ఇది విజయనగరానికి తగునా..

కళలకు కాణాచి..
మహా మహా కళాకారులకు.
గొప్ప గొప్ప రచయితలకు
పుట్టినిల్లు..
ఆతిధేయ ధర్మానికి పట్టుగొమ్మ..

ఇన్ని..ఇలాంటి మరిన్ని విశిష్టతలకు పెట్టింది పేరైన విజయనగరంలో గత కొద్ది రోజులుగా ఒక చర్చ జరుగుతోంది..ఇప్పుడది చర్చను మించి వాదులాట స్థాయికి చేరింది..ఈ చర్చలో ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అనే విషయాన్ని పక్కనబెడితే మ్యాటర్ డిసైడ్ అయిపోయాక ఇంత చర్చ..
మొహమాటం లేకుండా చెప్పాలంటే ఇంతటి రచ్చ జరగడం అవసరమా.. అన్నది ఇక్కడ ప్రస్తావనార్హం..!

ఇక అసలు విషయానికి వస్తే నగరంలోని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆ మహాకవి పేరిట ఇచ్చే పురస్కారాన్ని ఈసారి విశిష్ట ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత ఓ రెండ్రోజుల పాటు పరిస్థితి మామూలుగానే ఉంది. ఎవరో ఒక్కరు గొంతు విప్పారు.. చాందసభావాలకు.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన రచనలతో పోరాడిన గురజాడ వంటి వ్యక్తి పేరిట ఏర్పరచిన పురస్కారాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక భావాలను.. పురాణకాలం నాటి సంప్రదాయాలను ప్రచారం చేసే చాగంటికి ఎలా ఇస్తారన్న వాదనకు శ్రీకారం జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది.

ఈ వాదనల్లో తప్పొప్పులు ఎంచడం సరికాదు.. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత రెండు వర్గాల మాటలూ కొంతమేర సమంజసంగానే ఉన్నాయేమో అనిపిస్తోంది.. వాటిని క్రోడీకరిస్తూ ఓ విశ్లేషణ..!

గురజాడ సమాఖ్య ఇప్పటికే ఈ పురస్కారాన్ని ఇరవై మందికి అందజేసింది.. వారిలో అత్యధికులు సినిమా రంగానికి చెందిన వారే.. ఆ పురస్కార గ్రహీతల పేర్లు ఇక్కడ ఉటంకించడం..వారు ఆ పురస్కారానికి అర్హులా కాదా అన్న చర్చ ఇక్కడ అనవసరం..అది చేస్తే ఆయా వ్యక్తులను అవమానించడమే అవుతుంది…! అయితే ఇంతవరకు గురజాడ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తులంతా ఆయన భావజాలంతో నడిచిన వారేనా.. అసలు సినిమా వాళ్లకి..గురజాడకు ఏమిటి సంబంధం.అలాంటప్పుడు సినిమా వ్యక్తులకు గురజాడ పురస్కారం ఇచ్చినప్పుడు జరగని వాదనలు ఇప్పుడెందుకు జరుగుతున్నట్టు..!?

