బ్రిటిష్ వారిని వెళ్లగొట్టిన ప్రజలు…మన అరాచకాలను సహిస్తారా?
పోలీసులే ప్రజలను చితక బాది, వారిపైనే ఐపిసి 307 సెక్షన్ కింద కేసులా?
హవ్వ… ఆనం కు సెక్యూ రిటీ తొలగింపా?
హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది
కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రతి దౌపది ముర్ముకు లేఖ రాశా
ఫాసిజానికి, ప్రజాస్వామ్యానికి మధ్య యుద్ధం
తిరగబడ్డ తెలుగు బిడ్డలు
రెండు సినిమాలను హిట్ చేయండి
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రాష్ట్రంలో ఫాసిజానికి, ప్రజాస్వామ్యానికి మధ్య యుద్ధం జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫాసిజం పోకడలు పోవడం దురదృష్టకరమన్నారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… బ్రిటిష్ వాళ్ళ కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. ఐదేళ్ల పాలన కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు. సువిశాల భారతాన్ని 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిష్ వారి రాచరికపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. మనం అరాచకాలు చేస్తే ప్రజలు సహిస్తారా?. గతంలో పోరాటాలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో బ్యాలెట్ తో సమాధానం చెబుతారు. మనం ఎంత మేనేజ్ చేయాలని అనుకున్న సాధ్యం కాదని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.
కుప్పం ప్రజలు పోలీసులపై తిరగబడిన తీరు, రేపు రాష్ట్ర నలుమూలల వ్యాప్తి చెందుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రతిపక్ష నేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ని కుప్పంలో పోలీసులు దారుణంగా అవమానించి, వేధించారు. రోడ్ షో నిర్వహించడానికి ఉపయోగించే వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ ను ముందస్తుగానే అరెస్టు చేశారు. పోలీసులు గూండాల్లాగా వ్యవహరించారు. గడపగడపకు వెళ్లి, చంద్రబాబును ప్రచారం చేసుకోమని డీ ఎస్పీ చెప్పడం హాస్యాస్పదం.
గతంలో జగన్ , ఆయన తల్లి, చెల్లి ఇరుకు రోడ్డులలో సమావేశాలను ఏర్పాటు చేయలేదా?. అప్పటి ప్రభుత్వం, పోలీసులతో రక్షణ కల్పించి సహకరించలేదా??. చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకోవడానికి వినియోగించిన పోలీసులలో, పది శాతం మంది పోలీసులను రక్షణ కోసం వినియోగించి ఉంటే రోడ్ షో సజావుగా సాగేది. ప్రజలను పోలీసుల విపరీతంగా కొట్టి, వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణం. ఈ కేసులు న్యాయస్థానాలలో నిలబడేవి కావు. కాకపోతే పోలీసులు వారిని అరెస్టు చేసి, వేధించగలరు అంతే అని రఘురామకృష్ణం రాజు అన్నారు.
డిజిపిగా ఇటీవల పదోన్నతి పొందిన సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సలహా మేరకే జీవో నెంబర్ 1 ని జారీ చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇది అత్యంత నీచమైన, ప్రజాస్వామ్యాన్ని హరించే జీవో. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంది. న్యాయస్థానాన్ని ఎవరైనా ఆశ్రయించక ముందే, ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. రాజకీయ పార్టీలు సమావేశాలను ఏర్పాటు చేస్తే, రక్షణ కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రతి దౌపది ముర్ముకు తాను ఒక లేఖ రాశాను. ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎటువంటి చర్యలు తీసుకున్న తీసుకోకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ దమన కాండ, దమన నీతి రికార్డుల్లో ఉంటుంది. మన హింస రాజకీయాన్ని, రివర్స్ కేసులు పెట్టించి వేధించే విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులోని ఒక ప్రముఖ దినపత్రికలో తుగ్లక్ పాలన శీర్షిక పేరిట వచ్చిన వార్తా కథనాన్ని చదివి వినిపించారు. ఇందులోని ప్రతి అక్షరం ఆణిముత్యం అని పేర్కొన్నారు. సిఐడి ఓవరాక్షన్, ముఖ్యమంత్రికి మాత్రమే పరువు ఉంటుందన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై రఘురామ నిప్పులు చెరిగారు.
పాసిస్ట్ పోకడలు పోయిన వారికి హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ముసోలి తీసుకువచ్చిన పాసిస్ట్ విధానాన్ని, హిట్లర్ అనుసరించాడు. ఫాసిస్టు విధానాన్ని ఎవరు అనుసరించినా కూడా ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేసుకుంటూ పోతే, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా కొనసాగిన ఆనం రామనారాయణ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించడం సిగ్గుచేటని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలకు ఇది పరాకాష్ట. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి శాసనసభ్యుడు కాకపోయినాప్పటికీ, సెక్యూరిటీని యధావిధిగా కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యే, అయినా రాష్ట్ర ప్రభుత్వం… నాలుగు మంచి మాటలు చెప్పిన పాపానికి తొలగించింది. తనకు సెక్యూరిటీ కల్పించాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, తిరిగి సెక్యూరిటీని ఇవ్వడం ఖాయం.
కానీ అంతకంటే ముందే సెక్యూరిటీని కల్పించాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నాను. రేపు ఆయనకు ఏమైనా జరిగితే, నువ్వు సెక్యూరిటీ తొలగించడం వల్లే, జరిగింది అంటారు జగన్ అంటూ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తనకు కూడా సెక్యూరిటీని కల్పిస్తానని చెప్పినప్పుడు, సెక్యూరిటీ ఇవ్వకుండా అడ్డుకునేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది ఐబి అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తే తన పరువు పోతుందని, వారి వద్ద వాపోయారు. తామే సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించడం ఎందుకు?… చంపడానికా? అంటూ ప్రశ్నించారు. ఇటువంటి చీఫ్ ట్రిక్స్ ఇకనైనా మానేయండి అంటూ హితవు పలికారు.
సంక్రాంతి పండుగకు విడుదల కానున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను హిట్ చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. తమ పార్టీకి చెందిన వారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారని, ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి అభిమానులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అఖండ సినిమా విడుదల సందర్భంగా 100 రూపాయలు ఉన్న టికెట్ ను పది రూపాయలకు తగ్గించారు. అయినా ఆ చిత్రం విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు వీర సింహారెడ్డి చిత్రం ఫంక్షన్ నిర్వాహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏబీఎన్ కాలేజ్ మైదానం విశాలంగా ఉండగా, స్థానికంగా సినిమా ఫంక్షన్ నిర్వహణకు అనుమతి నిరాకరించారు.
బాలినేని మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం మరొకచోట అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలు సరికాదు. సినిమా విజయాన్ని ఈ తరహా చర్యలతో అడ్డుకోలేరు. ఊరు బయట సభను నిర్వహించుకోవాలని సూచించినట్లు తెలిసింది. మహా అయితే 5000 మంది అభిమానులు తక్కువగా వస్తారేమో. అంతేకానీ, సభ నిర్వహణను అడ్డుకోలేరు. ఈ రకమైన చర్యల వల్ల మనము అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు తెలిసిపోతాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎంత సమయమనంతో వ్యవహరించారో చూసి, సంయమనముతో వ్యవహరించడం జగన్ నేర్చుకోవాలి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పార్టీ కార్యకర్తలను ఆయన అదుపులో పెట్టారు. గతంలో మనమేమో మేము అధికారంలోకి వచ్చిన తరువాత తోలు తీస్తామని హెచ్చరించాం. చంద్రబాబు నాయుడుకు మనకు ఉన్న తేడా అదే. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా వాటికి వేల మందితో ఒక ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు ప్లాన్ చేసుకుంటే, మనము అనుమతి ఇవ్వలేదు. దానితో 5 లక్షల మందితో వారు సభను నిర్వహించారు. అప్పుడే మన పార్టీ పునాదులు కదిలాయి. రేపు వీర సింహారెడ్డి చిత్రం ఫంక్షన్ కూడా అటువంటి ప్రభావమే చూపుతుందో ఏమో…!
ఎలాగైనా ఇళ్లల్లోకి వాలంటీర్లు ప్రవేశించేలా పథక రచన
వాలంటీర్లు ఎలాగైనా ఇళ్లల్లోకి వెళ్లేలా ప్రభుత్వం పథక రచన చేస్తోందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. విద్యార్థులు పాఠశాలకు గైరాజరి అయితే, వాలంటీర్లకు ఏమి సంబంధం. వారు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలని పేర్కొనడం అనైతికం. ఇంటికి వెళ్లిన వాలంటీర్, ఆ గృహిణి తో మాటలు కలిపి, వారి సంసారంలో నిప్పులు పోస్తున్నారు. ఇటువంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా జరిగాయి. ఇక తాజాగా నాదెండ్ల మండలంలో మటన్ ఇస్తేనే పింఛన్ ఇస్తానని, ఒక వాలంటీర్ షరతు విధించారట.
2024లో తిరిగి వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే, వాలంటీర్ల జీతాలను 15 వేలకు పెంచుతామని మంత్రి విశ్వరూప్ పేర్కొనడం హాస్యాస్పదం. అల్లవరంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశమైన ఆయన, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరడం విడ్డూరం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని చెప్పడం మాత్రం నిజం.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల దుస్థితిపై రఘురామకృష్ణం రాజు ఒక నీతి కథను వినిపించారు.
ప్రభుత్వ ఉద్యోగులు తొలుత సిపిఎస్ రద్దు కోరుకున్నారని, ఆ తర్వాత డి ఏ ల కోసం పట్టుపట్టారని, ఇప్పుడు జీతాలు వస్తే, చాలు అని పరిస్థితికి నెట్టి వేయబడ్డారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ప్రభుత్వ విధానాలు నచ్చక దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో, ఆయన స్థానంలో గతంలో సచివాలయాన్ని ఒక ఊపు ఊపిన ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టడం… ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టనుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.