Suryaa.co.in

Telangana

వైద్య మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే

-వైద్యశాఖ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాల్సిందే
-నెలనెలా మూటలిస్తున్నారనే వాళ్లను వెనుకేసుకొస్తున్న సీఎం
-దేశంలో ఎక్కడ ఏ అవినీతి బయటపడ్డా, ఈడీ దాడులు జరిగినా కేసీఆర్ కొడుకు, బిడ్డ పాత్ర
-కుటుంబ సభ్యుల అక్రమ సంపాదనను చూసి నివ్వెరపోతున్న కేసీఆర్
-దారి మళ్లించడానికే ఫ్రీ పవర్, దేశ రాజకీయాలంటూ కేసీఆర్ డ్రామాలు
-కూట్లో రాయి తీయలేనోడు… ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా ఉంది కేసీఆర్ యవ్వారం
-రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేనోడు.. దేశాన్ని ఏం ఉద్దరిస్తాడు?
-మోటార్లకు మీటర్లపై చర్చించేందుకు సిద్ధం..
-ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ ఫైర్

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో 4 గురు మహిళల మ్రుతికి వైద్యశాఖ మంత్రి, వైద్యశాఖ డైరెక్టర్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తక్షణమే వైద్య మంత్రిని బర్తరఫ్ చేయడంతోపాటు వైద్యశాఖ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వైద్యశాఖ నుండి నెలనెలా మూటలు వస్తున్నందునే వారిపై కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఎక్కడ ఈడీ దాడులు జరిగినా… అవినీతి, అక్రమాలు బయటపడ్డా కేసీఆర్ కొడుకు, బిడ్డల పాత్ర బయటపడుతోందన్నారు. వారిద్దరి అక్రమ సంపాదనను చూసి కేసీఆరే నివ్వెరపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు.. కొడుకు, బిడ్డ వ్యవహారంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే ఫ్రీ పవర్, దేశ రాజకీయాలంటూ కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధులు సంగప్ప, పాల్వాయి రజనీ, కట్టా సుధాకర్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా, రాష్ట్ర నాయకులు మాల్యాద్రిరెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. అందులోని ముఖ్యాంశాలు….

ప్రజా సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను దారి మళ్లించడానికి కేసీఆర్ అనేక కుట్రలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంవల్ల 4 గురు మరణించడం… 30 మంది తీవ్ర అస్వస్థతకు గురైనరు. దేశంలో ఇదో పెద్ద ఘటన. మాయని మచ్చ. ఇంతటి దారుణ ఘటన ఎక్కడా జరగలేదు.

కుటుంబ నియంత్రణ సర్జరీ బాధితులంతా కూలీనాలీ చేసుకునే పేదలే. వాళ్లను పరామర్శిస్తే బాధేస్తుంది. చిన్న పిల్లలున్నరు వాళ్లకు…కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు ఈ ఘటనకు బాధ్యుడైన హెల్త్ డైరెక్టర్ ను విచారణ అధికారిగా నియమిస్తారా?

హెల్త్ డైరెక్టర్ పై ఉన్నన్ని ఆరోపణలు ఎవరిపైనా లేవు. పోస్టింగులు, డిప్యూటేషన్లు, ప్రమోషన్ల సహా ఏ పని చేసినా ఆయనకు పైసలియ్యాల్సిందే. నెలనెలా మూటా ముల్లె సీఎం, మంత్రికి అప్పగిస్తుండు కాబట్టే కేసీఆర్ ద్రుష్టిలో ఆయన చాలా మంచోడు..ఆయననే విచారణ అధికారిగా వేసి అమాయకుడైన శ్రీధర్ ను బలి చేసిండ్రు. ఆ రోజు ఆయనకు డ్యూటీ వేయలేదు.

ఇంకా దుర్మార్గమేందంటే సర్జరీ జరిగిన రోజు వైద్యశాఖ అధికారులంతా కలెక్టర్ ప్రారంభోత్సవం ఉందని అక్కడికి వెళ్లిపోయారు. సర్జీరీ క్యాంపులో ఒక్క మహిళా డాక్టర్ కూడా లేరు. బాధితులకు కనీసం పరీక్షలు చేయలేదు. కింద వరుసగా పండబెట్టి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. గంటలోపు 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారా? ఎంత దారుణం. కనీసం ఒక్క మంత్రి కూడా స్పందించరా? హెల్త్ డైరెక్టర్ పోయి ఇంట్లో పడుకుంటారా? కనీసం ఆ కుటుంబాలను కలిసే ప్రయత్నం కూడా చేయలే..

అందరూ పేదోళ్లే కదా.. చస్తే ఏమైతది… రూ.5 లక్షలిస్తాం కదా..అనే చులకన భావం. కేసీఆర్ పాలనలో పేదోళ్ల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. వీటన్నింటికీ సంబంధిత మంత్రి, హెల్త్ డైరెక్టర్ బాధ్యులు. అయినా వీళ్లు మూటాముల్లె ఇచ్చేవాళ్లు కాబట్టి చర్యల్లేవు. పైగా ఆయనను రేపోమాపో ఎమ్మెల్సీ చేస్తాడేమో… ఆ నమ్మకం వాళ్లకు ఏర్పడ్డది. వైద్య మంత్రి అల్లుడు కాబట్టే కాపాడే యత్నం చేస్తవా? కేసీఆర్ పాలనలో పేదోళ్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటేనే హడలిపోయే దుస్థితి.

