Suryaa.co.in

Features

రాశి ఫలాలు.. పేలాపన

ఉగాది సందర్భంగా కొందరు జ్యోతిష్కులు రాశుల వారీగా ఫలాలు చెప్పడం మనకు తెలుసు. ఆదాయం ఇంత, వ్యయం ఇంత; రాజపూజ్యం, అవమానాలు ఇంత, అంత అని జ్యోతిష్కులు(?) టీ.వీ. చానళ్లలోనూ, యూట్యూబ్ చానళ్లలోనూ పేలాపన చెయ్యడం మనకు తెలిసిందే. ఇది పూర్తిగా అశాస్త్రీయం; విదూషకత్వం.

గోచారం

జ్యోతిషం పరంగా చదువు, తెలివిడి, తెలివి లేని జోతిష్కులు (వీళ్లకు జ్యోతిషం అన్న పదానికి కూడా అర్థం తెలుసో లేదో?) తెగబడి, విరగబడి గోచార ఫలితాలు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న గోచార ఫలితాలు శాస్త్రీయమైనవి, విద్య ఆధారితమైనవి కావు. ఉదాహరణకు సింహరాశి వాళ్లకు శని అష్టమ స్థానంలోకి వచ్చింది. అందువల్ల రానున్న రెండున్నరయేళ్లు సింహరాశి వారికి అపాయకరమైన, అవాంఛనీయమైన, హానికరమైన ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది. అది సరికాదు!

గురు మార్పిడి

మే నెల 14 న జరుగనున్న గురు మార్పిడి సింహరాశి వాళ్లకు ఎంతో మేలైన ఫలితాలను ఇస్తుంది. శని దుష్ప్రభావాలకు గురు సంచారం విరుగుడుగానూ, ఆపై క్షేమకరంగానూ, లాభకరంగానూ ఉంటుంది.

గోచార ఫలితాలపై అవగాహన

గోచార ప్రభావాలపై అవగాహన, సరైన అవగాహన టీ.వీ., యూట్యూబ్ చానళ్ల జోతిష్కులకు ఉన్నట్టు లేదు. గోచార ప్రభావం ఒక రాశి వాళ్లందరిపైనా ఒకేలా ఉండదు. జాతక చక్రం (natal chart) (రాశి, నవాంశం కలుపుకుని)లోని గ్రహ స్థానాలు, దశ, భుక్తులకు తగ్గట్టుగా మాత్రమే గోచార ప్రభావాలు, ఫలితాలు ఉంటాయి. ‘దశాను భావేన ఫలం వదతి’ అని జాతక పారిజాతం తెలియజేస్తోంది.

జాతక చక్రం అన్నదే ప్రధానం. జాతక చక్రాన్ని బట్టే గోచార ప్రభావాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఇమ్యూనిటి ఉన్నప్పుడు వాతావరణలో ఉన్న వైరస్ వల్ల హాని ఉండదు. ఆ విధంగానే జాతక చక్రం బలంగా ఉంటే గోచార ప్రభావాలు హానికరంగానూ, నష్టకరంగానూ, అపాయకరంగానూ ఉండవు.

పరిహారాలు

జ్యోతిష్కుడు అనబడుతున్న ఒక ప్రబుద్ధుడు ‘సాయిబాబా గుళ్లో కిలో పంచదార దానం చేస్తే అష్టమ శని దుష్ప్రభావాలు తొలగిపోతాయి’ అని బహిరంగంగా వాకృచ్చాడు. ఇది హాస్యాస్పదం. మనదేశంలో జ్యోతిశ్శాస్త్రం రూపొంది, చలామణిలోకి వచ్చినప్పుడు సాయిబాబా అనే వ్యక్తిలేడు. సాయిబాబాకు గుడి అన్నదే శాస్త్రీయమూ, విజ్ఞత కాదు. సాయిబాబా గుళ్లో కిలో పంచదార దానమిచ్చేస్తే గోచార ప్రభావాలు తొలగిపోవు. సిగ్గుండాలి ఇలాంటి మాటలు చెప్పడానికి. రెండున్నర కిలోలు టమాటాలు ఆవుకు పెడితే పెళ్లిళ్లు అవవు; ఉద్యోగాలు రావు. ఇటువంటివి చెప్పే పనికిమాలిన వాళ్లను పక్కకు నెట్టేసి సరైన, చదువు, విజ్ఞత ఉన్న జ్యోతిష్కులను సంప్రదించాలి. టీ.వీ., యూట్యూబ్ జ్యోతిష్కులకు(?), జ్యోతిష్కులు అనబడుతున్న అజ్ఞానులకు మనం బలి అవకూడదు.

మిడిమిడి జ్ఞానం

జ్యోతిషం అన్నది ఒక సాగరం. మిడిమిడి జ్ఞానంతో ఏదో పేలాపన చేస్తూ ఎవరూ కూడా సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడకూడదు. జ్యోతిషం విషయంలో సరైన, సమగ్రమైన చదువు, అవగాహన అవసరం.

సరైన డాక్టర్, సరైన ఆడిటర్, సరైన లాయర్, సరైన ఎలక్ట్రీషన్, సరైన డ్రైవర్ కానివాళ్లవల్ల ఎంత హాని జరుగుతుందో సరైన జ్యోతిష్కులు కాని వాళ్లవల్ల కూడా అంతే హాని జరుగుతుంది.

జ్యోతిష్కుల విషయంలో అప్రమత్తత

జ్యోతిషం పట్ల నమ్మకం ఉన్నవాళ్లు జ్యోతిష్కుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి; సరైన, మేలైన జ్యోతిష్కులను ఎంచుకోవాలి. మౌలికమైన విషయాలు కూడా తెలియని, సరైన తెలివి, తెలివిడి లేని, శాస్త్ర జ్ఞానం లేని, అనుభవ జ్ఞానం లేని జ్యోతిష్కుల(?) పేలాపనలకు, అజ్ఞానానికి, అతి తెలివికి వ్యక్తులకు మనం బలి కాకూడదు. గోచార ప్రభావం విషయంలో జ్యోతిష్కులు అనబడుతున్న వాళ్ల అజ్ఞానానికి, అతి తెలివికి ఎవరూ ఎర కాకూడదు.

తథాస్తు; తథాస్తు; తథాస్తు.

శుభం భూయాత్

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE