– అసలెవరు? నకిలీలెవరు?
– శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీ అరికట్టేదెలా?
– అడిగినంత ఇవ్వకపోతే ఇళ్లముందే హఠం
– పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
– న్యాయస్థానాలే రక్షించాలంటున్న నెటిజన్లు
– సుమోటోగా తీసుకోవాలని నెటిజన్ల అభ్యర్ధన
హైదరాబాద్ లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు వాపోతున్నారు. తాజాగా కూకట్పల్లి లో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి, రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
నిజానికి హైదరాబాద్‌తోపాటు పెద్ద నగరాలు, పట్టణాల్లో చిన్న వేడుకలు చేసుకునే ప్రతివారికి ఎదురవుతున్న సామాజిక సమస్య. బంధుమిత్రులతో సరదాగా గడుపుతున్న వేళ, ఇళ్లమీదకు వచ్చిపడుతున్న హిజ్రాల దండును చూసి శుభకార్యాలు చేసుకునే వారు హడలెత్తిపోతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే రచ్చ చేస్తున్న వైనం పాపం వారిని స్థానికంగా ఇబ్బందిపెడుతోంది.డబ్బులిచ్చిన వారి ఇళ్ల గోడలపై సంతకం చేసి వెళతారు. అంటే ఇక ఎవరూ ఆ ఇంటికి వెళ్లవద్దని సహచర హిజ్రాలకు సంకేతమన్నమాట. ఇదో బంపర్‌ఆఫర్ మరి!
మీకు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే ఇక అంతే సంగతి! నిజానికి హిజ్రాలకు ఎవరూ ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ఇది బెదిరించి సంపాదించే ఓ తంతుగా మారడంతో, ఎవరి స్తోమతకు తగ్గట్లు వారు డబ్బులు చెల్లించుకోవడం అనివార్యంగా మారింది. వీరిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోరు. ‘మీరే వాళ్లకు ఏదో ఇచ్చి వదలించుకోండ’న్న ఉచిత సలహా ఒకటి పారేస్తారు.
మార్వాడీ, రాజస్థానీ, ఉత్తరాది వారయితే ఈ హిజ్రాలను పిలిచి మరీ గౌరవిస్తారు. తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హిజ్రాలు వచ్చి ఆశీర్వదిస్తే, తమకు శుభం కలుగుతుందన్నది వారి నమ్మకం. కానీ హిజ్రాలు అందరినీ మార్వాడీల దృష్టి కోణంలోనే చూస్తుండటమే సమస్యగా మారింది.
ఇక ధనవంతులు, షాపుల ప్రారంభోత్సవాల సమయంలో చెప్పాల్సిన పనిలేదు. ‘‘ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రభుత్వం వీరిపై చర్యలకు భయపడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. వారి నోటికి, చేష్టలకు అంతా భయపడేవారే. అసలు ఇందులో ఎవరు నిజమైన హిజ్రాలో, ఎవరు నకిలీలో తెలియదు. ఈ సమస్యకు న్యాయస్థానాలే పరిష్కారం చూపాలి. న్యాయస్థానమే ఈ సామాజికసమస్యను సుమోటోగా తీసుకుని ప్రజలను రక్షించాల’ని నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి న్యాయస్థానాలు ఏం చేస్తాయో చూడాలి. అన్నట్లు.. రేవంత్‌రెడ్డి సర్కారు ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ పోలీసు విభాగంలో నియమించింది.