– బదిలీల కోసం ఐఏఎస్, ఐపిఎస్ ఎదురుచూపులు
– నెలలు, వారాల తరబడి కొనసాగుతున్న కసరత్తు
– వాయిదా పర్వంతో అధికారుల్లో నిర్వేదం
– ఎప్పటికప్పుడు ‘రేపే విడుదల’గా మారిన ప్రహసనం
– వేగంగా నిర్ణయాలు ఇంకెప్పుడు?
– క్వాంటమ్ వ్యాలీ కాలంలోనూ పాత పద్ధతయితే ఎలా?
– నిర్ణయాలు తీసుకోని శాఖాధిపతులు
– పీసీబీకి పూర్తి స్థాయి మెంబర్ సెక్రటరీ వేయరా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి అధికారంలో వచ్చి ఏడాది దాటిన సందర్భంగా ఐఏఎస్, ఐపిఎస్ బదిలీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా దాదాపు 2 నెలల నుంచి కసరత్తు మీద కసరత్తు చేస్తోంది. కానీ అది ఇప్పటివరకూ ఒక కొలిక్కి రాకపోవడంతో, శాఖాధిపతుల్లో నిస్తేజం పెరిగింది. ఫలితంగా రాబోయే బదిలీలను దృష్టిలో ఉంచుకుని, కీలక నిర్ణయాలు తీసుకోవడం మానేస్తున్న పరిస్థితి.
కలెక్టర్ల బదిలీ జాబితా పూర్తయిందని ఒకసారి, ఇక ఐఏఎస్‌ల జాబితా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందన్న ప్రచారం జరిగింది. గత వారం, అంతకు ముందు వారం క్రితమయితే.. ఏ రాత్రికయినా బదిలీల ఉత్తర్వు రావచ్చన్న ప్రచారం జోరుగా సాగింది. తర్వాత ముఖ్యమంత్రి అధికారులకు మరికొన్ని నెలల అవకాశం ఇద్దామని నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. మళ్లీ సీఎం.. మద్దాడ రవిచంద్ర, విజయానంద్ కలసి జాబితాపై కసరత్తు చేశారని, ఆ ప్రక్రియలో సీఎంఓ కార్యదర్శులను దూరం పెట్టారన్న మరో ప్రచారం జరిగింది.
దానితో పలువురు అధికారులు, తమకున్న మార్గాల ద్వారా బదిలీలపై వాకబు చేయడం, ఇప్పట్లో లేవని తెలియడంతో నిరాశ చెందటం అలవాటయింది. దానితో ‘‘ఎప్పుడు ఉత్తర్వులిస్తే అప్పుడే వెళ్లవచ్చులే. అప్పటిదాకా నిర్ణయాలు తీసుకుని రిస్కు తీసుకోవడం ఎందుకు? వచ్చిన ఆ అధికారే చూసుకుంటారులే’’నన్న నిర్లిప్తత నెలకొంది.
కాగా సీఎంఓ కీలక అధికారి మద్దాడ రవిచంద్రను అక్కడే కొనసాగిస్తారా? లేదా మరో శాఖకు బదిలీ చేస్తారా? అన్న చర్చ చాలాకాలం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఎంఓలో మరో అధికారి ప్రద్యుమ్న స్థానంలో యువరాజ్ రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ ఈఓ శ్యామలరావును కూడా బదిలీ చేస్తారంటున్నారు. నిజానికి ఆయన కూడా అక్కడ సంతృప్తిగా లేరని, చైర్మన్-ఏఈఓలతో సమన్వయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న ప్రచారం చాలాకాలం నుంచి వినిపిస్తున్నదే. నిజానికి శ్యామలరావు స్థానంలో మద్దాడ రవిచంద్ర పేరు చాలాకాలం నుంచి వినిపిస్తున్నదే. టీటీడీలో ఉన్న మరో అధికారి వీరబ్రహ్మం కూడా చాలాకాలం నుంచి అక్కడే కొనసాగుతున్నందున, ఆయనను కూడా మార్చవచ్చంటున్నారు.
