అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలపై దాఖలపై ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.వంశీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీబ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో గనుల అక్రమ తవ్వకాలు, చిన్న తరహా ఖనిజాల వెలికితీయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు వ్యాపారులు అన్నె లక్ష్మణరావు, ఓలుపల్లి మోహన రంగారావు, కె.శేషుకుమార్ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారి నుంచి జరిమానా, సీనరేజి రుసుం వసూలు చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ ఈ వాజ్యాన్ని దాఖలు చేశారు.