తొలి నుంచి నీపై నాదే ఆదిపత్యం
ఎమ్మెల్యే కాక ముందు నీ బతుకేంది చంద్రబాబూ?
చంద్రబాబు తాతలు దిగి వచ్చినా నా కథ తేల్చడం వారి తరం కాదు
పాల వ్యాపారంలో నీ కంటే ఎక్కవ రేటే ఇస్తున్నాం
చిత్తూరు జిల్లా యర్రాతివారిపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సదుం (యర్రాతివారిపల్లి): రాజకీయాల్లో దిగజారుడుతనంతో మాట్లాడటం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కుప్పంలో తన ఓటమి స్పష్టంగా కనిపిస్తుండటంతో మానసిక సంతులతను కోల్పోయి చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…
పుడింగి అంటే అర్థం తెలుసా బాబూ?
కుప్పంలో చంద్రబాబు నా గురించి పుంగనూరు పుడంగి అంటూ వ్యాఖ్యలు చేశాడు. అసలు పుడింగి అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా? ఆ మాటకు అర్థం ఆయన కంటే బలవంతుడు అని. అంటే చంద్రబాబు కంటే నేనే బలవంతుడిని అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కుప్పంలో చంద్రబాబు వరుసగా స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చూశాడు. తన నియోజకవర్గంలోనే గెలుపునకు దూరమైన ఆయన పుంగనూరులో నాపైన పోటీ చేస్తాను అనడం హాస్యాస్పదంగా ఉంది. వైయస్ జగన్ ఆధ్వర్యంలో పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబును మూడు చెరువుల నీరు తాగించిన మాట వాస్తవం కాదా? ఇలాంటి వ్యక్తి పుంగనూరులో నా కథ ఏమిటో తేలుస్తాను అని బీరాలు పలుకుతున్నాడు. చంద్రబాబే కాదు ఆయన తాతలు దిగి వచ్చినా నా కథ తేల్చడం వారి తరం కాదు.
నువ్వు సీఎంగా ఉన్న హయాంలోనే చిత్తూరు జిల్లాలో మాదే హవా
చంద్రబాబు సీఎంగా ఉన్న పద్నాలుగు సంవత్సరాల్లోనూ చిత్తూరు జిల్లాలో మా హవానే కొనసాగింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాలో నేను మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత వైయస్ఆర్ సిపి పూర్తి మెజారిటీని సాధించిన విషయం గుర్తులేదా? చివరికి నువ్వు సీఎంగా ఉన్నాకూడా ఒక్క ఓటు మెజార్టీతో జిల్లా పరిషత్ ను కూడా కైవసం చేసుకున్నాము. ఇవ్వన్నీ తెలిసి కూడా ఈ పద్నాలుగు ఏళ్ళు మేం జిల్లాలో తిరగలేదని ఎలా మాట్లాడుతున్నావు చంద్రబాబూ? అటు కాంగ్రెస్ లోనూ, ఇటు వైయస్ఆర్ సిపి లోనూ ఉన్న సమయంలో ఎప్పుడైనా మా కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు చిత్తూరు జిల్లాలో సాధించావా చంద్రబాబూ? నీలా నాకు బీరాలు పడకడం రాదు. అనుకూలమైన పచ్చ పత్రికలు ఉన్నాయని, ఏది మాట్లాడినా వారు ప్రచురిస్తారనే ఇలా ఇష్టం వచ్చినట్లు సిగ్గుమాలినతనంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
చంద్రబాబుకు కాలేజీ రోజుల నుంచి ఇప్పటి వరకు నా మీద ఆదిపత్యం సాధించడానికి జీవితకాలం సరిపోవడం లేదు. రేపు కూడా అదే పరిస్థితి ఉంటుంది. నువ్వు ఏ విధంగా రాజకీయాల్లో రాణించావు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేవ్ లో ఇందిరమ్మ కాంగ్రెస్ లో శాసనసభ్యుడుగా గెలిచావు. ఆ తరువాత రెండోసారి ఓడిపోయి ఎన్టీ రామారావు గారి కుమార్తెను పెళ్ళి చేసుకుని, కుప్పంలోనివ్యక్తిని రాజీనామా చేయించి, అక్కడ గెలుస్తూ వచ్చావు. ఒకవేళ రామారావు గారి అల్లుడు కాకపోయినా, తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉండే వాడివా? అటువంటి నువ్వు కూడా మాట్లాడటం చాలా దురదృష్టకరం. నీకు అండగా ఎన్టీ రామారావు, ఆయన పేరు ఉండబట్టే రాజకీయాల్లో మనగలిగావు, నాకు నీలా కాదు, ఎటువంటి ఊతం లేకుండానే స్వయంగా రాణించాను, నువ్వు మాతో పోల్చుకోవడం చాలా దురదృష్టకరం.