ఇక కృష్ణబాబును వైద్యశాఖ నుంచి మున్సిపల్ శాఖకు బదిలీ చేయవచ్చంటున్నారు. ప్రస్తుతం కృష్ణబాబు పనితీరుతో మంత్రి సత్యకుమార్ సంతృప్తిగా లేరంటున్నారు. మరి సీఎంకు సన్నిహితుడైన మంత్రి నారాయణతో, కృష్ణబాబుకు పొసగుతుందో లేదో చూడాలి. అక్కడ ఉన్న సురేష్‌కుమార్ పనితీరుపై మంత్రి నారాయణ సంతృప్తిగా లేరన్న ప్రచారం ఉంది. సురేష్‌కుమార్ ఢిల్లీకి వెళ్లాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎంఓలో ఉన్న కార్తికేయ మిశ్రా కూడా ఢిల్లీకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వారిద్దరిలో ఢిల్లీకి వెళ్లే చాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.
కాగా కృష్ణబాబు స్థానంలో వైద్యారోగ్య శాఖకు సిసోడియా రావచ్చంటున్నారు. ఒక దశలో ఆయన పేరు సీఎంఒలోకి వినిపించినా అది సాధ్య పడకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కీలకమైన రెవిన్యూశాఖకు ముఖేష్‌కుమార్ మీనా రావచ్చని సమాచారం. వివాదరహిత అధికారిగా పేరున్న మీనా పనితీరుపై సీఎం మొదటి నుంచి ఆసక్తిగానే ఉన్నారు.
ఇక దేవదాయ శాఖకు కమిషనర్‌గా ఐఏఎస్ ఉండాల్సి ఉండగా, ఇప్పుడు నాన్ ఐఏఎస్ అధికారి ఉండటం విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో, ఆ శాఖకు ఐఏఎస్‌ను నియమిస్తారో లేదో చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇప్పటిదాకా పూర్తిస్థాయి మెంబర్ సెక్రటరీ లేనందున, పనిభారం పెరిగి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా విశాఖలోని పలు ఫార్మా, ఇతర కెమికల్-నాన్ కెమికల్ కంపెనీల్లో పేలుళ్లు, పర్యావరణ ఉల్లంఘనలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోంది. ఇటీవల రెండు ప్రధాన కంపెనీలు తమ వ్యర్థ రసాయనాలను చెరువుల్లో పారబోస్తున్నారని, భూమిలో పాతిపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పీసీబీకి పూర్తి స్థాయి మెంబర్ సెక్రటరీ లేకపోవడం వల్లే, ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
విశాఖలోని ఫార్మా-కెమికల్- ఇతర కంపెనీలన్నీ బడా పారిశ్రామికవేత్తలవే కావడంతో, వారికి సీఎంఓతోపాటు కేంద్రప్రభుత్వ స్థాయిలో పలుకుబడి ఉండటం సహజం. అందుకే విశాఖ పారిశ్రామికవాడల్లో జరిగే ఏ ఘటనలూ పెద్దగా బయటకు రావు. ఈ కారణంగానే ఎవరిపైనా చర్యలు తీసుకోరన్నది బహిరంగ రహస్యమే.
జగన్ హయాంలో జరిగిన పాలిమర్స్ ఘటన నుంచి, ఎసెన్షియా పేలుడు ఘటన వరకూ ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోకపోవడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఏదైనా ఘటన జరిగితే క్లోజర్ నోటీసులివ్వడం, కొద్దికాలం తర్వాత సంజాయిషీ-పెనాల్టీ ముసుగులో మళ్లీ తెరిపించడం, దానికి ముందు రాయ‘బేరాలు’, కొన్నేళ్ల నుంచి జరుగుతున్న ప్రహసనమేనంటున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే యువకుడైన ఐఏఎస్ అధికారిని, పూర్తిస్ధాయి మెంబర్ సెక్రటరీగా నియమించాలంటున్నారు. ఇక అనకాపల్లి మినహా మహిళా కలెక్టర్లను మార్చకపోవచ్చంటున్నారు.
గుంటూరుకు చెరుకూరి శ్రీధర్ పేరు ఇటీవలి కాలంవరకూ వినిపించినప్పటికీ, ఆయనను కడపలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేల ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనను మారుస్తారా లేదా అన్నది చూడాలి.