కేసీఆర్ కు పేదోళ్ల ప్రాణాలు ముఖ్యమనుకుంటే తక్షణమే వైద్యశాఖ మంత్రిని బర్త్ రఫ్ చేయాలి… హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి. బాధిత కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి. ఇండ్లు లేక టెంట్ల కింద ఖర్మకాండలు చేసుకునే దుస్థితి ఉన్న పేదలకు ఇండ్లు కట్టియ్యాలే. నిన్న వర్దన్నపేట గురుకుల హాస్టళ్లలో 60 మంది అస్వస్థత. సిద్దిపేట, మహబూబాబాద్, ఇబ్రహీంపట్నం, ట్రిపుల్ ఐటీల్లోనూ ఇదే దుస్థితి. ప్రభుత్వ హాస్టళ్ల మీద ఆజమాయిషీ లేదు. చాక్ పీస్, డస్టర్లు లేవు. స్కావెంజర్లు లేవు.. సౌకర్యాల గురించి అడిగితే టీచర్లను అరెస్ట్ చేస్తున్నరు.

దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా… ఎక్కడ ఈడీ దాడులు జరిగినా కేసీఆర్ కొడుకు, బిడ్డ హస్తమే బయటపడుతోంది. ఈడీ దాడులు జరిగినా వారి ప్రమేయమే కన్పిస్తోంది. చివరకు సీఎం భయపడుతున్నరు. యాడ చూసినా కొడుకు, బిడ్డ, షడ్డకుడి కొడుకే. తలకాయ పట్టుకుంటున్నడు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదామంటే.. ఈ తలనొప్పులెక్కువై సతమతమవుతున్నడు.

కొడుకు, బిడ్డ అక్రమ సంపాదనను చూసి కేసీఆర్ నివ్వెర పోతున్నడు. వీటిపై చర్చను దారి మళ్లించేందుకు బహిరంగ సభలు పెట్టి దేశమంతా ఫ్రీ కరెంట్ అని వాగుతున్నడు. కేసీఆర్ నిర్వాకంవల్ల 70 వేల కోట్ల నష్టాలు డిస్కంలకు వచ్చినయ్. మోటార్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇండ్లపై కరెంట్ ఛార్జీలు పెంచి వేల కోట్లు దోచుకుంటున్నవ్. ఎన్నికలు రాంగనే మోటార్లకు మీటర్లు గుర్తుకొస్తయ్… మోదీని బదనాం చేసే కుట్ర… బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రకు కేసీఆర్ తెరదీసిండు. అదే జరిగితే కేసీఆర్ కే మీటర్ పెడతాం..

రైతు సంఘాల పేరుతో కొత్త డ్రామా… మంది కొంపలు ముంచడానికి కేసీఆర్ స్ర్కీన్ ప్లే, డైరెక్షన్… స్పెషల్ ఫ్లైట్ పంపితే కూడా ఎవరూ రాలే… ఢిల్లీలో వడ్ల కొనుగోలు ధర్నా చేస్తే ఒక్కడూ రాలే.. రైతు సంఘాల నాయకులను మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల వద్దకు తీసుకుపో… కాళేశ్వరం పంపులు మునిగిచోటుకు తీసుకుపో.. రైతుల వద్దకు తీసుకుపో.. అప్పుడు నీ సంగతి తెలుస్తది. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడు. తెలంగాణలో చెల్లని రూపాయిగా మారిన కేసీఆర్… దేశాన్ని మారుస్తాడట.

ఇతర రాష్ట్రాల్లో ఎవరూ కేసీఆర్ ను పట్టించుకోవడం లేదు. బీజేపీ ముక్త్ భారత్ అంటే పక్కనున్న నితీష్ కుమార్ లేచి వెళ్లిపోయిండు. తెలంగాణలో ఫ్రీ కరెంట్ ఇస్తున్నా.. పైసలు కట్టడం లేదు.. ఇక్కడ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు.. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నా.. జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదు. ఇవన్నీ చెప్పుకో… ఇబ్రహీంపట్నం ఘటన, ఈడీ దాడులు, నోటిఫికేషన్ల జాప్యంపై దారి మళ్ల్లించేందుకే కేసీఆర్ దేశ రాజకీయాల పేరుతో కొత్త డ్రామా.

కేసీఆర్ .. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచినవో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఆ తరువాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. అవసరమైతే అంతర్జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా మాకు అభ్యంతరం లేదు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చేస్తున్న రకరకత కుట్రలివి. కేసీఆర్ ఏం చేసినా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి.

మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ…
ఈడీ దాడులపై…. వాళ్ల పని వాళ్లు చేస్తరు. దానిమీద మాకు సమాచారం లేదు. వాళ్లకు ఆధారాలుంటే ఎవరిపైనైనా ఈడీ దాడులు చేయొచ్చు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం లేనే లేదు. ఉంటే ప్రజా సమస్యలపై చర్చించే వాళ్లు కదా… కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి పోతేనే పట్టించుకోని పార్టీ కాంగ్రెస్. టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలు. వాళ్లంతా డ్రామా ఆర్టిస్టులు. మునుగోడులో బీజేపీని ఓడించడానికి చేస్తున్న కుట్రలివి. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టును ఖండిస్తున్న. సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తే టీచర్లను అరెస్ట్ చేస్తున్నరు. మోటార్లకు మీటర్లపై చర్చకు సిద్ధం. మునుగోడుకు ఈనెల 11న పర్యటించాలని యోచిస్తున్నాం. మేం గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. నిత్యం కొంప ముంచే రాజకీయాలే తప్ప కేసీఆర్ కు ఇంకేమీ పట్టవు.

LEAVE A RESPONSE