పాల వ్యాపారంలో నీ కంటే ఎక్కవ రేటే ఇస్తున్నాం
నేనుగర్వంగా చెబుతున్నాను. మేం 1993 నుంచి పాల వ్యాపారంలో ఉన్నాము. నీ మాదిరిగా పాల వ్యాపారం ద్వారా వేలకోట్లు పార్ట్ నర్ లను మోసం చేసి, దానిలోని షేర్ లను బలవంతంగా కొనుగోలు చేయలేదు. మేం స్వయంగా వ్యాపారం చేస్తున్నాం. లీటరు పాలకు మేం కనిష్టంగా రూ.29 గరిష్టంగా రూ.34 చెల్లిస్తున్నాం. హెరిటేజ్ ద్వారా నువ్వు ఇస్తున్న కనిష్ట ధర రూ.24 మాత్రమే. ఎవరు రైతులను మోసం చేస్తున్నారు? ఒకవేళ మేం దౌర్జన్యం చేసి, రైతులకు తక్కువ ధర ఇస్తే, వారు వేరే డెయిరీలకు వెడతారు. ఎంతమంది సొంతగా డెయిరీలు పెట్టుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితి తెలిసి కూడా పాల వ్యాపారం మీద సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది.
చంద్రబాబు బతుకు ఏమిటో ఈ జిల్లా ప్రజలకు తెలుసు
ఈ జిల్లాలో అందరికీ తెలుసు చంద్రబాబు బతుకు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి నేను ఏదో పాలవ్యాపారంలో తప్పులు చేస్తున్నట్లు అబద్దాలు చెబుతున్నాడు. నీకు ధైర్యం ఉంటే పాలకు ఎంత కనిష్ట, గరిష్ట ధర ఇస్తున్నారో పత్రికల ద్వారా తెలియచేయి. ఈ వాస్తవాలు ప్రజలు ముందుకు తీసుకువస్తే నీ బతుకు ఏమిటో మరింత బాగా అర్థం అవుతుంది.
ఎన్నికల్లో వరుస ఓటమిలతోనే నీ దుస్తులు ఊడిపోయాయి
నా దుస్తులు ఊడతీయిస్తానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నీకు సిగ్గులేదా… కుప్పంలో జగన్ గారి పాలనలోనే ప్రజలు తమ తిరస్కారం ద్వారా నీ దుస్తులు ఊడదీశారు. తొలుత పంచాయతీ, తరువాత పరిషత్, మూడోసారి మున్సిపల్ ఎన్నికల్లో వరుస ఓటమిలతో నీ దుస్తులు ఊడిపోయాయి. ఇప్పుడు ఏదో మా సంగతి చూస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన తీరు చూస్తుంటే కిందపడ్డా నాదే పైచేయి అని బీరాలు పలుకుతారనే సామెత గుర్తుకు వస్తోంది. 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ గారి ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో ప్రజా తీర్పుతో నీ దుస్తులు పూర్తిగా ఊడిపోతాయి. ఆ తరువాత నువ్వు పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది.
అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకున్నా ఏడుపేనా!!
మైనింగ్ లో ఇసుక, గ్రానైట్ లో నేను డబ్బులు తీసుకుంటున్నానని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని నువ్వే చెప్పావు. దానిపై విచారణ జరిపి అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుని, అక్రమ మైనింగ్ ను అరికట్టాము. మళ్ళీ రెండో సారి కూడా కుప్పం వచ్చి అక్రమ మైనింగ్ అంటూ ఏడ్చావు. మైనింగ్ అక్రమాలపై మళ్ళీ విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకున్నాము. వారితో క్వారీలు మూయించాను. వారి నుంచి యాబై కోట్లు వసూలు కోసమే ఇది చేశామని చెప్పడానికి నీకు నోరు ఎలా వచ్చింది చంద్రబాబు. కుప్పంకు వచ్చిన ప్రతిసారీ నువ్వు చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నామని తెలిసి కూడా ఇలా అబద్దాలు ఎలా మాట్లాడుతున్నావు? మైనింగ్ చేయాలంటే మాకు కప్పం కట్టాలా? అటువంటి దీనస్థితిలో మేం ఉన్నామా?
