– ఒక పరిశీలన
ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు. ప్రభుత్వాలు ఈ హక్కును గుర్తించాలి. ఆయా దేశాల స్థూల జాతీయోత్ఫత్తి(జిడిపి)లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, నిధులను వ్యయం చేయాలి. తదనుగుణంగా వార్షిక బడ్జెట్స్ లో నిధులను కేటాయించి, విడుదల చేసి, ఖర్చు చేయాలి.
వైద్య కళాశాలకు, ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలను కల్పించాలి. నిపుణులైన వైద్యులను తయారు చేసుకోవాలి. మెరుగైన వైద్యాన్ని పౌరులకు అందించాలి. పౌరుల ఆరోగ్యంపై స్థూల జాతీయోత్ఫత్తి, సమాజ ప్రగతి ఆధారపడి ఉంటుంది.
మన దేశంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న నిధులను పరిశీలిస్తే పరిస్థితి బోధపడుతుంది. పార్లమెంట్లో సమర్పించిన 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం, ఆరోగ్య సంరక్షణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ వ్యయం 2023 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 2.1% మాత్రమే.
దాదాపు 3.47 ట్రిలియన్ డాలర్ల జిడిపి అంచనాతో ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించిందని, 143 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మొదటి స్థానంలోకి ఎదిగామని గొప్పగా చెప్పుకుంటున్నాం. మంచిదే! మరి, ఆరోగ్య సంరక్షణ, ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, మానవాభివృద్ధిలో మన స్థానమెక్కడో వాస్తవిక దృష్టితో ఆలోచించాలి.
ఒకనాడు నిపుణులైన వైద్యులను ప్రపంచానికి అందించిన రాష్ట్రం మనది. కానీ, నేడు వైద్య కళాశాలలోను, ఆసుపత్రులలోను మౌలిక సదుపాయాలు నాసిరకంగా ఉన్నాయి. వైద్య విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. బోధనాసుపత్రుల్లోనే ఎలుకలు, పందికొక్కులు, పాములు సంచరిస్తున్న ఉదంతాలు, బెడ్స్ కొరత వల్ల రోగులను కారిడార్స్ లో నేలపై పడుకోబెట్టడం లేదా ఒక్కొక్క బెడ్ పై ఇద్దర్ని, ముగ్గుర్ని కూర్చోబెట్టడం వంటి ఉదంతాలు కోకొల్లలుగా వింటూనే ఉన్నాం.
ఆసుపత్రుల లోపల మరియు ఆవరణల్లో అపరిశుభ్రత, ఆసుపత్రుల పరిసరాల్లోని మురికి కాలువలు దుర్గంధంతో నుండి ఉంటున్నాం చూస్తూనే ఉన్నాం. దోమల బెడద, వాటి ద్వారా రోగాల వ్యాప్తి, వాటి దుష్ఫలితాలను ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన పథకం అమలు ద్వారా పౌరుల ప్రాథమిక ఆరోగ్య హక్కు పరిరక్షించబడుతున్నదా!
ఈ అనుభవాల నేపథ్యంలో యు.కె.లోని వైద్య, ఆరోగ్య వ్యవస్థను పరిశీలించాను. 2018లో యు.కె. పర్యటించినప్పుడు లివర్ పూల్ లో డా.ఎస్.పి. మరియు వారి సతీమణి డా.లలిత(మా ప్రశాంతి క్లాస్ మేట్) గార్ల నిర్వహణలో ఉన్న జి.పి.ని మా డాక్టరమ్మతో కలిసి సందర్శించాను. జి.పి. అంటే మన వ్యవస్థలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి.).
ఈ పర్యటనలో కోవెంట్రీలోని యూనివర్సిటీ హాస్పిటల్ అంటే మన వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి లాంటిదాన్ని సందర్శించాను. ఆ ఆసుపత్రిలో పని చేసిన డా.జి. లక్ష్మీనారాయణగారు, మా డాక్టరమ్మకు గుంటూరు మెడికల్ కాలేజీలో క్లాస్ మేట్. ఆయన మమ్మల్ని వెంట తీసుకెళ్ళి, కోవెంట్రీ యూనివర్సిటీ హాస్పిటల్ ను చూపెట్టారు.
నాతో పాటు మా ప్రశాంతి కూడా ఉన్నది. ఆమె ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ యాజమాన్యంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నది. అందువల్ల ప్రత్యేక ఆసక్తితో ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలను, విభాగాల వారి పని తీరును, వైద్యుల పని సంస్కృతిని, వైద్య పరీక్షలు, చికిత్సా విధానం, డాక్టర్స్ – పేషంట్స్ సంబంధాలు, ప్రతి రోగి యొక్క ఆరోగ్య రికార్డ్ ను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి – ఆ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో ఉన్న జి.పి.కి బదలాయించడం ద్వారా సమన్వయం చేసుకోవడం, ఆసుపత్రిలో పని చేసే వైద్యులకు మరియు చికిత్స కోసం వచ్చే రోగులకు అవసరమైన వందల కార్లు పెట్టడానికి వీలుగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు, వివిధ కోణాల్లో సమాచారాన్ని డా.జి. లక్ష్మీనారాయణగారు తెలియజేశారు.
2006లో ఈ హాస్పిటల్ ప్రారంభించబడిందని, ప్రస్తుతం 1,500 పడకలు, 26 ఆపరేషన్ థియేటర్లు మరియు అత్యాధునిక పరికరాలతో యు.కె.లోని అత్యంత ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఒకటని, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నదని చెప్పారు.
“నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్” పథకం ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంగా, సమర్థవంతంగా అమలులో ఉన్నదని చెప్పారు. మేము ఆసక్తి కనబరిచిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. మాతో పాటు డా.జి. లక్ష్మీనారాయణగారి సతీమణి శ్రీమతి పుష్పాగారు ఉన్నారు. ఆసుపత్రి పనితీరుకు సంబంధించి ఆమెకున్న అనుభవాలను మాతో పంచుకున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన తర్వాత స్థానంలోకి యునైటెడ్ కింగ్డమ్ నెట్టబడింది. 2023లో 3.2 ట్రిలియన్ల డాలర్ల జిడిపి అంచనాతో, 6.5 కోట్ల జనాభాతో ఆరవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. కానీ, యు.కె.లో హెల్త్‌కేర్ వ్యయం 2022లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 11.3%గా గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఫలితంగానే ఆరోగ్య సంరక్షణలో మెరుగైన స్థానంలో ఉన్నది. అయినప్పటికీ, యు.కె. ఆరోగ్య వ్యవస్థ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసినప్పుడు ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడిందని, డాక్టర్లు, నర్సుల కొరత పర్యవసానంగా పేషంట్స్ ఆరోగ్య పరీక్షల కోసం వేచి ఉండాల్సి వస్తున్నదన్న విమర్శలు ఎదర్కొంటోంది.
కోవెంట్రీ యూనివర్సిటీ హాస్పిటల్ సందర్శన చాలా సంతృప్తి కలిగించింది. దీనికి తోడు గతంలో లివర్ పూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైన జి.పి. సందర్శన మూలంగా యు.కె.లోని ఆరోగ్య వ్యవస్థ పట్ల స్థూలమైన అవగాహన కలగడానికి మాకు ఎంతగానో ఉపకరించింది.
