారాల నడం విడ్డూరం
రాజధానుల ఏర్పాటు నిర్ణయాధికారం శాసనసభ కే ఉండే విధంగా చట్ట సవరణ చేయాలని కోరుతూ, గతంలో రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యాంగం లోని ఏవో ఆర్టికల్స్ ను ప్రస్తావిస్తూ, రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనిని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ రాష్ట్ర రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే, ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలన్నారు. గతంలో చట్ట సవరణ కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించి, ఇప్పుడు న్యాయస్థానాలు తప్పు చేశాయనడం సరికాదని పేర్కొన్నారు. న్యాయస్థానాల వ్యవహారాలలో జోక్యం సరికాదు. గతంలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను చర్చించడానికి వేదిక అయిన రాజ్యసభలో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నిందించడం విస్మయాన్ని కలిగించింది . మీరు చెప్పినట్లు నడుచుకుంటే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన పరిధిలో ఉన్నట్లు?, లేకపోతే లేనట్టా?, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగం తెలియదా?, ఏమిటి బరితెగింపు అంటూ విజయ సాయిని ఉద్దేశించి రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారన్న అక్రోషమో, లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై కోపమో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు.
గతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తరువాత నాలిక కరుచుకున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అవమానపరిచేలా మాట్లాడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నాన్ని చేస్తానన్నారు.

తమ తాతలు తండ్రులు కొనుగోలు చేసిన ఆస్తులపై జగన్ బొమ్మలెందుకు?
తమ తాతలు, తండ్రులు కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మలెందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. ఇంకా నయం జగన్ తన భార్యా పిల్లలకు ఫోటోలను కూడా తమ ఆస్తిపత్రాలపై ముద్రించడం లేదంటూ అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం మారాక, జగన్ ప్రభుత్వం జారీ చేస్తున్న పాస్ పుస్తకాలను ఓ మూలన పడేయడం ఖాయం. ప్రజల ఆస్తి పత్రాలపై యజమానుల ఫోటోలే ఉంటాయని విశ్వసిస్తున్న.. ప్రజల ఆస్తి పత్రాలపై ముఖ్యమంత్రి తన ఫోటో, తన తండ్రి ఫోటో ముద్రించడాన్ని గమనించి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు. జగనన్న ఇంటింటికి స్టిక్కర్ పథకం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ స్టిక్కర్ పథకాన్ని వ్యతిరేకిస్తారో, వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. అలాగే పింఛన్ సొమ్మును చెల్లిస్తున్నప్పుడు, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కే ఓటు వేస్తామని ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఫ్లెక్సీలో డిజిపి ఫోటో తొలగింపు…
మాదకద్రవ్యాల సేవనం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ స్కూళ్లు, కాలేజీ ల వద్ద ముఖ్యమంత్రి ఫొటోతో పాటు, రాష్ట్ర డిజిపి ఫోటోతో కూడిన ఫ్లెక్సీలను ప్రచార నిమిత్తం ఇటీవల ఏర్పాటు చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే ఆ ఫ్లెక్సీ ల నుంచి డీజీపీ ఫోటో మాయమయ్యింది. కేవలం తన ఫోటోతో మాత్రమే జిల్లాకు 5000 చొప్పున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు కానుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వ్యాపారస్తుల వద్ద నుంచి విరాళాలు సేకరించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖను ఆదేశించారని రఘురామకృష్ణం రాజు వివరించారు. ఫ్లెక్సీలను ఏదైనా వ్యాపార సంస్థ ఏర్పాటుచేసిన, తమ ప్రచార నిమిత్తం వారి వివరాలను పొందుపరచడానికి వీల్లేదని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉంది.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోసం తన ఫోటోతో కూడిన ఫ్లెక్సీ ప్రచారాన్ని కోరుకుంటున్నట్లుగానే, విరాళాలు ఇచ్చే వ్యాపార సంస్థలు కూడా తమ ప్రచారానికి ఫ్లెక్సీలను ఉపయోగించుకోవాలని చూడడం సర్వసాధారణం. కేవలం తన ఫోటోలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఒక మానసిక రుగ్మత అని తెల్సింది. నార్సి సిస్టెక్ అనే మానసిక వ్యాధితో బాధపడే వారు… తమకే అధిక ప్రచారం లభించాలని, ఇతరులంతా తమని ప్రత్యేకంగా గుర్తించాలని, ఎవరైనా తమని విమర్శిస్తే తిరుగబడుతారని గూగుల్ లో అన్వేషిస్తే తెలిసిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రచార ప్రకటన జారీ చేస్తే ప్రధానమంత్రి తో పాటు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఫోటోను కూడా పొందుపరుస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రచార ప్రకటనలో కేవలం ముఖ్యమంత్రి చిక్కటి చిరునవ్వు తో కూడిన ఫోటోను ముద్రిస్తారని ఎద్దేవా చేశారు. రేపు పొద్దున ఇది మరింత ముదిరితే జగనన్న పచ్చబొట్టు పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి, ఇళ్లపై ముఖ్యమంత్రి తన బొమ్మలను ముద్రించాలని నిర్ణయించగా లేనిది, ప్రజల ఒంటి పైన కూడా పచ్చబొట్టును ఎందుకు వేయరని ప్రశ్నించారు. ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటే, అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తామని చెప్పి పొడిపించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నా రని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. సొంత బొమ్మల పిచ్చిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిదని హితవు పలికారు.

జీతాలు మరింత ఆలస్యం…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఇప్పటివరకు సింహభాగం వారికి జీతాలు అందలేదని తెలిసిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. జీతాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పు రత్న అని పేరు పెట్టారని గుర్తు చేశారు. అయితే చందోబద్ధంగా రుణ రత్న అని పేరు పెడితే బాగుంటుందని సూచించారు. ఇక ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉడతా భక్తిగా రణ రత్న అనే బిరుదును ప్రధానం చేస్తున్నట్లు వెల్లడించారు.

రాజ్యాంగంలో ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించవద్దు స్పష్టంగా పేర్కొనడం జరిగిందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. అయినా, జగన్ ప్రభుత్వం చర్చి పాస్టర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందజేయాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పాస్టర్లకు గౌరవ వేతనం అందజేయడానికి అన్ని నియమ నిబంధనలను సడలించారని, అదేవిధంగా నిరుపేదలకు, వృద్ధులకు, వితంతువుల పింఛన్ల మంజూరీలోనూ వెసులుబాటు కల్పించాలి.. గ్రామ సచివాలయ ఉద్యోగి అయినా అతని కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరీలో ఎన్నో షరతులు విధిస్తున్నారు. నిరుపేదల పట్ల ఈ వివక్ష మంచిది కాదు. ఈ వివక్ష కక్షగా మారి, మన ప్రభుత్వానికి శిక్ష వేసే ప్రమాదం లేకపోలేదని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

LEAVE A RESPONSE