– రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీసీఐడీ విచారణ
– నేను ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల నా డిపార్ట్ మెంట్ లో ఇష్టం లేని వారు చేసిన పని ఇది
– సూర్యనారాయణను అడ్డుపెట్టుకుని కక్ష సాధిస్తున్నారు
– ఉద్యోగుల ఆందోళన సమయంలో నా విద్యార్హతను తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉంది
– ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు
డిగ్రీ సర్టిఫికెట్లు ఫోర్జరీ వ్యవహారంలో నాపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. నా శ్రేయోభిలాషుల అనుమానాలు నివృత్తి కోసం నేను సమాధానం చెబుతున్నాను. ఇది పాత సబ్జెక్ట్. టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల ఇది జరిగింది. దీనిని నేరంగా పరిగణించి గతంలో నా ప్రత్యర్థులు వివాదం చేశారు. దాని ఫలితమే ఇవాళ నాపైన కేసు. నేను సర్వీసులో ఉండగా.. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్లని హెడ్ ఆఫీసుకు డిప్యుటేషన్ పై పిలిచారు. నా క్వాలిఫికేషన్ డిప్లమో ఇన్ కంప్యూటర్స్ అని నేను స్పష్టంగా చెప్పాను.
డి.కామ్ ను బి.కామ్ గా టైప్ అవ్వడం వల్ల నేను తప్పుడు సమాచారం ఇచ్చానని నా ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిగింది. 2019లోనే దానిని క్లోజ్ చేశారు. ఇందులో ఎలాంటి నేరపూరితం లేదని, ఎలాంటి బెనిఫిట్స్ పొందలేదని, పనిష్ మెంట్ సరికాదని విచారణ అధికారి కూడా తేల్చారు.. నాపైన ఉన్న ఛార్జస్ అన్నీ డ్రాప్ అయి మూడేళ్లు దాటింది. నేను టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల నా డిపార్ట్ మెంట్ లో ఇష్టం లేని వారు చేసిన పని. బి.మెహర్ కుమార్ అనే ఉద్యోగితో లోకాయుక్తలో పిటిషన్ పెట్టించారు. రాజకీయ కారణాలు కూడా ఈ ఫిర్యాదుకు కారణం.
పీఆర్సీ స్ట్రగుల్ కమిటీలో సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రోద్బలంతోనే ఇది జరిగింది. మాకు వ్యతిరేకంగా అతను ఉండేవాడు. ఎన్జీవో ఆర్గనైజేషన్ లో కూడా నాపై పోటీకి వచ్చి ఓడిపోయాడు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని రకాలు ప్రయత్నించినా ఏదీ సక్సెస్ కాలేదు. ఇది కూడా సక్సెస్ కాలేదు.
లోకాయుక్త నుంచి సీబీసీఐడీకి విచారణకు రావడం అనేది ఎంతవరకు చట్టబద్ధత ఉందదనేది చూడాలి. నేను చేయని పని ఇది. టైపో గ్రాఫిక్ మిస్టేక్. ప్రభుత్వం కూడా ఆనాడు డ్రాప్ అయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు వచ్చాయి. ఇది ఇష్టం లేని వారు కోర్టుకు వెళ్లి విఫలమయ్యారు. రాజకీయంగా దెబ్బతీయడానికి మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు దీనిని తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉంది.
ప్రభుత్వ సొంత మనిషి సూర్యనారాయణ. ఆయన వెనుక ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు. టీడీపీని వ్యతిరేకించాడు కాబట్టి ప్రభుత్వం సూర్యనారాయణను దగ్గరకు తీసింది. జీరోను హీరోను చేశారు. రిటైరై మూడేళ్ల తర్వాత నాపై సీబీసీఐడీ కేసు పెట్టడం రాజకీయంగా వెంటపడాలనే ఉద్దేశమే ఉంది. దీనిపై చట్టపరంగా నేను పోరాడతాను. సీబీఐ ఎంక్వైరీ వేసినా నా తప్పు లేదు అనే నమ్మకం ఉంది. నేను భయపడాల్సిన పనిలేదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేయడం ప్రభుత్వం చేతగానితనమే.
