Suryaa.co.in

Editorial

పాదయాత్రలపై ‘దివాకరా’స్త్రం

– పాదయాత్రలు పనికిరావని వ్యాఖ్య
– జనం పట్టించుకోరని స్పష్టీకరణ
– అవన్నీ ఖరీదైన యాత్రలని విశ్లేషణ
– లోకేష్‌ పాదయాత్ర నేపథ్యంలో జెసి వ్యాఖ్యలపై టీడీపీలో ఇరకాటం
– తమ్ముళ్లను నిరాశ పరిచిన జెసి వ్యాఖ్యలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

జెసి దివాకర్‌రెడ్డి. ఏపీలో సీనియర్‌ రాజకీయ నాయకుడాయన.టీడీపీ అగ్రనేల్లో ఒకరు. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. సొంత పార్టీ అయినా.. పరాయి పార్టీ అయినా, తాను అనుకున్నది ముఖం మీదనే చెప్పేస్తారు. వారు ఏమనుకుంటారనేది ఆయన పట్టించుకోరు. మళ్లీ మరుసటి రోజు వారు కనిపిస్తే, ఆప్యాయంగా మాట్లాడతారు. అందుకే ఆయన ఏం మాట్లాడినా హాట్‌ హాట్‌గా ఉంటుంది.

ఇప్పుడూ అంతే. పాదయాత్రలపై జెసి చేసిన కామెంట్లు, తన పార్టీ యువనేత లోకేష్‌కు సైతం తగిలేలా తాకాయి. తెలుగురాష్ర్టాల్లో నేతలు చేస్తున్న పాదయాత్రలపై, జెసి తనదైన శైలిలో చేసిన కామెంట్లు, తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లోకేష్‌ పాదయాత్ర ఉత్సాహంపై నీళ్లు చల్లేలా ఆయన వ్యాఖ్యలు ఉండటమే దానికి కారణం.

ప్రత్యేకించి లోకేష్‌ పేరు ప్రస్తావించకుండా, జనాంతికంగా మాట్లాడినప్పటికీ.. పాదయాత్రల వల్ల ఫలితం ఏమీ లేదని దివాకర్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. అసలు పాదయాత్రలను జనం పట్టించుకోవడం లేదని మరో బాణం సంధించారు. ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రలన్నీ డబ్బులతో కూడుకున్నవని, ఒకప్పటి మాదిరిగా కావని అసలు విషయం తేల్చేశారు. అసలు ఇప్పటి పరిస్థితిలో ఎవరు పాదయాత్రలు చేసినా లాభం లేదని తేల్చిపారేశారు.

యువగళం పేరుతో టీడీపీ యువనేత లోకేష్‌, నాలుగువేల కిలోమీటర్ల లక్ష్యంతో పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభించారు. దానికోసం బోలెడంత కసరత్తు చేశారు. ప్రత్యేక యంత్రాగం సమకూర్చుకున్నారు. ఇప్పటికి చిత్తూరు జిల్లాలో రెండు, మూడు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగిసింది. లోకేష్‌ పాదయాత్రకు అనుమతులు లేవన్న కారణంగా, పోలీసులు ఎక్కడికక్కడ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు వివాదంగా మారాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత అయిన జెసి దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు, టీడీపీని ఇరుకున పెట్టాయి. అంతేకాదు. పాదయాత్ర పేరుతో ప్రజలకు చేరవయిపోదామన్న లోకేష్‌ లక్ష్యాన్ని, నీరసం కలిగించేలా జెసి వ్యాఖ్యలు ఉండటం, పార్టీ శ్రేణులను నిరాశపరిచాయి. పాదయాత్రల వల్ల ఉపయోగం లేదు. ప్రజలు వాటిని పట్టించుకోరన్న జెసి వ్యాఖ్యలు, పార్టీ శ్రేణులను దాదాపు కుంగదీసినంత పనిచేశాయి.

ఫలితంగా ఎన్నిరోజులు పాదయాత్ర చేసినా ప్రయోజనం లేకపోయేదానికి, ఆరోగ్యం-వనరులు పణంగా పెట్టి, అంత కష్టడటం ఎందుకన్న అంతర్మథనం మొదలయింది. పైగా ఒకరోజు పాదయాత్రకు పార్టీ క్యాడర్‌ దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

లోకేష్‌ పాదయాత్ర ఖర్చును స్థానిక నాయకులు, నియోజకవర్గ ప్రముఖులే భరిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర వల్ల, పార్టీకి ప్రయోజనం లేదన్న జెసి వ్యాఖ్యలు తమ్ముళ్లను పూర్తి స్థాయిలో నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ యువనే లోకేష్‌, తెలంగాణలో షర్మిల మాత్రమే పాదయాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE