ఎడ్ల పోటీలు నిర్వహించింది నాని అయితే..క్యాసినో నిర్వహించింది కూడా నానినే

-కే-కన్వెన్షన్ బయట ఎడ్ల పోటీలు నిర్వహించింది నాని అయితే.. క్యాసినో నిర్వహించింది కూడా నానినే
– క్యాసినోపై గత 10 రోజులుగా రాష్ట్రం అట్టుడిగిపోతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఏమీ జరగనట్టు నటిస్తున్నారు
– ఎస్సీ సిధ్దార్ద్ కౌశల్ నిజానిజాలు వెలికితీయాలని చూస్తే డిజీపీ గారు ఆయన చేతులు కట్టేశారనుకుంటున్నారు
– టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మంత్రి కొడాలి నాని గుడివాడలో దుష్ట సంస్కృతికి స్వీకారం చుట్టారు. క్యాసినోపై గత 10 రోజులుగా రాష్ట్రం అట్టుడిగిపోతున్నా, దేశ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురౌతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఏమీ జరగనట్టు నటిస్తున్నారు. పాత సినిమల్లో రేలంగి మాదిరి ముఖ్యమంత్రి నటిస్తున్నారు. గుడివాడలో క్యాసినో జరిగిన సంగతి ముఖ్యమంత్రికి తెలియదా? ఇంటలిజెన్స్ అధికారులు మీకు దీనిపై సమాచారం ఇవ్వలేదా? మంత్రి కొడాలినాని తాను సేప్ అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ, కొడాలి నాని శ్రీకృష్ణుడి జన్మస్థానంకు వెళ్లక తప్పదని గుర్తించుకోవాలి.

డీజీపీ గౌతం సవాంగ్ గారిని చూసుకుని వాపుచూసి బలుపనుకుంటున్న మంత్రికి బేడీలు తప్పక పడుతాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు కూడా క్యాసినోపై బయపడి జారుకునే పరిస్థితి వచ్చింది. కొడాలి నాని చేసిన తప్పు మామూలు తప్పు కాదు. తెలుగువారి సంస్కృతిని దెబ్బతీసే చర్యకు కొడాలి నాని పాల్పడ్డారు. బూతుల మంత్రి మాట్లాడే బూతులే కాకుండా మేం చెప్పే విషయాలు కూడా ముఖ్యమంత్రి కొంచెం వినాలి. గడ్డాలు పెంచుకుని, గుట్కాలు తింటూ సొల్లుకార్చుకునే మీ మంత్రిని చూసి పిల్లలు భయపడుతున్నారు. మాయామచ్చింద్రాలాంటి మీ మంత్రి బూతులే కాకుండా సాంప్రదాయబద్ధంగా మాట్లాడే మా మాటలు కూడా వినాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నా.

కొడాలి నానిని ఎందుకు భర్తరఫ్ చేయడం లేదు? చంద్రబాబు నాయుడిని రోజూ బండబూతులు తిట్టే మంత్రి పదవిలో లేకుండా పోతారనే భర్తరఫ్ చేయడం లేదా? సభ్యతా, సంస్కారాలను వదిలేసి చంద్రబాబు నాయుడుని తిడితుంటే సంతోషిస్తారా? క్యాసినో వ్యవహారంపై దర్యాప్తు చేయమని ఆదేశించలేని దుస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. క్యాసినోపై నిజానిజాలు తెలుసుకోవడానికి ముఖ్యమత్రి ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారు? నా రెండున్నర ఎకరాలలో క్యాసినో జరగలేదని అంటున్న నాని వ్యవహారం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్లుగా ఉంది. క్యాసినోతో పాటు కోడిపందాలు, ఎడ్ల
varla-invi పందాలు నాని నిర్వహించలేదా? ఎంట్రీ ఫీజుకట్టలేని పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేయాలని లోపలా-బయటా లాంటి పేకాటను నిర్వహించింది కే-కన్వెషన్ లో కాదా?. జూదంలో కూడా పేద, మద్య, ఉన్నత వర్గం అనే విభజన చేసిన కొడాలి నానిది ఎంత పెద్దమనసు. జూదగాళ్లను మంత్రలుగా చేసి చుట్టుపెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుంది.

ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ఆడపిల్లలతో పేకముక్కలు వేయించి, వారి చేత డ్యాన్సులు వేయించి తెలుగు సంస్కృతిని అదోగతి పాలు చేశారు. 11.01.2022 నుంచి 15.01.2022 వరకు గుడివాడలోని కే-కన్వెన్షన్ లో జరుపబోయే సంక్రాంతి సంభరాలకు హాజరవ్వాలని కొడాలి నాని, ఆయన తమ్ముడు చిన్ని పేరుపైన రాష్ట్రమంతా పోస్టర్లు నాని ఎందుకు వేశారు? కే-కన్వెన్షన్ లో జరుగు ఎడ్ల పందేలకు ఆహ్వానిస్తూ కరపత్రాలు నాని వేయలేదా? కే-కన్వెన్షన్ బయట కొడాలి నాని ఎడ్లపోటీలు పెట్టినప్పుడు కే-కన్వెషన్ బయట క్యాసినో ఎవరు నిర్వహించారో సమాధానం చెప్పాలి. అక్కడ ఉన్న మొత్తం లే-అవుట్ కే-కన్వెన్షన్ కిందకే వస్తుంది. క్యాసినో కే-కన్వెన్షన్ బయట జరిగిందంటూ చెబుతూ తప్పించుకోవాలిని కొడాలి నాని చూస్తున్నారు.

