– అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారు
– లులు, సత్వా, కపిల్ గ్రూప్, ఉర్సా, ఏఎన్ఎస్ఆర్ సంస్థలతో చంద్రబాబు లాలూచీ
– పప్పు బెల్లాల్లా భూ కేటాయింపుల వెనుక అతిపెద్ద అవినీతి దందా
– భూకేటాయింపులను తక్షణం రద్దు చేయాలి
– విశాఖపట్నం జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు కెకె రాజు డిమాండ్
విశాఖపట్నం: విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను సీఎం చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టడం వెనుక అతిపెద్ద భూకుంభకోణం ఉందని వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు మండిపడ్డారు. విశాఖపట్నం నగరపార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా పలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక ఆయా సంస్థలతో చంద్రబాబుకు ఉన్న లాలూచీ బయటపడుతోందని అన్నారు. తక్షణం ఈ భూకేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని పక్కకుపెట్టి, ఈ ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములు కాజేసే రాబందుల్లా ప్రభుత్వ పెద్దలు మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ భూదోపిడీపై ఉత్తరాంధ్ర ఉద్యమించే పరిస్థితిని తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు.
లులు మీద చంద్రబాబుకి ఎందుకంత ప్రేమ?
లులు మాల్ మీద చంద్రబాబు అవ్యాజమైన ప్రేమను కనబరుస్తున్నారు. విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన 13.74 ఎకరాల భూములను 99 ఏళ్లకు చదరపు అడుగు రూపాయిన్నరకే కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉంది. లులూ వంటి మాల్ ఏర్పాటైతే స్థానిక యువతకు వచ్చే ఉద్యోగాలెన్ని, వారి జీతాలు ఎంతుంటాయనేది కనీస అవగాహన లేకుండానే ఇచ్చారని అనుకోవడానికి లేదు. అయినా వేల కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేస్తున్నారంటే ఏదో ప్రతిఫలం ఆశించి చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.
లులుకు కేటాయించిన 13.74 ఎకరాలకు దాదాపు 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేయొచ్చు. ఆర్కే బీచ్ ఏరియా దేశంలోనే విలువైన ప్రాంతం. ఇక్కడ చదరపు అడుగు రూ.14వేలకు పైమాటే. ఈ లెక్కన 40 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ప్రాజెక్టు విలువ రూ.5,200 కోట్లకు పైమాటే. ఈ 13.50 ఎకరాల్లో అద్భుతంగా నిర్మాణం చేపట్టినా దాని విలువ రూ.1200 కోట్లకు మించదు. ఈ లెక్కన ప్రభుత్వానికి ఏకంగా రూ. 4వేల కోట్లకుపైగానే సంపద సృష్టించగల ఆస్తిని అప్పనంగా చదరపు అడుగు రూపాయిన్నరకే అప్పగించడం విస్మయం కలిగిస్తోంది.
2024 కూటమి ప్రభుత్వం కొలువుదీరాక విజయవాడ నడిబొడ్డున అత్యంత విలువైన ఆర్టీసీకి చెందిన 4 ఎకరాలకుపైగా వందల కోట్ల విలువైన స్థలాన్ని లులు మాల్కి కేటాయించారు. ఫొటోలు చూస్తే చంద్రబాబుతో లులు మాల్ యజమానికి ఉన్న సాన్నిహిత్యం ఏంటో అర్థం అవుతోంది. ఆ సాన్నిహిత్యంతోనే రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూర్చని మాల్కి రాష్ట్రంలోని విలువైన భూములను అప్పనంగా పప్పు బెల్లాల్లా కట్టబెట్టేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఒప్పందాల వెనుక క్విడ్ ప్రోకో ఉంది.
రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా.. ఐటీ కంపెనీకి అధిక ధరకు
ఎటువంటి వేలం లేకుండానే వేల కోట్లు విలువ చేసే భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు కట్టబెట్టినప్పుడు అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా ఈ ప్రభుత్వలో మార్పు రావడం లేదు. కొత్తగా బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు, తెలుగు రాష్ట్రాలో చిట్ ఫండ్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ వంటి సంస్థలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పప్పు బెల్లాల్లా అతి తక్కువ ధరకే పంచి పెట్టింది.
ఎండాడలో పనోరమ హిల్స్‌లో బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.100 కోట్లకుపైనే విలువున్న భూమిని బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరా రూ. కోటిన్నరకే 30 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. ఇదే కొండపై ఫీనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి మాత్రం ఎకరా రూ.4.5 కోట్లు చొప్పున కేటాయించడం ఏంటో అర్థం కావడం లేదు.
సత్వా, కపిల్ రియల్ ఎస్టేట్ సంస్థలు 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాల ద్వారా ప్రతి నెలా అద్దెల రూపంలో రూ.80 కోట్లు చొప్పున ఏటా దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం పొందుతాయి. ఐటీ కంపెనీకి అధిక ధరకు కేటాయించి, రియల్ ఎస్టేట్ సంస్థకు చౌకగా కేటాయించడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని అర్థమవుతుంది. భవనాలు నిర్మించి కోట్లల్లో అద్దెలు వసూలు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం కారుచౌకగా భూములు కేటాయించడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
సత్వా డెవలపర్స్ కి ఎందుకన్ని రాయితీలు.?
సత్వా డెవలపర్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఇక్కడ సత్వా డెవలపర్స్ ఎవరికీ నేరుగా ఉపాధి కల్పించదు. ఈ వెంచర్లో ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలు మాత్రమే ఉపాధి కల్పిస్తాయి. సత్వా గ్రూపునకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో భూమిని కేటాయించడమే కాకుండా ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ మినహాయింపుల పేరుతో అనేక అదనపు రాయితీలు ఇస్తుంది.
కేవలం ఐటీ పార్కును అభివృద్ధి చేసే రియల్ ఎస్టేట్ సంస్థకు ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ కింద ఎలా రాయితీలను ఇస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. సత్వా అనేది పూర్తిగా రియల్ ఎస్ట్టే సంస్థ. దీనికి ముంబై, పూనే, బెంగళూరు ప్రాంతాల్లో వెంఛర్లున్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు.