-మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
-వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్
– పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు టీజీ సీఎం రేవంత్ పిలుపు
హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. బయో ఆసియా 2024 సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లోని HICCలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ భౌగోళిక స్థితిగతులు, ఇతర అంశాలపైన సీఎం వారికి వివరించారు. హైదరాబాద్ లో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో లీడర్ గా ఉందని, మరిన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వ చొరవ కారణంగానే హైదరాబాద్ లో ఫార్మా విస్తరించిందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లడానికైనా గంటన్నర సమయం సరిపోతుందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ ను పూర్తి చేస్తామన్నారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ తెలిపారు. భారతదేశంలో తొలి కమర్షియల్ ఆఫీస్ హైదరాబాద్ లోనే ప్రారంభిస్తున్నట్లు ఆమె సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. హైల్త్ కేర్, హైల్త్ టూరిజం, హైల్త్ స్కీల్లింగ్ ల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీ జెర్మీజూర్గన్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ప్రధానంగా వ్యాపార పంటలపైన ద్రుష్టి సారించాలన్నారు. తెలంగాణలో 26 రకాల పంటలను పండించగలిగే భూములున్నాయని సీఎం వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉందన్నారు. డిజిటల్ హైల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నట్లు జెర్మీజూర్గన్స్ కు ముఖ్యమంత్రి తెలియజేశారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తనను కలిసిన బెల్జియం అంబాసిడర్ డెడిర్ వాండర్ హసక్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. కావాల్సిన భూమితో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.