స్త్రీ ఎలా ఉండాలోఅనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లోకి రాలేదు!
కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!
కరణేషు దక్షః : కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.
రూపేచ కృష్ణః: రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
క్షమయా తు రామః: ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః: భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
సుఖ దుఃఖ మిత్రం: సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగాఉండాలి.మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.