- ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో ఓటర్ల జాబితాలో అవకతవకలు చేశారు
- వైసీపీ పాలనలో శాంతిభద్రతలకు పూర్తి విఘాతం
- గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు స్వయంగా చూశాం
- శాంతియుతంగా, పారదర్శకంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలి
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా రాష్ట్రంపై దృష్టి సారించడం శుభసూచకం
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై అభిప్రాయాలు వెల్లడించి నివేదిక, వినతి పత్రాలు అందజేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పూర్తి రాజ్యాంగ విరుద్ధం. అలాంటి రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థలో విధులు నిర్వర్తించే సిబ్బందితో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం అనేది సహేతుకం కాదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించి వెంటనే ఎన్నికల ప్రక్రియను వారికి అప్పగించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాల’ని కోరామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం ఉదయం ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు, ఎన్నికల నిర్వహణ అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక సమయం ఇచ్చారు.
ఈ సందర్భంగా సి.ఈ.సి.తో పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడితో కలిసి విజయవాడలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ శాంతియుతంగా, పారదర్శక రీతిలో నిర్వహించేందుకు చేపట్టాల్సిన అంశాలను, తమ అభిప్రాయాలను వెల్లడించి… ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ, ఫారం-7 పేరుతో ఓట్ల తొలగింపు, అధికారుల వైఖరిని తెలియచేశారు. ఈ మేరకు నివేదికను, వినతి పత్రాన్ని అందించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసిన అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశాం. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు లక్షకుపైగా దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఒకటికి నాలుగోవంతు చొప్పున చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఎన్నికల అధికారులకు తెలియజేశాం. రాష్ట్రంలో రెండు నెలలుగా పోలీస్ అధికారులను వైసీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం మారుస్తోంది. భారీగా బదిలీలు చేస్తోంది. ఈ విషయం పై కూడా దృష్టి సారించాలని కోరాం. సచివాలయాల్లో పనిచేసే మహిళ పోలీసులను బీఎల్‌వోలు నియమించి వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఓట్లు తొలగిస్తున్న వైనాన్ని, 83 నియోజకవర్గాల్లో ఈ తొలగింపు ఎంత దారుణంగా జరిగిందో నివేదికను అందజేశాం. ఎన్నికల ప్రక్రియలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉద్యోగులను పక్కనపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ అంశాన్ని సీఈసీ దృష్టికి తీసుకువెళ్ళాం.
స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కేంద్రం కట్టుబడి ఉంది
రాష్ట్రంలో ఓట్ల జాబితా తయారీలో వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అక్రమాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈసారి శాంతియుతంగా, స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. దీంతోనే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు దృష్టి నిలపడం అభినందనీయం. ఎన్నికల సంఘం వైసీపీ చేస్తోన్న అక్రమాలపై దృష్టి సారించకపోతే ఎన్నికలు పూర్తి హింసాత్మక వాతావరణంలో జరిగే అవకాశం ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ చేసిన ఆకృత్యాలకు కనీసం నామినేషన్లు వేసేందుకు కూడా అవకాశం లేకుండా అరాచకం సృష్టించారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా కేంద్ర ఎన్నికల సంఘం తగు విధంగా స్పందించి రాష్ట్రంలో ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలి. దీనిపై స్పందించి రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఎన్నికలు పారదర్శకంగా జరిపిన విధానం.. ప్రస్తుతం వైసీపీ అనుసరిస్తున్న అరాచక విధానాన్ని కూలంకుషంగా తెలిపాము. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో దొంగ ఓట్లు ఎలా నమోదవుతున్నాయి అనే విషయాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారులకు వివరించాం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఉదాహరణలతో సహా ఎన్నికల సంఘం అధికారులకు చెప్పాం. