అద్భుతాలతో, అలౌకిక సంఘటనలతో కూడిన పురాణగాథలను పిల్లలకు ఎలా చెప్పాలి? యథాతథంగా చెప్పాలా? లేక ఆ అలౌకిక ఘట్టాలను తొలగించి చెప్పాలా? అదీ కాకుండా ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి చెప్పాలా?
“నరసింహావతార” కథలో ఒక స్తంభం నుండి సగం మనిషి, సగం సింహం ఆకారంలో భగవానుడు వెలికిరావడం…, అలాగే శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలుతో గోవర్ధనగిరిని పైకెత్తడం, ఒక రాయికి శ్రీరామచంద్రుని పాదం తాకగానే స్త్రీ (అహల్య) కావడం, ద్రౌపది ‘చీరను లాగిన కొలదీ ఇంకా పెరుగుతూ ఉండటం… ఇలాంటి ఘట్టాలను చిన్నపిల్లలకు ఎలా వర్ణించాలి?
బాల సాహిత్యరచన తోను, విద్యా బోధనతోనూ సంబంధం ఉన్న అయిదుగురు ప్రముఖులను ప్రశ్నించాను. వారి సమాధానాలు సంగ్రహంగా…
చరిత్ర కథల రచయితగా పేరు పొందిన ‘మహాపతి’ ఇలా అన్నారు…. “చమత్కారాలు, లోకాద్భుత ఘట్టాలు పిల్లల మనస్సులను ఆకట్టుకుంటాయి. కథలలో వీటికి గొప్ప స్థానం ఉన్నది. వీటిని కథలలో వర్ణించవలసిందే..! అయితే అలా వర్ణించేటప్పుడు ఆ అద్భుతం వెనుకగల వాస్తవ భావనను పిల్లలకు వివరించాలి. ఉదాహరణకు…
‘నరసింహావతార’ కథలోని రాతిస్తంభం చైతన్యం లేని ప్రజాభిప్రాయానికి ప్రతీక. ఆ ప్రజాభిప్రాయం ఒక్కసారి బద్దలైతే, అన్యాయానికి ప్రతీకమైన హిరణ్యకశివుని పేగులుతోడే శక్తి దాని నుండి ఆవిర్భవిస్తుంది. శిలగా మారినా, అహల్య రామ చరణ రజ స్పర్శ వల్ల పూర్వ రూపం పొందుతుంది.
పసిపిల్లలకు లేత వయసులో అనుమానాలు రావు. కనుక ప్రాథమిక స్థాయిలో అద్భుతాలను యథాతథంగా వర్ణించాలి. పిల్లల బుద్ది కొంత వికసించి ఆ అద్భుతాలను వాస్తవాలతో జోడించే తెలివి తేటలు వచ్చినప్పుడు, అంటే మాధ్యమిక దశలో ఆ అద్భుతాల వెనుకగల భావనను వివరించాలి.
బాల్యదశ దాటి విద్యార్థి కార్యాకారణ సంబంధాలను తర్కించే దశను చేరినప్పుడు అతడు సహజంగా ఆ అద్భుతానికి కన్నా దాని వెనుక గల భావనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు.
పౌరాణిక కథల పిల్లలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని ఇస్తాయని సోషలిస్టు రచయిత లక్ష్మీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్పకవిమానం, ఆకాశంలో గుర్రపు నవారీ వంటివి పిల్లలలో కుతూహలాన్ని, జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. కనుకనే “పంచతంత్రం, హితోపదేశం. ఈసోప్ కథలు, అరేబియన్ నైట్స్ కథలు, గలివర్ సాహసయాత్ర” మొదలగు కథలు నాటికీ, నేటికీ పిల్లలను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
ఆ కథలు అనేక భాషలలోనికి అనువదించబడినాయి. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం ఉన్నాయంటే.. పూర్వం నమ్మేవారు కాదు. నేడు రాకెట్లు, మిసైల్స్ వచ్చిన తర్వాత మనం ఆ అస్త్రాలను కపోల కల్పనలని ఎలా కొట్టివేయగలం? కనుక అద్భుతాలను కథల నుండి తొలగిస్తే ఆ కథలలోని జీవం పోతుంది. నీరసంగా తయారవుతాయి. సందేశాన్నిచ్చే సామర్థ్యాన్ని అవి కోల్పోతాయి.
అలౌకిక ఘట్టాలు ప్రపంచంలోని అన్ని జాతుల సాహిత్యంలోనూ ఉన్నాయంటారు ప్రిన్సిపాల్ డాక్టర్. దేవేంద్ర. అయితే వైజ్ఞానిక యుగంలో ఇలాంటి అద్భుత ఘట్టాలను ఎంతో కాలం సహించలేము. హేతువాదం ఆధారంగా కొత్త సాహిత్యం రావాలి. పురాణ కథలలోని అద్భుత ఘట్టాలను ప్రతీకలుగా చూపించి వాటి లోని అంతరంగ భావాలను వాస్తవాలతో పోల్చి వివరించి చెప్పాలి.
(జాగృతి| 04 డిసెంబర్ 2023)
సేకరణ: వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు