Suryaa.co.in

Andhra Pradesh Telangana

కాంగ్రెస్ ను వీడుతానని ఎప్పుడూ అనుకోలేదు..: కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని తను ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోయిందని చెప్పారు. విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో బాధపడుతోందని చెప్పారు. కాంగ్రెస్ కు అధికారం కావాలని, బాధ్యతలు అవసరం లేదని అన్నారు. రాష్ట్ర నాయకుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించరని, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో కూడా వారికి అవగాహన ఉండదని చెప్పారు. అందుకే ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోందని అన్నారు.

1980లలో తొలి ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు వచ్చాయని, ఒకటి ఏపీలో, మరొకటి గుజరాత్ లో వచ్చాయని కిరణ్ చెప్పారు. ఆ రెండు సీట్ల నుంచి 303 స్థానాలకు బీజేపీ ఎదిగిందని తెలిపారు. ఎంతో కష్టపడి బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. దేశ అభివృద్ధికి సంబంధించి బీజేపీకి క్లియర్ విజన్ ఉందని కితాబునిచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా సీఎంగా ఉన్నారని… తాము అప్పుడు కొన్ని సమావేశాల్లో కలుసుకున్నామని, ఆయన గురించి తనకు బాగా తెలుసని, అవినీతికి మోదీ పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి ప్రజలు దగ్గరయ్యారని చెప్పారు. బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

LEAVE A RESPONSE