Suryaa.co.in

Andhra Pradesh Business News

పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంపు

– రాష్ట్రవ్యాప్తంగా 25వేల కంపెనీలపై ప్రభావం

అమరావతి: పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంచుతూ లేబర్‌, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శ్లాబులవారీగా 2,3 రెట్ల మేర ఫీజులను పెంచింది.ఫలింతగా.. రాష్ట్రంలోని 25,270 పరిశ్రమలపై వార్షిక లైసెన్సు ఫీజు పెంపు ప్రభావం చూపనుంది. పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజును భారీగా పెంచుతూ లేబర్‌, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌, ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

2007 తర్వాత ఇప్పుడు వార్షిక లైసెన్సు ఫీజును హార్స్‌పవర్‌ (హెచ్‌పీ), కిలోవాట్స్‌ (కేడబ్ల్యూ) ఆధారంగా పెంచింది.కొన్ని శ్లాబుల్లో రెండింతలు, మరికొన్ని శ్లాబుల్లో మూడింతలమేర లైసెన్సు ఫీజులను పెంచింది. ఇవి ఈ ఏడాదినుంచి అమల్లోకి వస్తాయి.ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన లైసెన్సు ఫీజు చెల్లించి ఉంటే ప్రస్తుత ఫీజుకు, పెంచిన దానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కొత్త లైసెన్సు ఫీజులు అమల్లోకి వచ్చిన 2నెలల్లోపు వ్యత్యాసాన్ని చెల్లించకుంటే 2శాతం వడ్డీతో కట్టాలి.

హెచ్‌పీ/కేడబ్ల్యూతో సంబంధం లేకుండా 10వేల మందికంటే ఎక్కువ ఉద్యోగులున్న పరిశ్రమకు ప్రస్తుతం ఏడాదికి రూ.21వేల వార్షిక లైసెన్సు ఫీజు ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.63వేలకు పెంచారు. వంద మంది ఉండే పరిశ్రమకు ప్రస్తుతం రూ.1800 లైసెన్సు ఫీజు ఉండగా రూ.3,600కు పెరిగింది. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సలహాలను 45రోజుల్లో csvarma.dantuluri@ap.gov.in ఈ-మెయిల్‌కు పంపించాలని సూచించింది.

రాష్ట్రంలోని 25,270 పరిశ్రమలపై వార్షిక లైసెన్సు ఫీజు పెంపు ప్రభావం చూపనుంది. 100హెచ్‌పీ/75కేడబ్ల్యూ ఉండి తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిశ్రమకు ప్రస్తుతం రూ.1500 లైసెన్సు ఫీజు ఉండగా రూ.3 వేలకు పెరిగింది.20 మంది ఉద్యోగులుంటే రూ.2,400 లైసెన్సు ఫీజు ఉండగా రూ.4,800, 50మంది ఉంటే రూ.3,200గా ఉన్న ఫీజు రూ.9,600కు పెరిగింది. 100మంది ఉద్యోగులుంటే రూ.4వేలు ఫీజు చెల్లిస్తుండగా రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 20హెచ్‌పీ నుంచి 20 వేలకుపైగా హెచ్‌పీ వరకు శ్లాబులు ఉండగా వీటిని 10వేలకుపైగా శ్లాబులకు కుదించారు. 10వేల హెచ్‌పీ/7,460కేడబ్ల్యూ ఉండే పరిశ్రమలో 20మంది ఉద్యోగులుంటే ప్రస్తుతం 21వేల లైసెన్సు ఫీజు చెల్లిస్తుండగా దీన్ని రూ.63వేలకు పెంచారు.50 మంది ఉండేవాటికి రూ.24వేలు ఉండగా రూ.72వేలు, 100 మంది వాటికి రూ.27వేలు ఉండగా రూ.81వేలకు పెంచారు.

LEAVE A RESPONSE