అక్కడ జరిగిన జూద క్రీడలు మొత్తం కొడాలి నాని నేతృత్వంలో జరుగుతున్నట్లు ఆయన ఆహ్వాన పత్రికలు ప్రచురించారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. అయినా కొడాలి నానికి సంబంధం లేదని పోలీసులు చెప్పాలని చూస్తే భవిష్యత్తులో డిపార్ట్ మెంటుకు చెడ్డపేరే మిగులుతుంది. నాలుగు నెలల నుంచి అక్కడ క్యాసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే పోలీసులకు సమాచారం లేదా? ముఖ్యమంత్రికి క్యాసినోపై సమాచారం లేకపోతే రాష్ట్ర ఇంటలిజెన్స్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించుకోవాలి. ఇటువంటి అధ్వానమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సేవలు చేస్తారు? శాంతిభద్రతలు ఏ విధంగా కాపాడుతారు? మేం బయటపెట్టిన ఆధారాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రికి ఆధారాలు కావాలంటే ఆయకు పంపుతాం. కొడాలి నానే తన పేరుపై పోస్టర్లు రిలీజ్ చేస్తే పోలీసులకు ఇంకా ఏం ఆధారాలు కావాలి? గతంలో ప్రశంసలు అందుకున్న పోలీసు వ్యవస్థను ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు?

ఎస్సీ సిధ్దార్ద్ కౌశల్ నిజానిజాలు వెలికితీయాలని చూస్తే డిజీపీ ఆయన చేతులు కట్టేశారని అనుకుంటున్నారు. నిజాన్ని భూస్థాపితం చేయడం ఇష్టం లేకే సిద్ధార్ద్ కౌశల్ గారు మౌనంగా కూర్చున్నారు. అందుకే డీఐజీ మోహన్ రావ్ సమాధానం చెప్పాలి. తెలుగుదేశం నాయకులకు కనీసం పిర్యాదు చేసే హక్కు కూడా లేదా? నిజానిజాలు వెలికితీయండని అడగటమే మేం చేసిన తప్పా? మేం ఆంధ్రప్రదేశ్ పౌరులం కాదా? వైకాపా వారికే పోలీసులు పనిచేస్తారా? నిష్పక్షపాత విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. నిజనిర్ధారణ కమిటీ గుడివాడ వెళితే కుట్ర కేసులు పెడుతారా? కుట్ర కేసులంటే ఏంటే డీఐజీ మోహన్ రావ్ గారికి తెలుసా? పోలీసులుగా మీ విద్యుక్త ధర్మాన్ని మీరు చేయాలంటే కుట్ర కేసులు పెడుతారా? ఎంత హాస్యాస్పదం. కనీసం పిర్యాదు కూడా తీసుకునే పరిస్థితిలో డీఐజీ మోహన్ రావ్, డీజీపీ గౌతం సవాంగ్ లు లేరు. నడిరోడ్డుపై నిలబెట్టి పిర్యాదు తీసుకుంటారా? ఎవరిని సంతోషపెట్టడానికి ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు. సమాధానం చెప్పండి.

రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని నేననటంలేదు. ఓ రైతుకు అన్యాయం జరిగితే యశ్వంత్ రెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్ బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేశారు. మంచి రిపోర్టు వచ్చింది. అందరూ ఆ ఆఫీసర్ ని అభినందించారు. అటువంటి అధికారినెవరినైనా వేస్తే బాగుంటుంది. దర్యాప్తు నిజాయితీగా జరగాలన్న ఉద్దేశం సీఎంకి, డీజీపీకి, డీఐజీకి లేదు. అందుకే మొన్న ప్రెస్ మీట్ లో ఈ కేసు దర్యాప్తు చేయడానికి పోలీసు వ్యవస్థ సుముఖంగా లేదు, విముఖంగా ఉందని చెప్పాను. బాగా దర్యాప్తు చేస్తున్నాం, ఈక ఈక, తోక తోక విచారిస్తున్నాం. దోషులు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదు అని ఎందుకు ప్రకటన చేయరు. ఆ ధైర్యం పోలీసు వ్యవస్థకు ఎందుకు లేదు? ఇంత రాద్ధాంతం జరిగినా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వేల మంది మహిళల పుస్తెలు తెగి మంటల్లో కాలిపోతున్నాయి.

