Suryaa.co.in

Andhra Pradesh

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం

– సీఎం జగన్ పై విశ్వాసం పెంచేలా మంత్రి కొడాలి నాని నిర్ణయాలు
గుడివాడ, సెప్టెంబర్ 17: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న పలు నిర్ణయాలు సీఎం జగన్మోహనరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల్లో మరింత విశ్వాసం పెంచుతున్నాయి. గత ఏప్రిల్ 8 వ తేదీన రాష్ట్రంలో 7 వేల 220 ఎంపీటీసీ స్థానాలు, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీనిలో భాగంగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు జడ్పీటీసీ పదవులను బీసీ వర్గాలకు కేటాయించారు. ఎంపీటీసీ సెగ్మెంట్స్ లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. గుడివాడ రూరల్ మండలంలో ఉన్న ఆరు సెగ్మెంట్లలో దొండపాడు సెగ్మెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమైంది. చిరిచింతల, చౌటపల్లి, మోటూరు, రామనపూడి, శరీగొల్వేపల్లి సెగ్మెంట్లకు గత ఏప్రిల్ తేదీన ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ అభ్యర్ధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గోళ్ళ రామకృష్ణ పోటీ చేశారు. ఎంపీపీ పదవిని ఓసీ జనరలకు కేటాయించడం జరిగింది. నందివాడ మండలంలో 11 సెగ్మెంట్లు ఉండగా రుద్రపాక, పోలుకొండ, దండిగానపూడి, తమిరిశ సెగ్మెంట్లు ఏకగ్రీవమయ్యాయి.
నందివాడ, జొన్నపాడు, పుట్టగుంట, అరిపిరాల, తుమ్మలపల్లి, కుదరవల్లి, ఇలపర్రు సెగ్మెంట్లకు ఎన్నికలను నిర్వహించారు. ఎంపీపీ పదవిని ఓసీ జనరల్ కు కేటాయించడం జరిగింది. జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కందుల పద్మావతి పోటీలో ఉన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఉన్న 15 సెగ్మెంట్లకు ఎన్నికలను నిర్వహించారు. డోకిపర్రు 1, 2, కవుతరం 1, 2, గుడ్లవల్లేరు 1, 2, వడ్లమన్నాడు, వెణుతురుమిల్లి, వేమవరం, కూరాడ, శరీదగ్గుమిల్లి, విన్నకోట, అంగలూరు, కల్వపూడి, పెంజెండ్ సెగ్మెంట్లో అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ అభ్యర్ధిగా ఉప్పాల హారిక పోటీలో ఉండగా, ఇక్కడి ఎంపీపీ పదవిని ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 19 వ తేదీ ఉదయం 8 గంటలకు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వీకేఆర్, వీఎన్బీ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహనరెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఇటువంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి చూపిన సామాజిక న్యాయమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇటీవల 47 కార్పోరేషన్లకు జరిగిన 481 మంది డైరెక్టర్ల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు, మహిళలకు 52 శాతం పదవులను కేటాయించారన్నారు. 56 బీసీ కార్పోరేషన్లు, 137 నామినేటెడ్ పదవులు, రాష్ట్రంలో జరిగిన కార్పోరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ చైర్మన్ల పదవులను సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానం ఓసీ జనరల్ మహిళకు కేటాయించినప్పటికీ బీసీ వర్గానికి చెందిన ఉప్పాల హారికను అభ్యర్ధిగా ఎంపిక చేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE