Suryaa.co.in

Andhra Pradesh

“హైర్ అండ్ పైర్” నీతి!

ఆంధ్రప్రదేశ్ డిజిపిపై బదిలీ వేటు పడింది, చర్చ నిర్వహిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని ఒక టివి ఛానల్ గెస్ట్ కో ఆర్డినేటర్ నిన్న ఫోన్ చేశారు. ఆ వార్త వచ్చిన వెనువెంటనే ఆ అంశంపై వ్యాఖ్యానించే ఆసక్తిలేక, సున్నితంగా తిరస్కరించా.

ఆ బదిలీ ఒక చర్చనీయాంశంగా మారింది. అవమానకరంగా బదిలీ చేశారని, వాడుకొని వదిలేశారని, రిటైర్మెంట్ వరకు కొనసాగించక పోవడం ద్వారా ఆ వ్యవస్థను చులకన చేయడమేనని, ఇలా చాలా మంది వ్యాఖ్యానించారు.

నిజమే! డిజిపి స్థానంలో ఉన్నవారు రిటైర్మెంట్ వరకు ఆ పోస్టులో కొనసాగితే ప్రోటోకాల్ ప్రకారం గౌరవ వందనంతో వీడ్కోలు లభించేది. కానీ, అంత వరకు మానసిక ఒత్తిడిని తట్టుకోవడం, న్యూనతా భావంతో అన్నింటికీ తలవంచి పనిచేయడం, కోర్టు మెట్లు ఎక్కడం దిగడం, రాజకీయ ప్రేరేపిత స్వామీజీల చుట్టూ ప్రదక్షణలు చేయడం, విమర్శలను ఎదుర్కోవడం, ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కంటే బదిలీ వల్ల విముక్తి లభించిందని బహుశా ఆ ఉన్నతాధికారి ఉపశమనం కలిగిందని భావిస్తూ కూడా ఉండవచ్చునేమో!

ఒక వ్యక్తి చేతుల్లో(ఎవరైనా సరే) అధికార కేంద్రీకరణ జరిగితే పాలన ఇలాగే ఉంటుందనడంలో సందేహమే లేదు. పైపెచ్చు నేడు సంస్కరణల యుగంలో ఉన్నాం. పాలకులు “హైర్ అండ్ పైర్” సూత్రాన్ని అమలు చేస్తున్నారు కదా! అదే నీతి అన్ని రంగాల్లోకి విస్తరించింది. నిన్న మొన్న అమలు చేశారు, నేడు – రేపు కూడా ఈ నీతి అమలు చేయబడుతుంది. రాజకీయ పార్టీల్లో, ప్రభుత్వాల్లో, ఉన్నతాధికారులు, మంత్రులు, సలహాదారులు, ఎవ్వరికీ మినహాయింపు ఉండదు సుమా!

ఈ తరహా పాలన ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేస్తుందా! కీడు చేస్తుందా! అన్న ఆలోచన ప్రజలు చేయాలి.

టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE