– జీవిత సత్యం
ప్రతిరోజూ పగలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది, అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది! పోనీ ఆ చీకటి అలాగే ఉంటుందా అంటే ఉండదు.
ఉదయం అనేది వస్తుంది, వెలుగు రేకలు తెస్తుంది, మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగుతుంది, చివరకు సాయంకాలమనే సంధ్యారాగంలో కలిసిపోతుంది…
ప్రతి రోజూ ఇంతే, కాలచక్రంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి.
ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక్క క్షణమైనా ఆగదు కాలం, శిశిరం, వసంతం గ్రీష్మం అని అంటూ ఆరు ఋతువులు వుంటాయి,
అవీ ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
కాలచక్రం అలా అలా దొర్లుతుంటూ వెళ్ళిపోతుంది, ఇలా కాలచక్రం దొర్లిపోతూ ఉంటే అలా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాణుల యొక్క ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది…!
సంవత్సరానికి ఒక సారి పుట్టిన రోజు చేసుకుంటాం, కానీ అసలు విషయం మరచిపోతాము, అంటే ఆయుష్కాలంలో మరొక సంవత్సరం తగ్గిపోయిందీ అని గుర్తుపెట్టుకోవాలి.
కాలం ముందుకు వెళ్తుంటే మృత్యువు దగ్గరకు వస్తున్నదని గుర్తు పెట్టుకోవాలి, కాలం కదిలిపోతుంటే భవిష్యత్తు వర్తమానం గాను, వర్తమానం భూతకాలం గాను మారిపోతుంటుంది.
కనుక ఏదీ నిత్యం కాదు, శాశ్వతం కాదు.. ఇది సత్యమని భావించాలి…!
“కఠోపనిషత్తు” లో నచికేతుడు చెప్పినట్లు ఈ జీవితం అనిత్యమైనది… ఎంత శ్రమపడ్డా, ఎన్ని అనుభవించినా, ఎంత ప్రోగుచేసినా ఒక నాటికి మృత్యువు అనేది… అన్నింటిని బలవంతంగా విడిచిపెట్టి రమ్మంటుంది…!
అది తెలిసి కూడా … అన్యాయం అక్రమాలకు పాల్పడి సంపాదన పేరుతో, ఎన్నో మోసాలకు ఒడిగతాము.
కష్టపడి సంపాదించిన అన్నింటిని విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే…!
కాకపోతే మనం తీసుకెళ్లేది…. ఈ జీవితంలో కోరి సంపాదించుకొన్న సంచిత కర్మల, వాసనల మూటలను మాత్రమే…!
ఇదే జీవిత సత్యం!!