– స్పీకర్ గా ఉన్నా… నేను నా నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యేనే
– జగన్ కు నేను సమస్య కాకూడదు
– స్పీకర్ తమ్మినేని సీతారాం
విజయవాడ: తానెప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని, సీఎం జగన్‌కు సమస్య కాకూడదని భావించానని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. స్పీకర్లు రెండోసారి మళ్లీ గెలవరన్న ప్రచారం సరికాదని, తాను మళ్లీ గెలిచి కొత్త రికార్డు సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీతారాం ఏమన్నారంటే…నేనెప్పుడూ ఎటువంటి పదవులు ఆశించలేదు.
జగన్ కు నేను సమస్య కాకూడదు… ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి నేను సిద్దం.మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుంది.నన్ను కచ్చితంగా గెలుచి రావాలన్నా అని గతంలో చెప్పారు.కానీ అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. స్పీకర్ గా ఉండాలని నాకు చెప్పడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడ్డారు.నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సర్… అని చెప్పి బాధ్యత తీసుకున్నా.మంత్రివర్గ కూర్పు చాలా బాగుంది.అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారు.
మాట్లాడేవాళ్లు, చర్చించే వాళ్లు వెళ్లి వాస్తవాలు తెలుసుకోండి.బిసి లు టిడిపి కి ఎప్పుడో దూరం అయ్యారు.ఉద్యమ కెరటం వస్తుంది… సామాజిక న్యాయం విప్లవంలో టిడిపి కొట్టుకు పోవాల్సింది. డిపాజిట్లు కూడా రాకుండా పోతారు… రాసి పెట్టుకోండి. స్పీకర్ గా కాదు… బిసి నాయకుడిగా నేను చెబుతున్నా.సీతారాం కు మంత్రి అని పత్రికలు రాశాయి… కాని నేను ఆశించలేదు.
స్పీకర్ గా అప్పగించిన బాధ్యత ను గౌరవంగా భావించాను.మంత్రి వర్గ కూర్పులో జగన్ సాహస నిర్ణయం తీసుకున్నారని అనేక మంది నాకు ఫోన్లు చేసి చెప్పారు.వెనుకబడిన వర్గాల వారికి వెనుకబాటుతనం లేదనే ధైర్యం జగన్ కల్పించారు.స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు చూశాం.రేపు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా విజయాన్ని ప్రజలే చూస్తారు.
సుచరిత రాజీనామా లేఖ నాకు రాలేదు.వైసిపి లో పూర్తి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే చాలామంది తమ అభిప్రాయం ఓపెన్ గా చెప్పారు. స్పీకర్ గా చేసిన వాళ్లు గెలవలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో నేను గెలిచి చరిత్ర ను తిరిగి రాస్తా. నా నియోజకవర్గం లో నేను గెలవడం ద్వారా వైసిపి ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయం.సభకు స్పీకర్ గా ఉన్నా… నేను నా నియోజకవర్గం లో మాత్రం ఎమ్మెల్యే నే. టీడీపీ వాళ్లకు జగన్ ను విమర్శించే అర్హత లేదు.