క్యాసినో వ్యవహారంలో రూ. 250 నుంచి 500 కోట్ల దాకా చేతులు మారాయి. మీ ఉదాసీనతవల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీ నిర్లక్ష్యం వల్ల అనేక కుటుంబాలు నాశనమయ్యాయి. జీ హుజూర్ అనాలనే మీ ఆలోచన వల్ల ఎంతో మంది తెలుగు మహిళల బతుకులు బుగ్గిపాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు. చట్టపరంగా దర్యాప్తు చేయకుండా టీడీపీ వర్ల రామయ్య ఇచ్చాడు కాబట్టి అవతల పడేయండనడం ఎంతవరకు న్యాయం? రేపు మర్డర్ జరిగితే దర్యాప్తు చేయమని ఫిర్యాదు ఇస్తే ఇలానే చేస్తారేమో. రేప్ జరిగినా దర్యాప్తు చేయమని ఫిర్యాదు చేస్తే వదిలేస్తారేమో. బందిపోటు నేరం జరిగినా నిర్లక్ష్యంగా ఇలానే వ్యవహరిస్తారా? టీడీపీవారు ఫిర్యాదు చేస్తే తీసుకోవద్దని డీజీపీ చట్టమేమైనా చేశారా?

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకంగా నడుస్తోంది. 20 వేల కోట్ల రూపాయల మెటీరియల్ గోవా నుంచి గుడివాడకు దిగుమతి అయిందని తెలిసి కూడా దానిపై దర్యాప్తు జరపకపోవడాన్ని ఏమనాలి? చెన్నై సి- పోర్టు నుంచి దాన్ని లారీలో గుడివాడకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై దర్యాప్తు చేయాలి. నిజం నిగ్గు తేల్చాలి. 20 వేల కోట్ల రూపాయలంటే ఆషామాషీ కాదు.

గుడివాడలో హాంకాంగ్ స్టైల్ లో క్యాసినో జరిగిందని తెలిసింది. రాష్ట్రంలో హాంకాంగ్ స్టైల్ లో క్యాసినో జరిగితే విచారణ చేయరా? విచారణ నిమిత్తం అవసరమైతే హాంకాంగ్ కూడా వెళ్లాలి. ఇదేమంత చిన్న కేసు, ఆషామాషీ కేసు కాదు. తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిన కేసు. గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ లో క్యాసినో జరిగిన దాఖలాలే లేవు. ఛీర్ గర్ల్స్ తో అర్ధనగ్న నృత్యాలు చేసిన దాఖలాలు కూడా లేవు. మూడుముక్కలాట, తీన్ పత్తీ రోలర్స్ ఆడటం తప్పు. పైగా ఇందులో పాల్గొనడానికి 10 వేల రూపాయలు ఎంట్రీఫీజు పెట్టడమేంటి. తెలుగువారిని మూకుమ్మడిగా బంగాళాఖాతంలో కలపాలని చూస్తున్నారా? ప్రభుత్వం తెలుగు సంస్కృతిపై ఉక్కు పాదం మోపాలని చూస్తోందా? తెలుగు గౌరవాన్ని అణగదొక్కాలని చూస్తోంది.

ఎంక్వైరీకి ఒక టీమ్ ని ఎందుకు పంపలేదో ముఖ్యమంత్రి, డీజీపీ, డీఐజీ మోహన్ రావ్ లను అడుగుతున్నాను. జీపులో పోర్టుకు పోయి ఏమేమి మెటీరియల్ వచ్చిందో కనుగొని ఇక్కడికి వచ్చి వర్ల రామయ్య చేసిన ఆరోపణల్లో నిజంలేదని చెప్పేస్తారు. వెళ్లొచ్చినందుకు జీపు డీజిల్ తప్పా మరేమీ నష్టంకాదు. 17వ తేది ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఆధారాలతో సహా తెలుస్తోంది. గోవా నుంచి గుడివాడకు వచ్చిన 13 మంది ఛీర్ గర్ల్స్ ల సమాచారాన్ని అందించాను. గోవా నుంచి వచ్చిన క్యాసినో ఆటకు సంబంధించిన మెటీరియల్ వచ్చిన సమాచారమిచ్చాం. గుడివాడలో మాయలోడిలా, మాంత్రికుడిలా ఉండే ఓ మంత్రి ఉంటాడు, ఆయనను చూడటానికి ఈ ఛీర్ గర్ల్స్ రాలేదు. గుడివాడలో విహార యాత్రకు రాలేదు. ఇన్ని వివరాలు అందజేస్తే, గోవా నుంచి వచ్చిన గర్ల్స్ టికెట్ నెంబర్లతో సహా ఇస్తే ఇంకా ఏమీ జరగలేదని నమ్మించడానికి ఎందుకింత తపన పడుతున్నారు.

గుడివాడకు తెచ్చిన క్యాసినో మెటీరియల్ ఇంకా గోవా వెళ్లలేదు. కృష్ణా జిల్లాలోనే ఉంది. ఈ మెటీరియల్ బంటుమిల్లి దగ్గర ఎక్కడో ఉందని సమాచారం అందింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా డీజీపీని పిలిచి క్యాసినో పై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీసి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి. మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలి.

Leave a Reply