చాలా మంది ఉద్యోగుల్లో దీనిపై అవగాహన ఉంది. ప్రజలకు తెలియదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి చెడ్డపేరు రాకూడదని.. వాస్తవాలు బహిర్గతం చేస్తున్నాను. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటుకి అన్ని విచారణలు పూర్తై క్లీన్ చిట్ ఇచ్చారు. నేను తప్పు చేసి ఉంటే.. సీబీసీఐడీ లెవల్ లో ఉంటే.. దీనిపై లీగల్ గా పోరాడతాం. కానీ ప్రభుత్వం ఇంత కంటే.. ఎన్నో కేసులు సోషల్ మీడియాలో వచ్చిన వాటిపై టీడీపీ ఫిర్యాదు చేస్తే సీబీసీఐడీకి అప్పగించారు. రెండేళ్లైనా వాటిల్లో ఇంతవరకు పురోగతి లేదు. నా కేసు మాత్రం స్పీడ్ గా నిర్ణయం తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టారని చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల్లో పనిచేసినందుకు ఇలాంటి కక్షసాధింపు చర్యలు చేయడం మంచిది కాదు. ఇవాళ సూర్యనారాయణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు. రేపు ప్రభుత్వాలు మారొచ్చు. నేను టీడీపీ ఎమ్మెల్సీ అయినప్పటికీ అతనిపై ఎలాంటి విషయాలు మాట్లాడలేదు. సూర్యనారాయణ డిపార్ట్ మెంట్ టెస్ట్ పాసవలేక.. వేరేవారి నెంబర్ తో పాసైనట్లు ఎస్ఆర్ ఎంట్రీ చేస్తే.. సస్పెండ్ అయ్యాడు. చాలా మందికి ఇది తెలియదు. అతనిని డిస్మిస్ చేయాలని కూడా ప్రభుత్వం రికమెండ్ చేస్తే.. రిక్వెస్ట్ చేసి సస్పెన్షన్ లోకి తెచ్చుకున్నాడు. అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తిని ప్రభుత్వం దగ్గరకు తీసి నాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు.
ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో డైవర్ట్ చేయడానికి చేశారా లేక టీడీపీ సపోర్ట్ ఉందని నైతికంగా దెబ్బతీయడానికి చూస్తున్నారా అనేది చూడాలి. లోకాయుక్త నిర్ణయం తీసుకునేముందు నా వివరణ తీసుకోలేదు. సీబీసీఐడీ కాదు.. సీబీఐ విచారణ చేసినా భయపడేది లేదు. కక్షపూరిత రాజకీయాలకు సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. భవిష్యత్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని ఆలోచించుకోవాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. రాజకీయ కోణంలోనే దీనిని చూడాలి. సీబీసీఐడీ టేకప్ చేయాల్సిన అంశం కాదు ఇది. లోకాయుక్తలో ఉద్యోగులపై చాలా కేసులు ఉంటాయి. రిటైరైన ఉద్యోగిపై కరప్షన్ చార్జెస్ కిందో, పెద్ద నేరం కిందో లోకాయుక్త ఇన్ వాల్వ్ కావాలి. నా రికార్డుల్లో తప్పులు ఉంటే.. బి.మెహర్ కుమార్ కు వచ్చిన నష్టం ఏంటి. అతను మా ప్రత్యర్థి. ఒక్కసారి క్లోజ్ అయిన అంశంపై ఏవిధంగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడో చట్టపరంగా సమాధానం చెప్పాలి.
నేను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాను. పార్టీ పరంగా కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. సూర్యనారాయణ వంటి వ్యక్తులను.. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఒక కంట కనిపెట్టాలి. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. నాపై ఉన్నవీ, లేనివి కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఎలక్షన్ అఫిడవిట్ లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చానని దుష్ప్రచారం చేస్తున్నారు. అఫిడవిట్ 11వ పేజీలో నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని ఇవ్వడం జరిగింది. దుష్ప్రచారం చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. నేను తప్పుచేయలేదని నాకు పూర్తి నమ్మకం ఉంది.