ఎమ్మెల్యే కాకుముందు నీ బుతకేంది చంద్రబాబూ? కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. మాకు ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా? ఇది మా సొంత ఊరు, ఈ ఊరిలో భూములు కొత్తగా కొన్నామా? మా తాత, తండ్రులు సంపాదించిన భూముల్లోనే మేం ఉన్నాము. నువ్వు వేల, లక్షల కోట్లకు ఎలా ఎదిగావు. అదంతా అక్రమ సంపాదన కాదా? తప్పుడు పనులు చేస్తూ… సిగ్గు లేకుండా మాపైన మాట్లాడే అర్హత నీకు ఉందా?
చంద్రబాబు చేస్తున్న చౌకబారు విమర్శలు కిందిస్థాయిలో ఒక పంచాయతీ వార్డు సభ్యుడు కూడా ఇంత దిగజారి మాట్లాడడు. నిన్ను ఎదిరించే ధైర్యం నాకు లేదా? విద్యార్థి రోజుల నుంచే నిన్ను ఎదిరిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎదిరించేది ఏమిటీ? నన్ను జిల్లాలో తిరగనివ్వనూ అంటున్నాడు. నిన్ను వదిలేయడం వల్లే కుప్పంలో తిరగ గలుగుతున్నావు. లేకపోతే నువ్వు నేరుగా హైదరాబాద్ లోనే కాపురం ఉండాల్సి వచ్చేది. కరోనా సమయంలో ఎలా అయితే హైదరాబాద్ లో తలదాచుని దాక్కున్నావో అలాంటి పరిస్థితి ఉండేది.
గాడిదతో పోలిస్తే అవికూడా బాధపడతాయి
నాకు అనుకూలమైన మీడియాలు ఉన్నాయి, ఏదైనా మాట్లాడవచ్చని అనుకుంటు చంద్రబాబు అభాసుపాలవుతున్నాడు. నిన్ను గాడిద కొడకా అని అంటే గాడిదలు అన్ని మా ఇంటి ముందుకు వచ్చి మా సంతానం అంత పనికిమాలినదా అని ఆవేదన చెందుతాయి. నువ్వు నా గురించి, నా వ్యక్తిత్వం గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్రంలోని నాయకులకు నా గురించి తెలుసు. అలాగే నీ గురించి కూడా తెలుసు. ఏ విధంగా నువ్వు రాజకీయాల్లో ఎదిగావు, ఏ విధంగా రామారావు పంచన చేరావు, ఏ విధంగా ఆయనకు వెన్నుపోటు పొడిచావు, ఎలా అధికారంలోకి వచ్చావో అందరికీ తెలుసు.
సీఎంగా ఉండి కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోయావు
పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి సొంత నియోజకవర్గం కుప్పంను ఏదో అభివృద్ది చేశాడని అనుకున్నాను. మేం కుప్పం నియోజకవర్గంలో 20వేల ఇళ్ళు ఇచ్చాం. వందల కోట్లు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. నువ్వు సీఎం జగన్ గారికి రెవెన్యూ డివిజన్ కోరుతూ లేఖ రాశావు. పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి నీ నియోజకవర్గంను రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయావు. అలాంటిది సీఎం జగన్ గారికి రాసిన లేఖతో ఆయన పెద్దమనస్సుతో నీ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ఇచ్చారు.
కుప్పంలో నీ ఓటమి ఖాయం
చంద్రబాబు తాటాకు చప్పుళ్ళకు మేం భయపడేది లేదు. ఏదైనా చేయాలంటే కార్యరూపంలో చూపించు. కుప్పంలో నువ్వు ఎలా గెలుస్తావో, నేను పుంగనూరులో నేను ఎలా గెలుస్తానో చూద్దాం. కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం, ఆయన ముమ్మాటికి ఓడిపోతాడు. అందుకే తట్టుకోలేక ఉక్రోషంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకు కనీస విజ్ఞత లేదు.