Suryaa.co.in

Telangana

రాజకీయ పార్టీల నోట ‘హిందూ’ మాట బీజేపీ ఘనతే

-హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు ‘హిందూ ఏక్తా యాత్ర’
-అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి టీఆర్ఎస్ అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలి
– ప్రజల చేత శెభాష్ అన్పించుకునేలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేస్తా
-నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

మైనారిటీ సంతుష్ట విధానాలతో హిందువులను చీల్చేందుకు యత్నించిన రాజకీయ పార్టీల నాయకుల నోట ‘మేం హిందువులం’’అనే మాట వస్తున్నదంటే… ఆ ఘనత ముమ్మాటికీ బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. హిందువుల సంఘటిత శక్తిని చాటి చెప్పేందుకు, హిందూ సమాజాన్ని చీల్చేందుకు, హిందూ దేవుళ్లను కించపర్చే వాళ్లను సహించేది లేదనే సంకేతాలు పంపేందుకు ప్రతి ఏటా ’హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బండి సంజయ్ ఆధ్వర్యంలో రేపు కరీంనగర్ లో కనీవినీ ఎరగని రీతిలో వేలాది మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ను నిర్వహించబోతున్నారు. అదే సమయంలో కరీంనగర్ ఎంపీగా ఎన్నికై మూడేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

ప్రతి ఏటా మాదిరిగానే కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా ‘హిందూ ఏక్తా యాత్రను’ నిర్వహిస్తున్నాం. హిందూ సమాజం సంఘటిత శక్తిని, ఐక్యతా స్పూర్తిని అందరికీ చాటాలనే లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నాం.

మైనారిటీ సంతుష్ట విధానాల పేరుతో రాజకీయ పార్టీలు హిందువులను ఏ విధంగా అణగదొక్కాలని చూస్తున్నాయో మనందరికీ తెలుసు. దీనికి ధీటుగా హిందువులంతా ఐక్యంగా ఉన్నారనే సంకేతాలను పంపేందుకు, హిందూ శక్తిని ప్రదర్శించేందుకే ‘హిందూ ఏక్తా యాత్ర’ను నిర్వహిస్తున్నాం. ఈ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహాలు తయారయ్యాయి. పూర్తి భక్తితో ధార్మిక వాతావరణంలో ఈ యాత్ర నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అందరూ సహకరించాలని కోరుతున్నాం.

జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘జై శ్రీరాం.. జై హనుమాన్… భారత మాతాకీ జై …’’ అంటూ భక్తి భావంతో ఈ యాత్రలో పాల్గొనబోతున్నరు. హిందూ సమాజాన్ని ఎవరు చీల్చే యత్నం చేసినా.. హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదనే సంకేతాలను ఈ యాత్ర ద్వారా పంపుతాం…

ఒకనాడు రాజకీయ పార్టీల నాయకులు మైనారిటీ సంతుష్ట విధానాల పేరుతో హిందువులను అణగదొక్కాలని చూసినయ్. అలాంటి పార్టీ లు, నాయకులు కూడా మేం హిందువుల అనే చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ల నోటి నుండి ‘‘నేను హిందువును’’ అనే పదం వచ్చిందంటే… ఆ ఘనత ముమ్మాటికీ బీజేపీదే.

నేను నిఖార్సయిన హిందువునని చెప్పుకుంటున్న కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను ఒక్కటే అడుగుతున్నా… అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి టీఆర్ఎస్ అనుకూలమా? కాదా? చెప్పాలి. అందాల రాముడు జన్మించిన స్థలంలో రామ మందిర నిర్మాణానికి క్రుషి చేసి ఎందరో కరసేవకులు బలిదానం చేశారు. వారి బలిదానం వ్రుధా పోనివ్వకుండా రామజన్మభూమిలోనే మోదీ రామ మందిరం నిర్మిస్తున్నారు. దీనికి టీఆర్ఎస్ అనుకూలమా? కాదా స్పష్టం చేయాలి.

నరేంద్రమోదీ నాయకత్వంలో, అమ్మవారి ఆశీస్సులు, ప్రజల సహకారంతో కరీంనగర్ ఎంపీగా ఎన్నికై మూడేళ్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో నేను ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటాను. ఎందుకంటే గొప్ప వ్యక్తి మోదీ హయాంలో నేను ఎంపీగా కొనసాగుతున్నాను. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో నేను కూడా భాగస్వామి అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ మూడేళ్ల కాలంలో కరీంనగర్ అభివ్రుద్ధి కోసం ఎంతగానో క్రుషి చేశాను. నిధులు సహా కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఎఫ్ వంటి పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం. అట్లాగే శాతవాహన యూనివర్శిటీకి 12-బి, ఎస్సారార్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకురాగలిగాం. జిల్లాలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయగలిగాం. ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. కరీంనగర్ జిల్లా ప్రజలు శెభాష్ అనే విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేస్తాను. అనేక అభివ్రుద్ధి నిధులు తీసుకొస్తాను.
అయితే ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి.

దురద్రుష్టవశాత్తు కేసీఆర్ ప్రభుత్వం నుండి సరైన సహకారం అందడం లేదు. వేములవాడ రాజన్న ఆలయ అభివ్రుద్దికి కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని పదేపదే కోరినా స్పందన లేదు. కొండగట్టు అంజన్న దేవాలయ అభివ్రుధ్ధి కోసం రామాయణ్ సర్క్కూట్ కింద ప్రతిపాదనలు పంపాలని కోరితే పట్టించుకోవడం లేదు.

ఇప్పటికైనా సరే… రాజకీయాలను పక్కన పెడదాం. జిల్లా అబివ్రుద్ధి ఏజెండాగా ముందుకు సాగుదాం. ఈ విషయంలో నేను సహకరించేందుకు సిధ్ధం. నావల్ల ఏది సాధ్యమో అవన్నీ చేస్తా. కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు రడీగా ఉన్నా.

మీడియా అడిగిన ప్రశ్నలకు…
కేసీఆర్ చేసే సంచలనం ఏమీ లేదు… ఫాంహౌజ్ నుండి ఆయన బయటకు రావడమే ఓ సంచలనం. అంతకుమించి కేసీఆర్ పీకేదేమీ లేదు. దేశమంతా తిరిగి అన్ని పార్టీలను కలపాలనుకున్నా ఏమీ చేయలేదు. తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్.

ఇక్కడి రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేక అల్లాడుతున్నరు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఉద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నరు. వీళ్లకు కనీసం ఆదుకోని సీఎం పంజాబ్ వెళ్లి రైతులకు చెక్కులిస్తున్నడు. అవి కూడా చెల్లుతాయే లేదో… సీఎం తీరును చూస్తుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిన చందంగా ఉంది. కేసీఆర్ ను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నరు.

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కేంద్రం ఇప్పటి వరకు రెండుసార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించడం లేదు. దీనివల్ల లీటర్ పెట్రోలుపై కేసీఆర్ రూ.30 లు దోచుకుంటున్నడు. ఇప్పటి వరకు వ్యాట్ పేరుతోనే రూ.65 వేల కోట్లు సంపాదించారు. పైగా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు.

రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేయాలని, ప్రజలకు మంచి చేయాలనే సోయి కేసీఆర్ కు లేదు. మోదీ ప్రభుత్వం పేదల కోసం నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నా… వాటిని అమ్ముకుంటూ పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నడు.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిండు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. పెన్షన్లు ఇచ్చే స్థితి లేదు.

LEAVE A RESPONSE