ఇక్కడ మరో విషయం..
ఒక వ్యక్తి పేరిట ఇచ్చే అవార్డు లేదా పురస్కారం అచ్చంగా అలాంటి వ్యక్తి..లేదా అదే భావజాలాలు ఉన్న వ్యక్తికే ఇవ్వాలంటే చాలా అవార్డులు ఒకరిద్దరికి అందజేసిన తర్వాత ఇక ఆపేయాల్సిందే..ఎన్టీఆర్ పేరిట స్థాపించిన అవార్డును అక్కినేనికి ఇచ్చిన తర్వాత ఇక ఇవ్వడం మానెయ్యాలి..
గాంధీ మహాత్ముని పేరిట అవార్డు ఎవరికైనా ఇవ్వగలుగుతారా.. ఘంటసాల అవార్డు అందుకునే స్థాయి ఎవరికి ఉంటుంది..అలాగే గురజాడ పురస్కారం అందుకునే స్దాయి సినిమా వాళ్లకి ఉంటుందా..!
అయినా..గురజాడ నాస్తికుడనే ప్రచారం గతంలో పెద్దగా జరిగినట్టు లేదే..ఒకవేళ అయినా ఇప్పటివరకు ఆ పురస్కారం అందుకున్న వ్యక్తులంతా నాస్తికులేనా…అసలు ఆ పురస్కారం స్థాపించిన సంస్థ ప్రతినిధుల్లో ఎందరికి గురజాడ రచనలపై అవగాహన ఉంటుంది చెప్పండి..!
మరో విషయం..గురజాడ పేర ఏర్పాటు చేసిన పురస్కారం అందజేయడానికి నిర్వాహకులు ఆహ్వానించే వ్యక్తుల్లో ఎందరికి గురజాడ గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది ..వచ్చే వ్యక్తులు సాధారణంగా రాజకీయ నాయకులే..అంటే మంత్రులు..ఎమ్మేల్యేలు.. ఎంపిలు.. వారు ఎంత మాటాడగలరో..ఏం మాటాడతారో మనకు తెలిసిందే..!ఇలా పురస్కారాలు..వాటి ప్రదానోత్సవాలు..ఇక్కడనే కాదు..ఎక్కడైనా గాని మొక్కుబడి తంతుగానే మిగిలిపోతున్నాయి..! అలాంటి పోకడల గురించి ఎవరూ మాట్లాడరు..
రాజకీయ నాయకులు ఎందుకు..మంచి రచయితల్ని పిలవాలి గాని..అనే సాహసం ఎవరూ చెయ్యరు..!
భావజాలాల అంశాన్ని మరోసారి ప్రస్తావించుకుంటే ఒక రచయిత తన భావాలను రచనల్లో స్పష్టంగా ఆవిష్కరిస్తాడనేది నూటికి నూరు పాళ్ళు నిజమే అయినా ఆ వ్యక్తి జీవితం మొత్తం వాటిని అనుసరించే నడిచిందా అంటే ప్రశ్నార్థకమే..

అందరినీ ఒకే గాటన కట్టలేము కాని ఎన్నో విప్లవ గేయాలను రచించిన మహాకవి శ్రీశ్రీ కొన్ని భక్తి గీతాలు కూడా రాసిన విషయాన్ని మర్చిపోకూడదు.. అది ఆయన వృత్తి ధర్మం.. అలాగే పూర్తిగా భక్తి మార్గంలో నడచిన కవులు కొన్ని ఇతర పోకడలకు సంబంధించిన రచనలు కూడా చేశారు..కాలమాన పరిస్థితులను అనుసరించి ఇవన్నీ అనివార్యం..!
ఇప్పుడిక ముఖ్యమైన ఆతిధేయ ధర్మం విషయానికి వస్తే..భావజాలాల విషయాన్ని పక్కనబెడితే..
చాగంటి కోటేశ్వరరావు నిస్సందేహంగా విలక్షణ వ్యక్తి. వివాదరహితుడు.
ప్రవచనాలు చెప్పేందుకు రూపాయి కూడా తీసుకోని నిబద్దుడు..ఇప్పుడు గురజాడ పురస్కారాన్ని అందుకోడానికి నిర్వాహకులు తనకు ప్రయాణం ఖర్చులు కూడా ఇవ్వాల్సిన పనిలేదని..తన ఖర్చుతోనే వచ్చి వెళ్తానని చెప్పిన నిరాడంబరుడు..
గొప్ప వ్యక్తిత్వం కలిగిన విశిష్ట వ్యక్తి..కోట్లాది మంది అభిమానించే మనిషి.. అలాంటి వ్యక్తి విజయనగరం వస్తున్నారంటే సందర్భం ఏదైనా గొప్ప సంగతి..ఆయనను అందరూ గౌరవించుకోవాల్సిందే.. మీదు మిక్కిలి ఆయన మన అతిధి..!
ఇప్పుడు చాగంటికి పురస్కారం అందజేస్తున్న సందర్భంలో జరుగుతున్న యాగీ ఖచ్చితంగా విజయనగరానికి అపఖ్యాతే…
విజయనగరానికి ఉన్న విశేష ప్రతిష్ట కారణంగా ఇక్కడ సన్మానం అనగానే ఎంతటి వ్యక్తులైనా గాని సంబరంగా ఒప్పుకుంటారు..ఇప్పుడు ఇంత రచ్చ జరగడం ఈ గొప్ప ప్రాంతానికి గౌరవమా..
గురజాడ వారికైనా ఇది మర్యాదా..భవిష్యత్తులో విజయనగరంలో సన్మానం ..పురస్కారం అంటే
ఆయా వ్యక్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితులు ఏర్పడవా..!

ఇప్పటికే ఈ రభస చాగంటి వారి దృష్టికి వెళ్లే ఉంటుంది. అది సముచితమా.. ఇదేనా మన ఆతిధేయ ధర్మం..ఇంతేనా మన గౌరవం..!?

సురేష్ కుమార్ ఇ