Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదు

-అమరావతి రైతుల పాదయాత్రకు అందరు మద్దతు ప్రకటించాలి
-పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది
– హైకోర్టు అనుమతితో రైతులు పాదయాత్ర చేస్తున్నారు
ఎంపీ రఘురామకృష్ణ రాజు
రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కోరారు. పాదయాత్రకు వెళ్లలేని వారు కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా సంఘీభావం తెలపాలని అన్నారు. రైతుల పాదయాత్రను పోలీసుల అండతో వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు చంద్రబాబు అనుమతించారని, జగన్ పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా చంద్రబాబు అడ్డుకోలేదని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. అయితే రైతుల పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, దీంతో వారు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని అన్నారు. అయినప్పటికీ, ఆంక్షల పేరుతో పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని విమర్శించారు.

LEAVE A RESPONSE