పెడన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలను వై.ఎస్.ఆర్.సి.పి. నేతలు భయానకంగా అణచి వేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వాల్ పోస్టర్ ద్వారా ఎత్తి చూపినందుకు ముగ్గురు యువకులపై దాడి చేయడమే కాకుండా రక్షణ కోసం పోలీస్ స్టేషన్లోకి వెళితే సాక్షాత్తు పోలీసుల ఎదురుగా పోలీస్ స్టేషన్లోనే వారిని విచక్షణారహితంగా కొట్టడం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో అవగతమవుతోంది. కొట్టిన వారంతా స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులే కావడం గమనార్హం.
బాధితులలో ఒకరు ఎస్.సి. వర్గానికి, మరొకరు ముస్లిం వర్గానికి, ఒక యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు తమ కుటుంబాలతో నన్ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిశారు. అధికార బలంతో తమ కుటుంబాలను ఎలా వేధిస్తున్నారో వారు వివరించారు. ఎక్కడో ఎవరో వై.సి.పి.నాయకుని కటౌట్ కు నిప్పు పెడితే అది కూడా వీరిపై మోపి అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇళ్లకు వెళ్లి మహిళలను సైతం బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు, దాడులు ఇలాగే కొనసాగితే న్యాయం కోసం పెడనలో రోడ్డు ఎక్కుతామని, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇటువంటి వికృత చర్యలు ఆపడానికి పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.