– ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం సీఎంవో అధికారులతో మాట్లాడారు.
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెర్వులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.