సమాచార శాఖ కమిషనర్‌గా ఉన్న హిమాన్షు శుక్లా, జిల్లా కలెక్టర్ పోస్టింగ్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. సమాచార శాఖ కమిషనర్‌గా ఉన్న ఆయన
విజయవాడలోని కార్యాలయానికి వచ్చిన సందర్భాలు తక్కువేనని, ఎక్కువ సమయం సచివాలయంలోనే కేటాయిస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌పై కూటమి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాపు కార్పోరేషన్ ఎండీగా పనిచేసిన ఓ అధికారిని మరో కీలక స్థానానికి బదిలీ చేయాలని, గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపి సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. పోలీసు శాఖలోనూ భారీ బదిలీలు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠీని విశాఖకు బదిలీ
చేయవచ్చని, ఆయన స్థానంలో క ర్నూలు రేంజిలో ఉన్న కోయ ప్రవీణ్ రావచ్చంటున్నారు. కాగా గతంలో సీబీఐలో చేసిన మనీష్‌కుమార్ సిన్హాకు
విజిలెన్స్‌లో పోస్టింగ్ కోసం, ఆయనకు సన్నిహితుడైన ఓ రాజ్యసభ సభ్యుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే డిజిపి ప్రస్తుతం విజిలెన్స్ అధిపతిగా కూడా ఉన్నారు. మరి ఆయన స్థానంలో మనీష్‌ను నియమిస్తారా? లేక ఆయనను విజిలెన్స్ న్చార్జిగానే
కొనసాగించి, మనీష్‌కుమార్‌ను పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది చూడాలి. నిజానికి ప్రభుత్వ నిర్ణయం వల్ల డీజీపీ పదవి రాని కొందరు
సీనియర్ ఐపిఎస్ అధికారులు.. విజిలెన్స్ కోరుకుంటున్నారు.
డీజీపీ పదవి మరో రెండేళ్లుండగా, మళ్లీ ఆయనకే విజలెన్స్ ఇన్చార్జి ఇవ్వడంపై వారు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు డీజీపీ స్ధాయి అధికారులు, రాజీనామా చేసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఇటీవల వార్తలు రావడం గమనార్హం.
ఇక ఇటీవలి జగన్ గుంటూరు పర్యటనలో జరిగిన సింగయ్య మృతి అనంతర పరిణామాలపై, గుంటూరు జిల్లా ఎస్పీ విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.
అయితే అక్కడి స్పెషల్ బ్రాంచి అధికారులు ఆయనను తప్పుదోవపట్టించడం, బందోబస్తులో ఉన్న సీఐల నిర్లక్ష్యం కారణంగానే ఆ పరిణామాలు జరిగాయన్నది పోలీసు శాఖలో వినిపిస్తున్న మరో వాదన. ఈ క్రమంలో ఆయనను కొనసాగిస్తారా? బదిలీ చేస్తారా అన్నది చూడాలి.
ఇక ప్రకాశం జిల్లా ఎస్పీ ఇటీవల తన ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వైసీపీ నేతలు, మాజీ మంత్రులను ఆహ్వానించడం, ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయి పార్టీ శ్రేణుల విమర్శలకు గురయింది. దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మరి దానిని కుటుంబ కార్యక్రమంగా భావించి వదిలేస్తారా? లేక ఆ కారణంతో బదిలీ చేస్తారా అన్నది చూడాలి.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బదిలీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడును గుంటూరు లేదా నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించవచ్చంటున్నారు. ఆయన గుంటూరు వెళ్లేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. ఇక తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీ-కలెక్టర్ల నియామకం పూర్తిగా సీఎం చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వమే నడుస్తోందని, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇంకా పెద్దిరెడ్డి పెత్తనమే సాగుతోందన్న టీడీపీ
వర్గాల ప్రచారం నేపథ్యంలో.. ఆ రెండు జిల్లాల అధికారుల బదిలీలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా ఐపిఎస్ బదిలీలు ఒక మాజీ డీజీపీ, మరో మాజీ ఐజీ కనుసన్నలలో జరుగుతున్నాయన్నది పోలీసు శాఖలో జరుగుతున్న ప్రచారం.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బదిలీలలపై త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘ సీఎంగారు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. అంటే చాలా అడ్వాన్సుడుగా ఉన్నారన్న మాట.మంచిదే. కానీ అదే సమయంలో నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకుంటే బాగుంటుంది. కానీ అందుకు భిన్నంగా నిర్ణయాలు మాత్రం పాత పద్ధతిలో ఉండటం కనిపిస్తోంద’’ని ఓ మాజీ సీఎస్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు ఆలస్యమయ్యేకొద్దీ.. ఆ ప్రభావం ప్రభుత్వ శాఖల వేగంపై పడుతుందని ఆయన విశ్లేషించారు. ఇప్పటికే బదిలీల వ్యవహారం ‘రేపే విడుదల’లా మారిందని ఆఫీసర్లు మాట్లాడుకుంటున్నారని, అది మంచిది కాదని వ్యాఖ్యానించారు.