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే వారిపై అన్యాయంగా పెడుతున్న అక్రమ కేసులు దాడులు విషయాన్ని కూడా వివరించాం. అన్ని అంశాలను సావధానంగా విన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అన్ని విషయాలపై దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల చొరవతో పారదర్శకంగా జరుగుతాయని ఆశిస్తున్నామని” అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… “ఎన్నికల ప్రక్రియలో ఎంతో అనుభవం ఉన్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సేవలను కాదని వైసీపీ ప్రభుత్వం తాము నియమించిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో ఎన్నికలు జరిపించాలని కుట్ర పన్నుతోంది. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)గా గతంలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పని చేసినప్పుడు ఏ మాత్రం తప్పులు ఉండేవి కాదు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏకంగా తాము నియమించిన 2600 మంది మహిళ సచివాలయ పోలీసులను బీఎల్వోలుగా నియమించడం ఆశ్చర్యం వేసింది. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు వరకు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ అరాచకాలు రాష్ట్రంలో అన్నిఇన్ని కావు. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలపై సుమారు 6 నుంచి 7 వేల కేసులను రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేశారు. ఒక్క పుంగనూరు ఘటనలో 250 మందిపై కేసులు నమోదు చేసి, 200 మందిని జైలుకు పంపారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను భయాందోళనలకు గురి చేసి, వాళ్లను ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా చేసి వ్యవస్థలను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని వైసీపీ భావిస్తోంది. దీని ద్వారా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపే కుట్ర జరుగుతోంది. తాజాగా బైండోవర్ కేసులను పోలీసులు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై ఎడాపెడా పెడుతున్నారు. దీని ద్వారా ఎన్నికల్లో పనిచేయకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని వైసీపీ భావిస్తోంది.
ప్రజల తిరుగుబాటు తెలిసి ఓటర్ల జాబితానే మారుస్తున్నారు
పాలనలో ఎడాపెడా ప్రజలను అన్ని రకాలుగా హింసించిన వైసీపీ పాలనపై చివర దశలో ప్రజా తిరుగుబాటు వస్తుందని తెలిసి ఓటర్ల జాబితాను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫాం-6 ద్వారా 1.15 లక్షల మంది ఓటర్లను చేర్చారు. 33 వేలమందిని ఇప్పటికే ఆమోదించారు. ఇంకా దొంగ ఓట్లు ఆమోదించేందుకు సిద్ధం చేశారు. దీనిపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయుకుడిపై బెదిరింపులకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తన విధులను నిర్వర్తించడానికి సైతం కేంద్ర హోంమంత్రిని రక్షణ అడిగిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల పోస్టులకు సైతం దేవ్యాప్తంగా ప్రత్యేకంగా ఎంపిక చేసే విధానం ఉండాలి.
తెలంగాణలో శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు పాలకపక్షం చేస్తున్న కుట్రలపై ఎన్నో ఆరోపణలు బయటకు వస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి దృష్టికి తీసుకెళ్లాం. ఎక్కడా రాజీపడకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూస్తామని సీఈసీ హామీ ఇచ్చారు. 4 కోట్ల మంది ఆంధ్ర ఓటర్ల కు భరోసా ఇచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి మాట్లాడటం సంతోషం కలిగించింది. రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర సర్వీసుల్లో ఉన్న పోలీస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా పంపాలి. ఎన్నికల విధులు, నిర్వహణ ప్రత్యేక పర్యవేక్షక సెల్ ఏర్పాటు చేస్తే బాగుటుంది. ఎన్నికల్లో తప్పు చేసే ఏ అధికారిని వదిలేది లేదు. కచ్చితంగా వారికి న్యాయపరంగా శిక్ష పడుతుంది. గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో, గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అప్పట్లోనే స్పందించి ఉంటే బాగుండేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో వైసీపీ అలుసుగా తీసుకుందని, ప్రస్తుత అవకతవకలకు తెర తీసిందని చెప్పాం. ఎలాంటి లోపాలు లేకుండా ఒక్క దొంగ ఓటు లేకుండా చూసి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరాం” అన్నారు.